
తిరుమల: వసతి కావాలా.. టెన్షన్ పడకండి...
సింహ నిలయం అతిథి గృహం ప్రారంభం. అందుబాటులోకి మరో 200 గదులు.
శ్రీవారి సర్వదర్శనానికి టికెట్ తీసుకోవడం కష్టంగా ఉందబ్బా. దర్శనం టికెట్ దొరికింది. వసతి గది కోసం ప్రయత్నించాలి.
తిరుమలకు వచ్చే యాత్రికుల నుంచి సాధారణంగా వినిపించే మాటలు ఇవి.
"తిరుమలలో 200 గదుల అందుబాటులోకి వచ్చాయి" అని టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్యచౌదరి చెప్పారు. ఇకపై గదుల సమస్యకు ఆస్కారం ఉండదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
తిరుమలలోని అదనపు ఈఓ కార్యాలయం సమీపంలో సెల్ కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ "సింహ నిలయం" అతిథి గృహాలను బుధవారం అదనపు ఈఓ వెంకయ్య చౌదరితో కలిసి ఈఓ రవిచంద్ర ప్రారంభించారు. డిప్యూటీ ఈఓ భాస్కర్, సెల్ కాన్ సంస్థ సీఎండీ గురుస్వామి నాయుడు, అధికారులు పాల్గొన్నారు. ఇదిలావుంటే.. వేసవి సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో తిరుమలలో వసతి సమస్య ప్రధానంగా వినిపిస్తుంది.
ఆన్ లైన్ లో కేటాయింపు..
తిరుమలకు రోజూ సగటున 65 వేల నుంచి 80 వేల మంది వరకు యాత్రికులు శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, రూ. 300 శీఘ్రదర్శనం టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో కూడా వసతి గదులు కేటాయించడానికి టీటీడీ ఆన్ లైన్ విధానం అమలు చేస్తోంది. మూడు నెలలకు ఒకసారి సేవా టికెట్లతో పాటు, వసతి గదులను కేటాయించడానికి స్లాట్లు ఆన్ లైన్ విడుదల చేస్తోంది.
తిరుమలకు వచ్చే యాత్రికుల కోసం టీటీడీ వంద రూపాయల నుంచి లగ్జరీ అతిథి గృహాల్లో సుమారు 8,000 ధరతో అద్దె గదులు అందుబాటులో ఉన్నాయి. గదులు లభించని యాత్రికుల కోసం ఐదు పీఏసీ (Public Amenities Complex PAC) లను అందుబాటులో ఉంచింది. తిరుమలలో అతిథి గృహాల తోపాటు, కాటేజీలు, వసతి సముదాయాల్లో దాదాపు 7,500 గదులు అందుబాటులో ఉంచింది. వారిలో మూడు వేల గదులు వీఐపీ, వీవీఐపీలకు కేటాయిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల 4,500 గదుల వరకు రోజు ఆన్ లైన్, నేరుగా వచ్చిన యాత్రికులకు కేటాయించడానికి కూడా ప్రత్యేక పద్ధతులు అమలు చేస్తోంది.
"తిరుమలలో సుదర్శన్ సత్రంలో 386, గోవర్థన్ లో186, కల్యాణి అతిథి గృహాల సముదాయంలో 260 గదులు కూడా సామాన్య యాత్రికులకే కేటాయిస్తున్నాం" అని టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చెప్పారు.
తిరుమల సీఆర్ఓ కార్యాలయం...
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు ఆర్టీసీ బస్టాండు సమీపంలోని సీఆర్ఓ, కేంద్రీయ విచారణ కార్యాలయంలో గదుల కేటాయించడానికి టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. సామాన్య యాత్రికులు, వీఐపీ గదుల సముదాయంలో వేర్వేరుగా ఇద్దరు డిప్యూటీ ఈఓల సారధ్యంలో, ఏఈఓ, సూపరింటెండ్లతో పాటు సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేశారు.
"ఈ కార్యాలయం ద్వారా సామాన్య యాత్రికులకు రోజూ దాదాపు 6,626 గదులు కేటాయించడం ద్వారా సేవలు అందిస్తున్నాం" అని టీటీడీ రిసెప్షన్ అధికారులు చెప్పారు. ఎలాంటి సిఫారసు లేకుండానే ఆధార్ కార్డు, టికెట్ ఆధారంగా వసతి గదులు కేటాయిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చెప్పారు.
గది దొరకకుంటే..
తిరుమలకు వచ్చే యాత్రికులకు గదులు దొరకున్నా ఇబ్బంది లేకుండా టీటీడీ ఐదు పీఏసీ (Public Amenities Complex PAC)లు అందుబాటులో ఉంచింది. తిరుమలలో 45 వేల మందికి మాత్రమే వసతి కల్పించడానికి ఆస్కారం ఉంది. గత ఏడాది అక్టోబర్ లో నిర్వహించన బ్రహ్మోత్సవాల వేళ పీఏసీ 5 ప్రారంభించారు.
"ఇక్కడ 2,500 మంది యాత్రికులు సులభంగా వసతి సదుపాయం సద్వినియోగం చేసుకునే అవకాశాలు అందుబాటులోకి తెచ్చాం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు. అదనంగా ఇక్కడ మరో వెయ్యి మంది యాత్రికుల విశ్రాంతి తీసుకునే విధంగా వసతులు కల్పించామని కూడా నాయుడు చెప్పారు.
సదుపాయాలు ఇవీ
తిరుమలలోని పీఏసీ 5లో మిగతా వసతి సముదాయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా వసతులు కల్పించారు. లాకర్ సదుపాయం తలనీలాలు సమర్పించే సదుపాయం, స్నానాల గదులు, సేదదీరడానికి తోపాటు విశాలమైన హాళ్లు ఉన్నాయి. ఇక్కడే ఉచిత అన్నదాన పథకంలో అన్నప్రసాదాలు కూడా వడ్డుస్తున్నారు. మిగతా పీఏసీ 1,2,3,4 లో మాత్రం లాకర్లు, సేదదీరడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రాల్లోనే కల్యాణకట్ట (తలనీలాలు సమర్పించే సదుపాయం) అందుబాటులో ఉంది. సమీపంలోనే అన్నదాన కేంద్రం నుంచి తీసుకుని వచ్చే అన్నప్రసాదా పంపిణీకి ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి, శ్రీవారి సేవకులతో వడ్డిస్తున్నారు.
అదనంగా పెరిగిన గదులు
తిరుమలలోని టీటీడీ అదనపు ఈఓ కార్యాలయం సమీపంలో సెల్ కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ "సింహ నిలయం" నిర్మాణాలు పూర్తి చేసింది. దీనివల్ల 200 గదులు అందుబాటులోకి రానున్నాయి. ఇవి పూర్తిగా వీఐపీలకు మరింత సేవలు అందించే విధంగా కనిపిస్తోంది.
"నూతన కాటేజీ డొనేషన్ పాలసీ ద్వారా సెల్ కాన్ సంస్థ నూతనంగా అతిథి గృహాన్ని నిర్మించి టీటీడీకి అప్పగించింది" అని అదనపు ఈఓ వెంకయ్య చౌదరి చెప్పారు. ఈ పాలసీలో దాదాపు 24 అతిథి గృహాలను దాతల ద్వారా నిర్మించేందుకు టీటీడీ పాలక మండలి అనుమతి ఇచ్చిందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 16 అతిథి గృహాలను దాతలు నిర్మించి టీటీడీకి అప్పగించారని ఆయన తెలిపారు. ఈ సముదాయాల వల్ల దాదాపు 200 గదులు అదనంగా యాత్రికులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇవి సామాన్య యాత్రికులకే కేటాయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
తీరనున్న కొరత
తిరుమలలో గదులు లభించని సామాన్య యాత్రికుల కోసం పీఏసీ1,2,3 భవనాలు దశాబ్దాల కాలం కిందట ఏర్పాటు చేశారు. వీటి మరమ్మతు పనులు ప్రారంభం అయ్యాయి. 2025 నవంబర్ లో తిరుమలలో పీఏసీ 1,2,3 భవనాల ఆధునీకరణ తోపాటు వసతులు మెరుగుపరచడానికి ఎన్ఆర్ఐ మంతెన రామలింగరాజు తొమ్మది కోట్ల రూపాయలు విరాళం అందించారు. గతంలో ఆయన 16 కోట్ల రూపాయలు విరాళాలు అందించిన విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు
శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు వసతి సముదాయం-1 కూడా ఆత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు
టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అన్ని వర్గాలకు చెందిన భక్తులకు తిరుమలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Next Story

