మళ్లీ తట్టా.. బుట్టా..   సర్దుతున్నారబ్బా?
x

మళ్లీ తట్టా.. బుట్టా.. సర్దుతున్నారబ్బా?

ఇంకో రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్నది. పార్టీ మారడానికి కొందరు సరంజామా సర్దుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో మొదటి వికెట్ పడింది. ఇంకొందరు మాజీలతో పాటు, విపక్ష ఎమ్మెల్యే కూడా సంసిద్ధమైనట్లు సమాచారం.


అధికారం పోయింది. సమస్యలు ఎదుర్కోవాలి. అధికార పార్టీలోకి వెళితే... ఈ సమస్య ఉండదని పదవులు కోల్పోయిన నేతలు భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే కొందరు తట్టాబుట్ట సర్దుకుంటున్నారు. నెల్లూరు జిల్లా నుంచి ప్రస్తుత స్ధానిక సంస్థ మేయర్ బాహాటంగా ప్రకటించారు. మరో ఇద్దరు తాజా మాజీలు కూడా క్యూలో ఉన్నట్లు చెబుతున్నారు. కర్నూలు జిల్లా నుంచి మరో మహిళా మాజీ ప్రజాప్రతినిధి, రాయలసీమలో ఓ ఎమ్మల్యే పార్టీ మారడానికి సంసిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక కార్యకర్తలతో ఇష్టాగోష్టి సమావేశంలో సందర్భం కాకున్నా.. "నేను పార్టీ మారడం లేదు" అని చెప్పడం ద్వారా ఆమె పరోక్షంగా సంకేతం ఇచ్చారని భావిస్తున్నారు. గతంలో కూడా అటు, ఇటు పార్టీలు మారిన సందర్భాన్ని ప్రస్తావిస్తున్నారు.

నెల్లూరులో తొలి వికెట్
వైస్సార్సీపీకి నుంచి నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గా ఉన్న ఎస్.టీ సామాజిక వర్గానికి చెందిన స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ రాజీనామా చేశారు. టీడీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి వెంట నడుస్తామని మళ్లీ వారు వెల్లడించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా తనకు కార్పొరేటర్ టికెట్ శ్రీధరరెడ్డి ఇచ్చారని గుర్తు చేశారు. గత ఏడాది తాము పార్టీ నుంచి బయటికి వచ్చినా, "అధికార పార్టీ బెదిరింపుల వల్లే తిరిగి వెళ్లాల్సి వచ్చందంటూ, తమను అక్కున చేర్చుకోండి" అని అర్థించారు.
మారిన లెక్కలు
నెల్లూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ పదికి పది సీట్లు సాధిస్తే, ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ ఖాతా తెరవని పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్ సీపీ నుంచి తిరుగుబాటు చేసి వచ్చిన ఎమ్మెల్యేల్లో ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖరరెడ్డికి టీడీపీలో టిక్కెట్ దక్కలేదు. నెల్లూరు రూరల్ టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, వెంటకటగిరి సీటు మారి, ఆత్మకూరు నుంచి పోటీ చేసిన ఆనం రామనారాయణరెడ్డి విజయం సాధించారు. ఐదేళ్ల పాటు చక్రం తిప్పిన వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు అందరూ ఓటమి చెందారు. వారిలో ఇద్దరు టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జంప్ కావడానికి మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీధరరెడ్డిని శరణు వేడిన మేయర్ దంపతుల విషయానికి వస్తే..
భారీ కుంభకోణం వల్లేనా...
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధిక సీట్లు సాధించడం ద్వారా మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. గెలిచిన వారిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధరరెడ్డి కూడా ఉన్నారు. నెల్లూరు నగర మేయర్ స్రవంతి టీడీపీలోకి అది కూడా శ్రీధర రెడ్డి వద్దకు చేరుతామని ప్రకటించడం వెనుక బలమైన కారణం ఉందని చెబుతున్నారు. నెల్లూరు నగర కారొరేషన్ లో భారీ కుంభకోణం జరిగినట్లు చెబుతున్నారు. అందులో మేయర్ భర్త సంతకాలు ఫోర్జరీకి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై స్రవంతి స్పందిస్తూ ఎలాంటి విచారణకైనా సిద్ధం అని ప్రకటించారు. కాగా, నగర మున్సిపల్ కార్పొరేషన్ లే కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేశారనే కేసులో తెర వెనక మరో వైఎస్ఆర్ సీపీ కీలక నేత ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ ప్రభుత్వ సంస్థకు చైర్మన్ గా ఉన్న ఆ నేత పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. మొదట కోటంరెడ్డికి శిష్యుడుగా, .అనంతరం వైఎస్ఆర్ సీపీలో చేరి, ఆ తర్వాత మాజీ ఎంపీ ఆదాలకు ప్రియశిష్యుడిగా మారిన ఆ వ్యక్తికి ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారని సమాచారం. ఈ ఫరిస్థితుల్లో..
ద్వారాలు మూసుకున్నాయి?
"జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నుంచి ఎవరిని పడితే వారిని చేర్చుకునే ప్రసక్తి లేదు" నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రధీరరెడ్డి ప్రకటించారు. నెల్లూరులో సాయంత్రం జరిగిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ జన్మదిన వేడుకల సభలో ఆయన మాట్లాడారు."అధికారం ఉందని శాలువలు, బొకేలు తీసుకుని నటిస్తూ వచ్చే వారితో మనం కూడా నటిద్దాం. మినహా వారు మనకు వద్దు" కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారిని చూసుకుంటాం" అని తెగేసి చెప్పారు. దీంతో ఇప్పటి వరకు వైఎస్ఆర్ సీపీలో పదవులు అనుభవించిన వారికి తలుపులు మూసేస్తామని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి.
లోపాయికారీ విషయానికి వస్తే.. పరిస్ఠితులు అనుకూలించని స్థితిలో అప్పట్లో శ్రీధరరెడ్డి మేయర్ స్రవంతి దంపతులను అప్పటి అధికార పార్టీలోకి తిరిగి పంపారని సమాచారం. ప్రస్తుతం వారి వినతిని ఆయన ఆలకించినా, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అడ్డుపుల్ల వేయవచ్చనేది సమాచారం. కారణం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అజీజ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మధ్య అంతర్గతంగా సయోధ్య లేదని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
క్యూలో మాజీలు?
జిల్లాలో ఈసారి రాజకీయంగా చక్రం తిప్పి, ఎంపీగా విజయం సాధించిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి వైఎస్ఆర్ సీపీలో ఓటమి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం. ఆ మాజీకి 2014లో టిడిపిలో మంత్రిగా పనిచేసిన పత్తిపాటి పుల్లారావుతో రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధాలు బలంగా ఉండేవి. విద్యా సంస్థల అధిపతి అయిన ఆ మాజీ ప్రతినిధి గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ ను మాట్లాడిన తీరును గుర్తు చేస్తున్నారు. ఇదిలావుండగా, కర్నూలు జిల్లాలో కూడా మాజీ ఎంపీ, తాజాగా ఎమ్మల్యేగా పోటీ చేసి, ఓటమి చెందిన మాజీ ప్రతినిధి కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత నాయకులు, కార్యకర్తల ఇష్టాగోష్టి సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ’ తాను పార్టీ మారడం లేదు అని వ్యాఖ్యానించారు. సందర్భం కాకున్నా, ఈ మాట ఎందుకన్నారు అనేది చర్చకు ఆస్కారం కల్పించినట్లు సమాచారం.
సీమలో ఎమ్మెల్యే కూడా..
రాయలసీమ జిల్లాల్లో వైఎస్ఆర్ సీపీ నుంచి ఏకైక మహిళా ఎమ్మెల్యే రెండోసారి విజయం సాధించారు. ఆమె టీడీపీలోకి వెళ్లనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. వివాదరహితురాలైన ఆమె రాజకీయాలకు కూడా కొత్త. ఆమెతో ఫెడరల్ ప్రతినిధి మాట్లాడడానికి ప్రయత్నం చేయగా, ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోలేదు.
Read More
Next Story