Tirumala Hundi |సిరిసంపదల దేవుడి ‘చిరు సంపద’ గలగల వింటారా?
x

తిరుమల శ్రీవారి ఆలయం

Tirumala Hundi |సిరిసంపదల దేవుడి ‘చిరు సంపద’ గలగల వింటారా?

వడ్డికాసుల వాడి నాణేల కానుకల గమ్యం ఏమిటి?


తిరుమల పేరు వినగానే అక్కడి కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. అందులో శ్రీవారి హుండీకి యాత్రికులు సమర్పించే కానుకల లెక్కింపు కోసం కూడా పటిష్టమైన ప్రత్యేక వ్యవస్థను టీటీడీ ఏర్పాటు చేసింది. తొలినాళ్లలో చిల్లర నాణేలు జల్లెడ పట్టి వేరు చేసే చేయడం నుంచి ప్రస్తుతం జర్మనీ యంత్రాలతో తూకం వేసే స్థితికి పరిణామాలు మార్పులు జరిగాయి. ఇంతటి ఆదాయం వెనుక కూడా ఓ రహస్యం ఉంది.
తిరుమలలోని 30వ వరకు ఉన్న జాతీయ బ్యాంకుల్లో కొన్నింటిలో డిపాజిట్ చేయడం, వారి ద్వారా చిల్లర కొరత తీర్చడానికి వీలుగా చెలామణి చేస్తున్నారు.
తిరుమలలోని 30 జాతీయ బ్యాంకుల్లో ఒకో రోజు ఓ బ్యాంకుకు పరకామణి ఆదాయం డిపాజిట్ చేయడానికి టీటీడీ అవకాశం కల్పిస్తోంది. ఈ నెల ప్రారంభంలో చిల్లర నాణేలు రూ. 30 లక్షల వరకు అందాయని తిరుమల ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ రవికిరణ్ చెప్పారు.
"చిల్లర నాణేల కొరత రాకుండా నివారించడానికి ఆర్బీఐ ఆదేశాల ప్రకారం జిల్లాలోని 11 బ్యాంకుల ద్వారా ప్రజలు, చిల్లర వర్తకులకు ట్రాన్సాక్షన్ చేస్తున్నాం" అని కూడా రవికిరణ్ తెలిపారు. తిరుమలలో ఈ నెల ప్రారంభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పరకామణి మొత్తం అందించే సమయంలో రూ. 30 లక్షల వరకు చిల్లర నాణేలు డిపాజిట్ అయ్యాయి.
టిటిడి పరిపాలన వ్యవహారాలు ఒక ఎత్తైతే. యాత్రికుల కోసం కల్పిస్తున్న సదుపాయాలు, వారి ద్వారా హుండీ కి లభించే ఆదాయం లెక్కించడంలో కూడా అనుసరించే విధానాలు మరింత ఆసక్తికరంగా కనిపిస్తాయి. శ్రీవారి దర్శనానికి రోజూ సరాసరిగా 65 వేల నుంచి 80 వేల మంది యాత్రికులు దర్శించుకుంటుంటే, వారి ద్వారా తిరుమల శ్రీవారి హుండీకి సగటున మూడు కోట్ల రూపాయల నుంచి నాలుగు కోట్ల రూపాయలకు పైబడే ఆదాయం వస్తుంది. అందులో దేశ విదేశీ కరెన్సీ నోట్ల తో పాటు నాణేలు కూడా రోజుకు 30 నుంచి 35 లక్షలు ఆదాయం రూపంలో లభిస్తోంది.

తిరుమల శ్రీవారి ఆలయం నుంచి హుండీలు పరకామణికి తరలించడం. అక్కడి నుంచి బ్యాంకులు. ఆ తర్వాత ఆ నాణేలు వినియోగదారులకు జాతీయ బ్యాంకు శాఖల ద్వారా అందించడంలో ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు..
ఈస్టిండియా కంపెనీ పాలనలోనే 1821 జూలై 25వ తేదీ తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీ ఏర్పాటు చేశారు. చాలా మందికి తెలియని 11 ఆసక్తికర వివరాలు ఉంటే, అప్పట్లో ఈస్టిండియా కంపెనీ చట్టం బ్రూస్కోడ్ -12లో ఆ వివరాలు సమగ్రంగా ప్రస్తావించారు.

కొప్పెర


1) శంఖుచక్రాలు, తిరునామాలు ముద్రించిన రాగి రంగాళాన్ని శ్రీవారి హుండీగా ఏర్పాటు చేయించారు. దీనికి కొప్పర అనే పేరు కూడా ఉంది.

2) హుండీలో నగలు, వెండి వస్తువులు, ముడుపులు, నాణేలు, నోట్లు, కర్పూరం, బియ్యం సహా ఎన్నో వస్తువులు పాతకాలంలో యాత్రికులు సమర్పించేవారు. మందంగా ఉండే కాన్వాసు గుడ్డపై శ్రీవారి తిరునామాలు చిత్రించి, పై గుడ్డను రోలు మాదిరి తాళ్లతో కట్టి వేలాడదీస్తారు. అడుగుభాగంలో హుండీ ఉంటుంది.
3) 1830లోనే తిరుమల హుండీ ఆదాయంలో పూజలు, అర్చనలు, ఉత్సవాల ఖర్చులు మినహాయిస్తే, ఈస్టిండియా కంపెనీకి రూ. లక్ష వరకు ఆదాయం ఉన్నట్లు పాత రికార్డుల ద్వారా తెలుస్తోంది.
4) ఈస్టిండియా కంపెనీ నుంచి మహంతుల పాలన, టీటీడీ ఏర్పడిన తరువాత కూడా అదే పద్ధతి అమలులో ఉంటే, లక్కతో హుండీ గుడ్డ, తాళ్లపై టీటీడీ సీళ్లు ఏడు, జియ్యంగార్ మఠం ఆరు సీళ్లు వేస్తుంది. పరకామణికి చేర్చిన తరువాత కూడా ఆ సీళ్లు భద్రంగా ఉన్నాయా లేవా అనేది కూడా పరిశీలిస్తారు.
5) హుండీకి సాక్ష్యంగా ఇద్దరు యాత్రికుల సంతకాలు తీసుకుంటారు. రోజూ మధ్యాహ్నం రెండో నైవేద్యం 12 గంటలకు విరామ సమయం. రాత్రి ఏకాంతసేవా సమయంలో హుండీలు తెరుస్తారు.

ఆదాయం వెనుక రహస్యం...

శ్రీవారికి యాత్రికుల తాకిడి, ఆదాయం వెనుక కూడా చారిత్రక కథనం ఉంది. తిరుమల శ్రీవారి ఆలయంలో హుండీని ఏర్పాటు చేసిన స్థలంలో జగద్గురువు మశ్చంకర భవత్పాదుల వారు శ్రీకచక్రాన్ని ప్రతిష్టించారనేది కథనం. అందువల్లే అపరిమితమైన సంపద, అసంఖ్యాక యాత్రికులు వస్తున్నారనేది పరంపరగా వినిపిస్తున్న చరిత్ర కథ.
"నేను వేద విద్యార్థిగా ఉన్నప్పుడు ఆలయ అధికారులు ఓ సందర్భంలో నిర్మాణ పనులు చేపట్టినప్పుడు శ్రీచక్ర యంత్రం చూశాను" అని టీటీడీ వేద పండితుడు రామనాథ ఘనాపాటి మాటలను ఓ ఆధ్యాత్మిక రచనలో ఉటంకించడం గమనార్హం.

రూ. 30 లక్షల చిల్లర నాణేలు..


తిరుమల శ్రీవారిని రోజూ కనీసంగా 65 వేల నుంచి 80 వేల మంది వరకు యాత్రికులు దర్శించుకుంటూ ఉంటారు. వారి ద్వారా సగటున రోజుకు 3.50 కోట్ల నుంచి నాలుగు కోట్ల రూపాయల మధ్య ఆదాయం ఉంటుంది.తిరుమల శ్రీవారిని

ఈ నెల 22వ తేదీ ఆదివారం (సోమవారం వెల్లడించిన లెక్క) 86,091 మంది యాత్రికులు దర్శించుకున్నారు. వారి ద్వారా రూ.4.21 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
21వ తేదీ శనివారం 77, 864 మంది యాత్రికులు, 3.33 కోట్లు,
20వ తేదీ గురువారం 52 272 మంది యాత్రికుల ద్వారా 3.37 కోట్లు ఆదాయం లభించింది.
ఈ రోజుల్లో శ్రీవారి హుండీకి యాత్రికులు సమర్పించిన కానుకల్లో చిల్లర నాణేలు కూడా 18 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉన్నట్లు ఓ బ్యాంకు అధికారి చెప్పారు.
మార్చి 22వ తేదీ కూడా దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు చిల్లర నాణేలు ఉన్నట్లు సమాచారం. 2026 నాటికి టీటీడీకి వివిధ జాతీయ బ్యాంకుల్లో ఫిక్సుడ్ డిపాజిట్ల విలువ 18,000 కోట్ల నుంచి 19,000 కోట్ల రూపాయల వరకు ఉన్నట్లు లెక్కలు నివేదికలు చెబుతున్నాయి. 2022లో మొత్తం 15,938 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఓ అంచనా.

జల్లెడ నుంచి జర్మనీ యంత్రాల వరకు..


తిరుమల శ్రీవారి హుండీకి యాత్రికులు సమర్పించే కానుకలను తొలినాళ్లలో జల్లెడ, మనుషులు కానుకలు వేరు చేసేవారు. ప్రస్తుతం జర్మనీ యంత్రాలతో వేరు చేయడం వరకు మార్పులు జరిగాయి.

1) 1980 వరకు చేతితో లెక్కించే వారు. శ్రీవారి సన్నిధికి వెనుకవైపు మండపంలో పారదర్శకంగా పాటించే విధంగా అద్దాల చాటున హుండీ లెక్కింపు జరిగేది.
2) గంగాళాల్లోని కానుకలు కుమ్మరించి, నాణేలు, కరెన్సీ నోట్లు వేరు చేసే వారు. ఇనుప జల్లెడల్లో ఒకపైసా, రెండు, మూడు (అర్ధ అణ), ఐదు, పది, 20, 25, 50 పైసలు, రూపాయి నాణేలు వేరు చేయడానికి ఆ నాణెం సైజులోని రంధ్రాల నుంచి కింద పడితే వాటిని కిలోల లెక్కన తూకం వేసి, మొతం మదింపు చేసి, గన్నీ గోతాల్లో నింపేవారు. ఇది శ్రమతో కూడుకున్నది కావడం వల్ల మార్పులు చేశారు.
రెండో దశలో..
3) 1990-2010 మధ్య యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానుకలు లెక్కింపు మరింత వేగవంతం చేయడానికి విద్యుత్ యంత్రాలు అమలులోకి తెచ్చారు.
నాణేలు వేరు చేసే యంత్రాలు : నాణేం వ్యాసార్థం ఆధారంగా వేరు చేసేందుకు చిన్న మిషన్లు ప్రవేశపెట్టారు. కరెన్సీ నోట్లు లెక్కించడానికి కౌంటింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు.
మూడో దశ..
2012 -2022 మధ్య శ్రీవారి హుండీ కానుకలు లెక్కించడానికి స్థలాభావం ఏర్పడింది. దీంతో బెంగళూరుకు చెందిన దాత మురళీ అందించిన పది కోట్ల రూపాయల విరాళంతో ఆలయం వెలుపల ప్రత్యేకంగా పరకామణి భవనం ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా కొన్ని సెమీ ఆటోమేటిక్ విదేశీ యంత్రాలు వినియోగంలోకి తెచ్చారు.

నాలుగో దశ.. హైటెక్ లెక్కింపు
2023లో బెంగళూరుకు చెందిన మురళీ అనే దాత పది కోట్ల రూపాయల విరాళంతో అధునాత పరకామణి భవనం ఏర్పాటు చేశారు. కానుకల లెక్కింపులో హైటెక్ పద్ధతులు అనుసరిస్తున్నారు.
తిరుమల పరకామణిలో ప్రస్తుతం జర్మనీ సాంకేతిక పరిజ్ణానంతో తయారు చేసిన (Giesecke + Devrient- G+D) మిషన్లతో కానుకలు లెక్కిస్తున్నారు.

ప్రత్యేకతలు

నిమిషం వ్యవధిలోనే వేల నాణెలు లెక్కించడం ఈ యంత్రాల సొంతం. నాణేల బరువు, పరిమాణం ఆధారం నకిలీని గుర్తిస్తాయి. ఇతర దేశాల నాణేలను కూడా పనిగడతాయి. లెక్కించిన నాణేలను నిర్ణీత సంఖ్యలో ఆటోమేటిక్ గా గన్నీ బ్యాగుల్లో నింపి ప్యాక్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం అంతా సీసీ టీవీ నిఘాలో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం పర్యవేక్షిస్తుంది. శ్రీవారి పరకామణిలో భద్రతా ప్రమాణాల్లో భాగంగా బయోమెట్రిక్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంఫికేషన్ ( RFID) ట్యాగింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్
టీటీడీ తన నిధులు సుమారు 25 నుంచి 30 ప్రభుత్వ రంగ, షెడ్యూల్డ్ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తోంది. పరకామణి కానుకలు లెక్కించిన తరువాత నెలలో ఒకో రోజు ఓ బ్యాంకుకు ఆ మొత్తం ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడానికి టీటీడీ అందజేస్తోంది.
టీటీడీ ప్రధాన ఆదాయం ఎస్బీఐలో నగదు, బంగారు డిపాజిట్లు చేస్తోంది. ఆ తరువాత యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకుతో పాటు జాతీయ బ్యాంకులకు ప్రాధాన్యత ఇస్తోంది.
"ప్రధానంగా అధికంగా వడ్డీ చెల్లించే బ్యాంకుల్లో మాత్రమే టీటీడీ నగదు, బంగారు డిపాజిట్ చేయడానికి మొగ్గు చూపుతుంది" అని టీటీడీ సీనియర్ అధికారి చెప్పారు.

పరకామణిలో బరువు నిర్ధారణ ఇలా..


పరకామణిలో నాణేలు లెక్కించడం సాధ్యం కాదు. జర్మన్ యంత్రాలతో నాణేల బరువు, సైజు ఆధారంగా విలువ నిర్ధారిస్తారు. గన్నీ బ్యాగుల్లో యంత్రాలే నింపుతాయి. అవి ఇలా..

ఒక రూపాయి నాణేలు: 2,500 (ఓ గన్నీ బ్యాగులో బరువు)
రూ. 2: నాణేలు 500
రూ.5 : నాణేలు రూ. పది వేలు
రూ.10 : నాణేలు రూ.20 వేలుగా నిర్ధారించి బ్యాగుల్లో నింపడం ద్వారా బ్యాంకులకు అప్పగిస్తున్నారు.

11 బ్యాంకులకు పంపిణీ..


పరకామణి నాణేలను తిరుమల బ్యాంకుల నుంచి జిల్లాలోని మిగతా శాఖలకు అందజేస్తున్నారు. షాపింగ్ మాల్స్, చిల్లర దుకాణాలు, చిరు వ్యాపారులకు చిల్లర కొరత లేకుండా నిర్దిష్ట నాణేల బ్యాగుల్లో నాణేలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు.

"తిరుపతి నుంచి సూళ్లూరుపేట, తిరుపతి నుంచి నగరి వరకు ఉన్న 11 బ్యాంకులకు నాణేల బ్యాగులు ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా పంపింణీ చేస్తున్నాం" అని తిరుమల ఎస్పీఐ మేనేజర్ రవికిరణ్ చెప్పారు. అయినా రూపాయి, రెండు, ఐదు రూపాయల నాణేల కొరత ఉన్న వాతావరణం సర్వసాధారణంగా కనిపిస్తోంది.

Read More
Next Story