విజయనగర సామ్రాజ్యం అనగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణదేవరాయలవారి ( Sri Krishnadevaraya)
కాలంలో సాగిన పాలన. 1509 నుంచి 1529 సంవత్సరం వరకు సాగిన ఆయన పాలనలో విజయనగర సామ్రాజ్యం ( Vijayanagara Empire ) చరిత్రలో స్వర్ణయుగంలా సాగిందనేది చరిత్ర చెప్పే పాఠం. శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు చనిపోయారు? ఆయన సమాధి ఎక్కడ ఉందనే విషయంపై ఇప్పటి వరకు రహస్యంగా మిగిలిపోయింది.
"శ్రీకృష్ణదేవరాయల వారి మరణంపై కర్ణాటక రాష్ట్రం తుముకూరు వద్ద శాసనం లభించింది" దీంతో మిస్టరీ వీడింది. ఆయన మరణం తరువాత ఆయన మరణం తరువాత రెండు రోజులకే అచ్యుతరాయులు శ్రీకాళహస్తి, తిరుమల శ్రీవారి చెంత పట్టిభిషేకం చేసుకున్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా Archaeological Survey of India (ASI) డైరెక్టర్ కే. మునిరత్నంరెడ్డి వెల్లడించారు.
"ఆ శాసనంలోని లిపిని పరిశోధన చేయడం ద్వారా రాయలవారు ఎప్పుడు మరణించారు. ఆయన సమాధి ఎక్కడ ఉందనే విషయంపై స్పష్టత వచ్చింది" అని మునిరత్నంరెడ్డి 'ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధుల ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి
హంపీ చూడాల్సిందే..
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా హోస్పేటకు సమీపంలోని హంపీని కేంద్రంగా చేసుకుని విజయనగర చక్రవర్తుల పాలన సాగింది. శ్రీకృష్ణదేవరాయవారి పాలన1509 నుంచి 1529 వరకు 20 సంవత్సరాలు సాగింది. అంతకుముందు 1336లో సంగమ వంశానికి చెందిన మొదటి హరిహరరాయలు, ఆయన సోదరుడు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్య స్థాపకుల్లో మొదటి వారు అనేది చరిత్రను అధ్యయనం చేసిన మునిరత్నం రెడ్డి వివరించారు.
విజయనగర సామ్రాజ్యంలో భాగమైన పురాతన కట్టడాలు, ఆలయాలు, చెరువులు రాయలసీమలో కూడా పదిలంగా ఉన్నాయి.
తిరుమల పాదాల మండపం వద్ద రాజగోపురం కూడా 500 సంవత్సరాల కిందట హరిహరరాయలు కాలంలోనే నిర్మించారనేది చరిత్ర మనకు అందించిన కథనం. ఈ గోపురంపై వారి రాజముద్రగా ఖడ్గం, వరాహం (పంది) కూడా గోపురంపై చిత్రించిన కళాఖందాలే సాక్ష్యమని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నంరెడ్డి స్పష్టం చేశారు.
రాయలవారి సమాధి ఆచూకీ ఎలా తెలిసింది..?
విజయనగర సామ్రాజ్య వైభవం 1336లో సంగమ రాజవంశంలో మొదటి హరిహరరాయలు, ఆయన సోదరుడు బుక్కరాయల కాలం నుంచి ప్రారంభమైంది. ఆ తరువాత శ్రీకృష్ణదేవరాయల వారి పాలన 1509 సంవత్సరం నుంచి 1529 వరకు 20 ఏళ్లు సాగింది. వారి వంశపారంపర్యంలో చివరి రాజు అరవీణుడితో శకం ముగిసింది.
"శ్రీకృష్ణదేవరాయలువారి తిరుమల శ్రీవారిని ఏడుసార్లు దర్శించుకున్నారు. శ్రీవారికి ఆయన సమర్పించిన కానుకలు అమూల్యమైనవి" అని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నంరెడ్డి వివరించారు. అయితే రాయలవారు ఎప్పుడు చనిపోయారు, ఎలా చనిపోయారు అనేది చరిత్ర కారుల్లో అనేక సందేహాలు, చర్చలు, విభిన్న అభిప్రాయాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
శాసనంతో వీడిన మిస్టరీ
వందల సంవత్సరాల నాటి శిథిలాల్లో శ్రీకృష్ణదేవరాయల వారి వంశానికి చెందిన అనేక అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణదేవరాయలవారి మరణానికి సంబంధించిన శాసనం దొరకడం వల్ల సందిగ్ధత, సందేహాలకు తెరపడింది. కర్ణాటక రాష్ట్రంలోనే శ్రీకృష్ణదేవరాయలు మరణించారు. ఆయన సైన్యాధికారి ఏర్పాటు చేయించిన శాసనం ద్వారా ఈ విషయం తెలుసుకున్నట్లు ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నంరెడ్డి చెప్పారు.
శ్రీకృష్ణదేవరాయలవారి మరణధ్రువీకరణ పత్రం
"కర్నాటక రాష్ట్రం తుముకూరు సమీపంలోని వనెనహళ్లిలోని హనుమంతుడి ఆలయం వద్ద శాసనం దొరికింది. నేనే స్వయంగా అక్కడికి వెళ్లి, పరిశీలించి, పరిశోధన చేశాను" అని మునిరత్నంరెడ్డి వివరించారు. 1529 అక్టోబర్ 17 (ఆదివారం) చనిపోయారని శ్రీకృష్ణదేవరాయలవారి అంగరక్షకుడు వేయించిన శాసనం ద్వారా మిస్టరీ వీడిందని ఆయన వివరించారు.
రాయలవారు చనిపోయిన రెండు రోజులకే చంద్రగిరిలో ఉన్న ఆయన సోదరుడు అచ్యుతరాయులు శ్రీకాళహస్తికి వెళ్లి పట్టాభిషేకం చేయించుకున్నారనే విషయం కూడా ఈ శాసనం ద్వారా తెలుకున్నట్లు మునిరత్నం రెడ్డి స్పష్టం చేశారు.