
కడప: 18 ఏళ్ల సర్వీసు.. 30 బదిలీలు..
ప్రొద్దుటూరు సీఐ శ్రీరాం 40 రోజుల్లోనే బదిలీపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ..
కడప జిల్లా ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ బదిలీ వ్యవహారం చర్చకు తెరతీసింది. 40 రోజుల్లోనే ఆయన బదిలీ చేయడం ఆసక్తికరంగా మారింది. కుమరి శ్రీరామ్ తన 18 సంవత్సరాల పోలీస్ సర్వీసులో 30 సార్లు బదిలీ అయ్యారు. ఆయన బదిలీపై సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
పోలీస్ శాఖలో 2007లో చేరినప్పటి నుంచి కుమరి శ్రీరాం విధి నిర్వహణపై సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రతి చర్యను ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రాం, ఇతర సామాజిక వేదికల్లో ఫోటోలు షేర్ చేయడం ద్వారా వేల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. శ్రీరాం బదిలీపై ఆయన ఫోలోవర్లు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు. దీంతో
నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరు ఉన్న సీఐ శ్రీరాం బదిలీ ఆయన క్రేజ్ మరింత పెంచినట్టు కనిపిస్తోంది.
ప్రొద్దుటూరు ఒకటో పట్టణ సిఐ గా గత సంవత్సరం డిసెంబర్ 18వ తేదీ ఆయన బాధ్యతలు స్వీకరించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవడం ఒకటి. మద్యం షాపులు నిర్ణీత గంటల్లో మాత్రమే తెరవాలని నిబంధనలు అమలు చేసిన తీరు వల్ల 40 రోజులకే మళ్లీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అందుకున్నట్లు స్పష్టం అవుతుంది.
"ప్రొద్దుటూరు పట్టణంలో 1982 తర్వాత మంచి అధికారి వచ్చాడు అని భావించాం. రోజుల వ్యవధిలోనే సిఐని బదిలీ చేయడం పై పట్టణంలో చర్చ జరుగుతోంది" అని ప్రొద్దుటూరుకు చెందిన కళాకారుడు పాములేటి వ్యాఖ్యానించారు.
2007 బ్యాచ్ ఎస్ఐ కుమరి శ్రీరామ్ అనంతపురం జిల్లా ముదిగబ్బ పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ ఎస్సైగా చేరారు. ఆ తర్వాత ఆయన కందుకూరు, పుట్టపర్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, కదిరి, కంబదూరు, కనగానిపల్లె బెళుగుప్ప, ధర్మవరం, పెద్దవడగూరు, అనంతపురం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేశారు. సీఐగా పదోన్నతి పొందిన తర్వాత శ్రీరామ్ అనంతపురం, హిందూపురం, మడకశిర, ఆదోని, కర్నూల్, శ్రీకాళహస్తి పట్టణాల్లో సీఐగా పనిచేశారు. ఆదోని నుంచి బదిలీపై 40 రోజుల కిందట ప్రొద్దుటూరు వన్ టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించారు.
నిబంధనలు అమలు చేయడం వల్లే..
ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కా, ఇతర జూదకలాపాలను కట్టడి చేయడంలో కఠినంగా వ్యవహరించారని పేరు తెచ్చుకున్నారు. మద్యం షాపులు కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే తెరవాలని నిబంధనను అమలు చేయడం రాజకీయంగా ఆయనకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
"పట్టణానికి సీఐగా శ్రీరామ్ వచ్చిన తర్వాత పరిస్థితి కొంత చక్కబడింది. మద్యం షాపుల నిర్వాహకులకు కంటకంగా మారారు" అని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాదరెడ్డి కూడా చెప్పారు. సీఐ శ్రీరామ్ పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించడంలో నిబద్ధతతో వ్యవహరించారని రాచమల్లు ప్రశంసించారు. చక్కగా పనిచేశారని కూడా ఆయన కితాబు ఇచ్చారు.
"నిబంధనలు అమలు చేయడంలో రాజకీయాలకు అతీతంగా సీఐ శ్రీరాం పనిచేస్తున్నారు. ఆయనను ప్రభుత్వం ఇక్కడ ఉండనిస్తుందా? బదిలీ చేస్తుందా?" అని మాజీ ఎమ్మెల్యే సందేహం వ్యక్తం చేశారు. రోజుల వ్యవధిలోనే సీఐ శ్రీరాం బదిలీ అయ్యారు.
పట్టణంలో రౌడీ షీట్లను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంలో అధికార టిడిపి కూటమి, వైసిపి మద్దతుదారులు అనేది లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించడం అనేది ఆయనకు పట్టణంలో మంచి పేరు రావడానికి ఆస్కారం కలిపించినట్లు చెబుతున్నారు.
"ఓ కేసులో ప్రొద్దుటూరు మున్సిపల్ వైస్ చైర్మన్ పాత కోట బంగారు మున్రెడ్డి (బంగారు రెడ్డి) నీ కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించారు" ఈ చర్యతో అధికార టిడిపి కూటమి నేతలను కలవరానికి గురి చేసినట్టు పట్టణంలో చర్చ జరుగుతోంది.
ప్రొద్దుటూరు అంటే గురు శిష్యులైన టిడిపి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, వైసిపి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మధ్య ఆదిపత్య పోరుతో పాటు, మాటల యుద్ధం కూడా జరుగుతుంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రొద్దుటూరు వన్టౌన్ సీఐ శ్రీరామ్ పనితీరును మాజీ ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి అభినందించడం కూడా టిడిపి నాయకులకు మింగుడు పడని పరిస్థితి ఏర్పడినట్లు చెబుతున్నారు.
"పట్టణంలో పరిస్థితి ప్రశాంతంగా ఉంది. 1982 నాటి పరిస్థితులు చూస్తున్నాం" అని భావించే లోపే సీఐ బదిలీ కావడం దురదృష్టకరమని కళ నాట్యమండలి కళాకారుడు పాములేటి వ్యాఖ్యానించారు.
ప్రొద్దునూరు పట్టణం 40 ఏళ్ల క్రిందట పరిస్థితిని పరిశీలిస్తే ఫ్యాక్షన్ హత్యలు ఎక్కువ జరిగేవి. వర్గ పోరాటాలు తీవ్రస్థాయిలో ఉండేటివి. మట్కా జూదం తీవ్రస్థాయిలో పేదల బతుకులతో చెలగాటమాడేది. అలాంటి సందర్భంలోనే 1982లో మొదటిసారి సీఐ
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, కార్మిక నాయకుడిగా ఉన్న mv రమణారెడ్డినీ అరెస్టు చేసిన విషయాన్ని పాములేటి గుర్తు చేశారు. సుదీర్ఘకాలం తర్వాత సమర్థవంతమైన అధికారి వచ్చారని పట్టణ ప్రజలు భావించారని ఆయన అన్నారు. వన్టౌన్ సీఐ శ్రీరామ్ బదిలీపై అన్ని వర్గాల్లో అసంతృప్తి ఏర్పడింది అని కూడా ఆయన చెప్పారు.
కోసమెరుపు: పోలీస్ శాఖపై ఆరోపణలు వచ్చినప్పుడు అధికారుల సంఘం తీవ్రంగా స్పందిస్తుంది. రోజుల వ్యవధిలోనే ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీరామ్ బదిలీపై అంతకుముందు అనేక సంఘటనలపై కూడా కడప జిల్లా పోలీసు అధికారుల సంఘం అందించకపోవడం అనేది కూడా చర్చ జరుగుతోంది.
Next Story

