తిరుమల కొండల్లో తప్పిన భారీ ముప్పు..
x

తిరుమల కొండల్లో తప్పిన భారీ ముప్పు..

పాపవినాశనం మార్గంలో కార్చిచ్చుతో హైరానా..


తిరుమల కొండల్లో కార్చిచ్చు తీవ్ర ఆందోళనకు కలిగించింది. అప్రమత్తమైన టిటిడి యంత్రాంగం ప్రమాదం జరగకుండా నివారించడానికి తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమల నుంచి పాప వినాశనం వెళ్లే మార్గంలో ఉన్న కాకులుమాను దిబ్బ అటవీప్రాంతంలో శుక్రవారం ఉదయం ఒకసారిగా మంటలు చెలరేగాయి. పవన విద్యుత్ యంత్రాలకు పక్కనే అగ్నికీలలు ఎగిసిపడడంతో టీటీడీ అటవీ శాఖ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు కూడా రంగం లోకి దిగారు. రెండు అగ్నిమాపక యంత్రాలతో తీవ్రంగా శ్రమించి, మంటలు అదుపు చేశారు.

తిరుమల సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతం కాకులమానుదిబ్బ వద్ద చెలరేగిన మంటలు వల్ల ఏర్పడిన పొగా తిరుమలను కమ్మేసింది. ఈ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేశారు.

అదుపులోకి మంటలు..

తిరుమల శ్రీవారి క్షేత్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కనే మంటలు వ్యాపించడం తీవ్ర కలకలం చెలరేగింది. టిటిడి అటవీశాఖ సిబ్బందితోపాటు రెండు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించిన రెండు శాఖల సిబ్బంది నీటిని వెదజల్లడం ద్వారా మంటలను అదుపు చేశారు. దీంతో తిరుమలలో భారీ ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు.

వేసవి కావడం వల్ల..

తిరుమల శ్రీవారి క్షేత్రం చుట్టూ దట్టమైన అడవులు విస్తరించి ఉన్నాయి. వేసవి కాలం కావడంతో చెట్ల కొమ్మలు విరిగిపడడం, ఎండిన ఆకుల వల్ల నిప్పు పడటంతో మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. సకాలంలో స్పందించడం వల్ల మంటలు అదుపులోకి వచ్చాయి అనేది తిరుమల నుంచి అందిన సమాచారం.
తిరుమలలో సుమారు ఐదేళ్ల కిందట చెలరేగిన మంటలు వారం రోజులపాటు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. తిరుమల కొండలతో పాటు దిగువన ఉన్న తిరుపతి నగరానికి సమీపంలోని మంగళం ప్రాంతం వైపు కూడా మంటలు విస్తరించాయి. చంద్రగిరి వైపు కూడా మంట దావానలం వ్యాపించడంతో టీటీడీ అధికారులు అత్యవసరంగా ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సహకారం తీసుకున్నారు. రెండు హెలికాప్టర్లు మూడు రోజుల పాటు అవిశ్రాంతంగా శ్రమించి మంటలను అదుపు చేయడం ద్వారా యాత్రికులకు ఎలాంటి ప్రమాదం లేకుండా నివారించగలిగారు.
Read More
Next Story