
వైసీపీ చీఫ్ వైఎస్. జగన్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడుు
Adulterated ghee: టీడీపీ Vs వైసీపీ.. మళ్లీ రగిలిన రాజకీయ రగడ..
కూటమిలో కలవరం. తిరుపతిలో వైసీపీ పాప నివారణ హోమం .
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి లెక్క తేలింది. సీబీఐ ఇచ్చిన నివేదికలో గొడ్డు కొవ్వులేదనే అంశం టీడీపీ కూటమిని కలవరానికి గురి చేసింది. వైసీపీ స్వరం పెంచడంతో పాటు టీడీపీపై ఎదురుదాడికి దిగడం మళ్లీ రాజకీయ రగడ ప్రారంభమైంది.
నెల్లూరు ఏసీబీ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులో.. నెయ్యిలో గొడ్డు కొవ్వు లేదు., కూరగాయల ఆధారిత కల్తీ కారకాలు, రసాయనాలు ఉన్నాయని గుజరాత్ ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టును సీబీఐ- సిట్ cbi (Central bureau of investigation)- SiT) కోర్టుకు సమర్పించిన నివేదికలో ప్రస్తావించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.
"తిరుమలలో మహాపాపం నిజం అని టీడీపీ హోర్డింగ్ ఏర్పాటు చేయడం, నెయ్యిలో గొడ్డు కొవ్వు కలవలేదని సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైసీపీ సంబరాలకు దిగడం" వంటి వాతావరణంతో శ్రీవారి భక్తులను మళ్లీ ఆలోచనలో పడేసింది. తిరుపతిలో వైసీపీ శుక్రవారం శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించింది.
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘోర పాపానికి పాల్పడ్డారని వైసీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దైవ ద్రోహులను ఆయన ఆరోపించారు.
"బాబు, పవన్ చేసిన ఘోర కలికి పాపపరిహార హోమం" పేరిట తిరుపతిలో శుక్రవారం ఉదయం భూమన కరుణాకరరెడ్డి హోమపూజలు ప్రారంభించారు.
సీబీఐ నివేదికలో..
2024 సెప్టెంబర్ 18వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యాఖ్యలతో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం వెలుగు చూసింది. సీబీఐ సారధ్యంలోని సిట్ అధికారులు 14 నెలలు 12 రాష్ట్రాల్లో దర్యాప్తు, తనిఖీల అనంతరం ఈ నెల 23వ తేదీ నెల్లూరు ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో 36 మంది నిందితులుగా చేర్చింది. వారిలో 12 మంది టీటీడీ ఉద్యోగులే అని నిర్ధారించింది.
టీటీడీ కొనుగులు చేసిన నెయ్యిలో గొడ్డు కొవ్వు ఆనవాళ్లు కాకుండా, కూరకూగాయల ప్రేరకంతో కూడిన నూనె, రసాయనాలు కలిశాయని సీబీఐ తన చార్జిషీట్ లో ప్రస్తావించిన వ్యవహారం వైసీపీకి ఆయుధంలా దొరికినట్లు కనిపిస్తోంది.
2019 నుంచి 2024 వరకు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారని దర్యాప్తులో తేలిన అంశాలను ప్రస్తావిస్తూ 600 పేజీల చార్జిషీట్ ఏసిబి కోర్టులో దాఖలు చేసింది. పాలు సేకరించని సంస్థ 60 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేయడానికి దారితీసిన వ్యవహారంపై లోతుగా దర్యాప్తు సాగింది.
అవి రసాయనాలేనా?
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి పాల సేకరణ లేకుండానే బోలేబాబా డెయిరీ వెన్న పాలసేకరణ లేకుండానే నెయ్యి సరఫరా చేసినట్టు సీబీఐ నిర్ధారించింది. ఈ నెయ్యిలో పామాయిల్, మాం కెర్నెల్ ఆయిల్, రసాయనాలు కలిపారనే అభియోగం ఉంది. దీనిని పరీక్షించిన ఎన్డీడీబీ కూడా నెయ్యి పరిమాణం తక్కువగా ఉన్నట్లు నివేదిక ఇచ్చిన విషయాన్ని కూడా సీబీఐ ప్రస్తావించింది. ఈ నమూనాల్లో బుట్యరిక్ యాసిడ్ నిర్దేశిత పరిమాణం కంటే తక్కువగా ఉండడం, కొవ్వు పదార్థాలు కనిపించలేదని, జంతువుల కొవ్వుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయనే నివేదిక వైసీపీ నేతలు టీడీపీ కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగడానికి ఊతం ఇచ్చినట్లు కనిపిస్తోంది.
మళ్లీ ప్రారంభమైన చర్చ
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో టీటీడీ అధికారుల అవినీతి, కొనుగోలులో నిబంధనలు సరళతరం చేయడం, హవాలా వ్యవహారాలు కీలకంగా మారాయి. టీటీడీకి 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసి 235 కోట్ల రూపాయలు దుర్వినియోగానికి పాల్పడ్డారని సిబిఐ దర్యాప్తులో నిర్ధారించింది. దర్యాప్తు నివేదికపై మీడియా కథనాల ఆధారంగా మళ్లీ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
"ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నెయ్యిలో గొడ్డు కొవ్వు, చేప నూనె ప్రస్తావన లేదు. కూరగాయల నూనెలు, మొక్కల ఆధారిత కొవ్వు ఉంది" అని (CBI) తన నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఏపీ మంత్రి మండలిలో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ విషయంపై సుదీర్ఘ సమయం చర్చించడం గమనార్హం.
2014 నుంచి విచారణ చేస్తారా?
"2014 నుంచి 2019 వరకు టిటిడి నెయ్యి కొనుగోలు చేసిన విధానంపై విచారణకు సిద్ధం కావాలని" మాజీ చైర్మన్ , వైసిపి అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి డిమాండ్ చేశారు. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వాడిన కల్తీ నెయ్యిలో ఆవు, గుడ్డు కొవ్వు, చేప నూనె వాడారని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కోట్లాదిమంది యాత్రికుల మనోభావాలను ఉద్దేశ పూర్వకంగా దెబ్బతీశారని కూడా భూమన ఆరోపించారు.
ఈ ప్రకటనలే ఆధారం...
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్లు పూర్వ టిటిడి ఈఓ శ్యామలరావు, ఆ తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేసిన ప్రకటనలను ఓ టీవీ ఛానల్ చర్చా వేదికలో వైసిపి అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్ ప్రస్తావించారు.
"2024లో టిడిపి కూటమి అధికారంలోకి రాగానే ఈఓగా నియమితులైన జే. శ్యామలరావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేసిన ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి" అని నాగార్జున యాదవ్ ప్రస్తావించారు.
2024 సెప్టెంబర్ 18: శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు, పంది కొవ్వు, చేప నూనె కలిసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆరోపించారు. ఆయన పదవీస్వీకారం చేయకముందే టీటీడీ ఈఓగా శ్యామలరావును నియమించారు.
అంతకుముందు..
2024 జూలై18: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కొనుగోలు చేసిన నెయ్యి శాంపిల్స్ పరీక్షలకు పంపించారు. ఆ నివేదిక పదవ తేదీ అందిందని ఈఓ శ్యామలరావు చెప్పారు.
జూలై 23: "లడ్డు తయారీలో కలుషిత పదార్థం ఆనవాళ్లు లభించాయి. అందులో వెజిటబుల్ ఫాట్స్ (వనస్పతి) ఉన్నాయి" అని అప్పటి Eo శ్యామలరావు మీడియాకు చెప్పారు. (ముఖ్యమంత్రి ఆరోపణల తరువాత)
2024 సెప్టెంబర్ 22: 48 గంటల తర్వాత ఆయన ఏమన్నారంటే..
"నెయ్యిలో గొడ్డు కొవ్వు, చేపనేనె కలిసిన పదార్థాలు వాడారు" అని వ్యాఖ్యానించారు. నెయ్యి శాంపిల్స్ గుజరాత్ ఎన్డీడీబీబీకి పరీక్షలకు పంపించినట్టు కూడా ఆయన చెప్పారు.
"ఈ ప్రకటనలను పరిశీలిస్తే ఉద్దేశపూర్వకంగా తమ పార్టీ నేతలను అభాసుపాలు చేయడానికి ప్రయత్నించారు" వైసిపి అధికార ప్రతినిధులు భూమన కరుణాకరరెడ్డి, యనమల నాగార్జున యాదవ్ వ్యాఖ్యానించారు.
"జరగని పాపానికి తిరుమల శ్రీవారి ప్రధాన అర్చకులతో ప్రోక్షణ చేయించడం ద్వారా పాపాలు మూటగట్టుకున్నారు" అని భూమన కరుణాకరరెడ్డి నిందించారు.
ఆ పాపం వైసీపీదే..
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 20 కోట్ల లడ్డూల తయారీలో వైసీపీ నేతలు 251 కోట్లు దుర్వినియోగం చేశారని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. తిరుపతితో పాటు రాష్ట్రంలోని అనేక ఆలయాల వద్ద కూడా పసుపు నీళ్లతో టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా శుద్ధి చేసే కార్యక్రమాలు సాగించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కథ ఆసక్తికరంగా మారింది.
వైవీ, పీఏ చుట్టూ వివాదం...
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం టీటీడీ మాజీ చైర్మన్ వైవీ. సుబ్బారెడ్డి, ఆయనకు పీఏగా పనిచేసిన చిన్నఅప్పన్న చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నట్లు సీబీఐ చార్జిషీట్ లో ప్రస్తావించినట్లు కనిపిస్తోంది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో వైసిపి ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఎ (Personal Assistent) కె. చిన్నఅప్పన్న పాత్ర కీలకంగా ఉన్నట్లు సిబిఐ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
"పాల కర్మాగారాల సంస్థల ప్రతినిధులతో చిన్న అప్పన్న బేరసారాలు జరపడం, హవాలా మార్గాల్లో లంచాలు తీసుకున్నారు. చిన్నఅప్పన్న బ్యాంకు ఖాతాలో 2019 నుంచి 2024 కాలంలో 4.69 కోట్ల రూపాయలు జమ అయిన సొమ్ము నుంచి 4.64 కోట్ల రూపాయలు వివిధ ఖాతాలకు మళ్లించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థల నుంచి చిన్న అప్పన్న కిలోకి 25 రూపాయల లంచం కూడా డిమాండ్ చేసి తీసుకున్నారు" అనే విషయాలను కూడా సిబిఐ తన చార్జిషీట్ లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు టీటీడీకి
"టిటిడికి నెయ్యి సరఫరా చేసే పాల పరిశ్రమలకు పాల సేకరణకు, వెన్నతో నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేకుండా నిబంధనలు సరళం. డైరీకి 250 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండాలనే నిబంధన 150 కోట్లకు తగ్గించారు" అనే ఆరోపణలు ఉన్నాయి.
"నెయ్యి కొనుగోలులో మా పాత్ర ఏమీ లేదు. అంతా అధికారులదే" అని దర్యాప్తులో సిట్ అధికారులకు వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ పాలక మండలి నుంచి పర్చేజింగ్ కమిటీ సభ్యులుగా పనిచేసిన ముగ్గురు కూడా చెప్పారనేది సమాచారం.
నిందా పరిహార హోమం..
తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కూరగాయల కారకాలు కలిపారనే ఆరోపణల వెనుక రాజకీయ నేతల ప్రమేయం లేదని టీటీడీ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యానించారు.
తిరుపతిలోని తన నివాసం వద్ద దుర్గదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన ఆయన "బాబు, పవన్ చేసిన ఘోర కలికి పాపపరిహార హోమం" పేరిట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ,
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మనసులో కుళ్లు పోవాలని శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించినట్టు చెప్పారు.
"టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ వ్యవహారం ఆ నాటి పాలక మండలికి సంబంధం లేదు" అని తేలింది. అని భూమన చెప్పారు. దీంతో సీఎం చంద్రబాబుకు దిక్కుతోచక వైసీపీ నేతలపై నిందలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ ను రాజకీయంగా అణగదొక్కడానికే శ్రీవారి ప్రతిష్టను ఫణంగా పెట్టారని కూడా ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబు చేసిన పాపం, ఘోరకలి, హిందూ సమాజాన్ని అవమానం చేశారని అన్నారు.
Next Story

