శ్రీవారికి కానుకలతో తరించిన చక్రవర్తులెందరో..
x

శ్రీవారికి కానుకలతో తరించిన చక్రవర్తులెందరో..

తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో రేపటి నుంచి అరుదైన బంగారు నాణేల ప్రదర్శన


రాజులు పోయారు. రాజ్యాల పోయాయి. ఆ వారసత్వ సంపద నాటి పరిపాలనకు సాక్ష్యంగా నిలిచాయి. మధ్యయుగం నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సేవలో రాజులు, చక్రవర్తులు తరించారు. అపురూపమైన కానుకలు కూడా సమర్పించారు. హుండీ ద్వారా లభించిన చిరస్మరణీయ బంగారు నాణేలు పదిలంగా ఉన్నాయి. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ ( Tirupati SV Arts College) లో మంగళవారం నుంచి అరుదైన నాణేల ప్రదర్శన ( Exhibition of Rare Gold Coins ) మూడు రోజుల పాటు చరిత్రను కళ్లముందు ఉంచబోతోంది.

తిరుమల శ్రీవారి క్షేత్రం పేరు వినగానే అక్కడి పరిస్థితులు, వాతావరణం, కార్యక్రమాలపై ఆసక్తి రేకెత్తుతుంది. చారిత్రక అంశాలను తెలుసుకోవడానికి మరింత ఉశ్చుకత కలుగుతుంది. అలాంటి సందర్భాలే మనకు ఎదురైతే ఎలాంటి అనుభూతి కలుగుతుందో కదా. అలాంటి అరుదైన అవకాశాన్ని టీటీడీతో కలిసి ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కల్పిస్తోంది.
"వందల ఏళ్ల నాటి ఈ బంగారు నాణేలు కేవలం రాజులు, చక్రవర్తుల కానుకులు మాత్రమే కాదు. శతాబ్దాల నాటి భారతదేశ చరిత్ర ప్రధానంగా సామ్రాజ్య వైభవానికి సాక్ష్యాలు" అని ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నంరెడ్డి స్పష్టం చేశారు.

టిటిడి సహకారంతో భారత పురావస్తు శాఖ ( archaeological survey of India- ASI) తిరుపతిలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు అపూర్వ ప్రదర్శన ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రదర్శనలో పల్లవులు, చోళులు, మొగులు, విజయనగర సామ్రాజ్యంలో నాణేలు ప్రదర్శనలో ఉంచనున్నారు. తిరుమల శ్రీవారికి హరిహరరాయలు, దేవరాయలు, బుక్కరాయలు, శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన నాణేలు అత్యధికంగా ఉన్నాయి.
"రాజుల కాలం నాటి చరిత్రను, తిరుమల శ్రీవారికి వారు అందించిన సేవలను భావితరాలకు తెలియజేయడమే ఈ ప్రదర్శన ఉద్దేశం" అని భారత పురావస్తు శాఖ డైరెక్టర్ కె. మునిరత్నం రెడ్డి ది డిఫెడరల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు.

"దక్షిణభారతంపై మొగలుల (The Mughals) ప్రభావం ఉన్న కాలంలో ఇవి హుండీకి చేరి ఉండొచ్చు. ఇవి వీటి ప్రత్యేకత ఏంటంటే ఈ నాణేలపై బొమ్మలు ఉండవు. అరబిక్ ( Arabic ), పర్షియన్ లిపి (Persian Script) లో సుల్తానుల పేర్లు నాణేలు ముద్రించిన సంవత్సరం, ప్రాంతం వివరాలు ఉన్నాయి" అని మునిరత్నంరెడ్డి చెప్పారు.
తిరుమల శ్రీవారికి తొండమాన్ చక్రవర్తి, పల్లవులు చోళులు విజయనగర సామ్రాజ్యం (Vijayanagara Empire )చక్రవర్తులు, మైసూర్ రాజ్యం గద్వాల సంస్థానం కర్ణాటక నవాబ్ హైదరాబాద్ నిజాం మరాఠా అధికారులు ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ (East India Company ) నిర్వహణలో ఆలయ వ్యవహారాలు నడిచాయి.

శ్రీవారికి అపార భక్తులు

తిరుమల శ్రీవారికి పల్లవ రాజుల కాలం నుంచి చోళులు, విజయనగర సామ్రాజ్యం రాజులు అపర భక్తులు. వారంతా శ్రీవారికి వజ్ర, వైడూర్యాలతో పాటు అపారమైన కానుకలు, హుండీ ద్వారా అత్యంత విలువైన నాణేలు సమర్పించారనేది చరిత్ర చెబుతున్న మాట. అందుకు శాసనాలు కూడా తిరుమలలో ఉన్నాయి. ఇదంతా ఒకే ఎత్తు అయితే విజయనగర సామ్రాజ్య అధిపతులు అపారమైన భక్తులు. దేశంలో ఏ ఆలయంలో కూడా కనిపించని రీతిలో తిరుమల శ్రీవారి సన్నిధిలో అంటే మహా ద్వారం దాటగానే కుడి వైపున ఉభయ పట్టపురాణులు చిన్నమదేవి, తిరుమలదేవితో కలిసి శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాలు ఉన్న ఏకైక ఆలయం తిరుమల మాత్రమే.
పల్లవ రాజు శక్తివిటంకన్ భార్య రాణిసామవై పెరుందేవి 966 సంవత్సరంలోనే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని అర్చకులు సూచించిన విధంగా తయారుచేసి అందించారు. ప్రస్తుతం శ్రీవారి సన్నిధిలో మూలవిరాట్ పాదాల చెంత ఉండే భోగ శ్రీనివాసమూర్తి విగ్రహానికి సుప్రభాతం, పవళింపు సేవలతో పాటు నిత్య పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.

అపూర్వ నాణేలు..




తిరుమల శ్రీవారికి పదో శతాబ్దం ఆ తర్వాత మధ్యయుగ కాలం నుంచి రాజులు చక్రవర్తులు సమర్పించిన కానుకులకు కొదవలేదు. ఆనాటి రాచరిక వ్యవస్థకు దర్పణం పట్టే విధంగా బంగారు నాణేలను తయారు చేయించుకున్న రాజులూ, చక్రవర్తులు వాటిని హుండీకి సమర్పించారు. పరకామణిలో వాటిని లెక్కించిన తర్వాత.. అరుదైన నాణ్యాలుగా గుర్తించి వందల సంవత్సరాల కిందటే టిటిడి అధికారులు మ్యూజియంలో భద్రపరిచారు.
"ఆ నాణేలను భారత పురావస్తు శాఖ సంరక్షిస్తోంది" అరుదైన నాణేలకు సంబంధించిన చరిత్రపై అధ్యయనం జరిగింది. ఇంకా జరుగుతోంది. ఈ చరిత్రను మరింత పదిలంగా భావితరాలకు అందించడానికి నిరంతరం కృష్టి చేస్తోంది" అని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మునిరత్నంరెడ్డి చెప్పారు.

విజయనగర సామ్రాజ్యంలో నాణేలపై శివపార్వతుల చిత్రాలు లేదా లక్ష్మీనారాయణ బొమ్మలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి కొన్ని నాణేలపై ఏనుగు ముద్ర కూడా ఉంది ఇది ఆ కాలపు సైనిక శక్తికి గుర్తుగానే అనిపిస్తోందని భారత పురావస్తు శాఖ అధికారులు స్పష్టం చేశారు.
"ఈ తరహా నాణేలను వరాహాలు లేదా పగోడాలు అని పిలిచే వారిని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పై విజయనగర సామ్రాజ్యాధిపతులకు ఉన్న అపారమైన భక్తికి ఇవి నిదర్శనంగా కనిపిస్తున్నాయి" అని అని ముని రత్నం రెడ్డి స్పష్టం చేశారు.

విజయనగర సామ్రాజ్యానికి ముందు..

విజయనగర సామ్రాజ్యాధీసులకు ముందుగానే పరిపాలన సాగించిన కొందరి రాజుల కాలం నాటి నాణ్యాలు కూడా శ్రీవారి హుండీ ద్వారా లభించాయి. అందులో వెస్ట్రన్ గంగ (Western Ganga) జ్ఞానేలపై ఏనుగు బొమ్మ చాలా స్పష్టంగా కళాత్మకంగా కనిపిస్తుంది.

హొయసల (Hoyeala) కాలంనాటి నాణేలపై శార్దూలం ( పులి వంటి జంతువు) గంట పేరును వంటి చిహ్నాలు కనిపిస్తున్నాయి ఇవి అత్యంత స్వచ్ఛమైన బంగారంతో చేశారని నిర్ధారణ చేశారు. మొగలుల కాలం నాటి నాణ్యాలుగా భావిస్తున్న ఈ అరుదైన వారసత్వ సంపదకు చిహ్నంగా ఉన్న ఈ డాలర్ పై చతురస్రాకారంలో ఉన్నాయి.
విజయనగర సామ్రాజ్య కాలంలో సమర్పించిన నాణ్యాల లిపి భాష కూడా కన్నడ తెలుగు నాగరికత, పర్షియన్ లిపిలో ఆయా కాలాల్లోని భాషా పరిణామాలను తెలియజేస్తున్నాయని ఆర్కియాలజీ విభాగం అధికారులు చెప్పారు.
శ్రీవారి హుండీ ద్వారా టీటీడీకి చేరిన ఈ అరుదైన నాళాలను భద్రపరిచారు. భవిష్యత్ తరాల కోసం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియం (TirupatiSv museum) లో భద్రపరిచారు. తిరుమల శ్రీవారి హుండీ కానుక లభించిన ఇటువంటి పురాతన నాళాలను పరకామణి సమయంలో వేరుచేసి వాటి చారిత్రక విలువను ఆధారంగా మ్యూజియం కు తరలిస్తున్నారు. ఈ అరుదైన నాణ్యాలను మంగళవారం నుంచి మూడు రోజులపాటు తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్(SV arts College) లో ఏర్పాటు చేసే అరుదైన ప్రదర్శనలో ఈ నాణేలను చూడడం, మరిన్ని పురాతన కాలంనాటి విషయాలను తెలుసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది.
Read More
Next Story