Courtesy AI
x

మరణంలోనూ వీడని ప్రేమ బంధం

చిత్తూరులో ఇద్దరు పిల్లలతో కలిసి భార్యాభర్త ఆత్మహత్య వెనుక ఓ విషాథ గాధ


ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్యకు మెదడు జబ్బు చేసింది. అప్పటికే వారికి ఒక కూతురు, ఓ కొడుకు. భార్యకు జబ్బు నయం చేయించడానికి బాధలు పడ్డారు. అయినా ఆర్థిక స్థోమత చాలలేదు. ఎంత ఖర్చు చేసినా, ఫలితం ఉండదనే వైద్యుల మాటలు ఆ వ్యక్తిని వేదనకు గురి చేశాయి. తామిద్దరం చనిపోతే, పిల్లల పరిస్థితి ఏమిటని మథనపడ్డారు. ఇద్దరు పిల్లలతో కలిసి భార్యాభర్త ఆత్మహత్మకు పాల్పడ్డారు. మరణం తరువాత కూడా ఎవరికీ భారం కాకూడదని, బ్యాంకు ఖాతాలో మిగిలిన సొమ్ముతో అంత్యక్రియలు నిర్వహించాలని ఓ చీటి రాశారు. ఎటీఎం కార్డు పిన్ నంబర్ రాసిన పేపర్ టీవీపై అతికించారు. ఈ విషాధ ఘటన చిత్తూరు నగరంలో చోటుచేసుకుంది.

చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లెలో జరిగిన ఈ ఘటన వెనుక తీరని విషాదం ఉంటే, పిల్లలతో కలిసి భార్యాభర్త ఆత్మహత్యకు పాల్పడడం గ్రామస్తులను మరింత వేదనకు గురి చేసింది.

ప్రేమించి పెళ్లి చేసుకుని...

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండీపేట కోటూరు గ్రామానికి చెందిన దామోదరం (35)కు బాల్యంలోనే తల్లిని కోల్పోయారు. తండ్రి మరో ప్రాంతానికి వెళ్లిపోయాడు. గత్యంతరం లేని స్థితిలో చిత్తూరుకు సమీపంలోని బంగారెడ్డిపల్లెలో ఉంటున్న అక్కా, బావ వద్దకు చేరాడు. పెద్దవాడయ్యాక బావ గోపీతో కలిసి తాపీ మేస్త్రీ పనులకు వెళ్లేవాడు. ఇదే క్రమంలో అప్పిరెడ్డిపల్లెకు చెందిన నిర్మల (28)ను దామోదరం ప్రేమించి పెళ్ల చేసుకున్నాడు. వారికి దిలీప్ (12), శ్రీవిద్య (10) పిల్లలు. కాలం గడుస్తోంది.

భార్యకు జబ్బు..

భార్య నిర్మలకు మెదడు జబ్బు సోకింది. అన్ని చోట్ల చూపించాడు. తన శక్తి మేరకు భార్యకు చికిత్స చేయించడానికి ప్రయత్నించాడు. భార్య నిర్మల ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయనకు సీఎం సహాయ నిధి నుంచి రూ. లక్ష మంజూరైంది. ఈ నగదు చాలలేదు. చెన్నైకి తీసుకుని వెళ్లి భార్య నిర్మలకు చికిత్స చేయించడానికి దామోదరం ప్రయత్నించాడు. ఖర్చు చేసినా, ఫలితం ఉండదనే విషయం తెలుసుకున్న దామోదరం కుంగిపోయాడు. భార్యా భర్తలిద్దరూ తీవ్రంగా కుమిలిపోయారు. తాము మరణిస్తే, పిల్లల పరిస్థితి ఏమిటనేది మానసికంగా సంఘర్షణకు లోనయ్యారు.
"మేము చనిపోవడం ఖాయం. ఈ భారం భరించలేను. పిల్లలను అనాథలుగా వదల లేం" అని దామోదరం చెప్పేవాడని ఆయన అక్క చిన్నమ్మ కన్నీటిపర్యంతం అయింది.
ఆదివారం రాత్రి దామోదరం భార్య నిర్మల, కూతురు శ్రీవిద్య, కొడుకు దిలీప్ తో కలిసి అక్క ఇంటికి వెళ్లారు. అందరూ కలిసి భోజనాలు చేశారు. అదే చివరి చూపు, కలిసి భోజనం చేయడం అనేది అక్క చిన్నక్క ఊహించలేకపోయింది.

కలిసే వెళ్లిపోయారు..

ఇంటికి తిరిగి వచ్చిన దామోదరం భార్య నిర్మల తాను తాగడం తోపాటు పిల్లలకు విషం తాపించినట్లు సందేహిస్తున్నారు. ఆ ముగ్గురూ మరణించారని నిర్ధారించుకున్న తరువాత దామోదరం ఉరివేసుకుని మరణించాడు. సోమవారం ఉదయం ఎంతకూ ఇంటి ముందు అలికిడి లేకపోవడంతో దామోదరం అక్క చిన్న సందేహించింది. ఇంటి వద్దకు వెళ్లి చూసే సరికి తమ్ముడు దామోదరం ఉరితాడుకు వెళాడుతుండడం, నిర్మల, పిల్లలు విగతీజీవులుగా కనిపించడంతో గుండెలు బాదుకుంది. సోమవారం సాయంత్రం జిల్లా ఆస్పత్రిలో శవపరీక్ష అనంతరం, అంత్యక్రియలు నిర్వహించారు. చిత్తూరు రూరల్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read More
Next Story