ఆకస్మిక తనిఖీలు: ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తా.. అధికారులకు అల్టిమేటం..
x
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని పుదూరు వద్ద ప్రజావేదికపై మాట్టాడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

ఆకస్మిక తనిఖీలు: ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తా.. అధికారులకు అల్టిమేటం..

గోదావరి పుష్కరాలకు ముందు పోలవరం జాతికి అంకితం చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.


2029 నాటికి మహిళా రిజర్వేషన్

పది లక్షల మందికి టిడ్కో ఇళ్లు...

సుపరిపాలనకే తనిఖీలు

సూళ్లూరుపేట సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన

రాష్ట్రంలో లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందించడంలో సంతృప్తికర స్థాయిని దాటడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల నుంచి ఇప్పటి వరకు అందిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఏప్రిల్ నుంచి ఆకస్మిక తనిఖీలు చేపడతానని ఆయన ప్రకటించారు.

"ఏ ప్రాంతానికి వచ్చేది ముందుగా చెప్పను. బయలుదేరే ముందు సమాచారం ఇస్తా. బాగా పనిచేసిన అధికారులను అభినందిస్తా. సరిగా పనిచేయని వారికి దండన తప్పదు" అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అల్టిమేటం ఇచ్చారు.
2029 ఎన్నికలకు మహిళా రిజర్వేషన్ ( Women's Reservation )కూడా వస్తుంది. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడించారు. సామాజిక సేవతో పాటు ప్రజలకు ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకు వచ్చే మహిళలకు తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీలు స్వాగతం పలుకుతాయన్నారు.
గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు ( Polavaram Project )ను జాతికి అంకితం చేయడానికి పనులు కూడా వేగవంతంగా సాగుతున్నాయని చెప్పారు. 2029 నాటికి ప్రతి పేదకు సొంతింటి కల సాకారం చేయడానికి పది లక్షల ఇళ్లు నిర్మించి ఇవ్వడమే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన ప్రకటించారు.

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ( Sullurpeta) నియోజకవర్గం నాయుడుపేట మండలంలోని పుదూరు వద్ద 30 ఎకరాల్లో నిర్మించిన 2,064 ఏపీ టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇంటి తాళాలు అందించారు. ఇక్కడ ప్రజా వేదిక నుంచి ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని 30 ప్రాంతాల్లో నిర్మించిన 2,50,893 గృహాలను లబ్దిదారులకు సోమవారం ఓకేసారి పంపిణీ చేశామన్నారు. ప్రతి ఇంటిపైనా సోలార్ రూఫ్ టాప్ ( Rooftop Solar )ఏర్పాటుకు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
"ప్రభుత్వం నిర్మించిన ఇళ్లలో పొదుపు చేసే విద్యుత్ ఉపకరణాలను అందించేలా ఈఎస్ఎస్ఎల్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాం. 0 లక్షల ఇళ్లకు ఈ ఉపకరణాలు అందించండి" అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

2.50 లక్షల ఇళ్లు అందించాం..

ఈ కొత్త ఏడాది ఉగాది, రంజాన్ పండుగల తర్వాత 2.50 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు పండుగలా నిర్వహించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గుర్తు చేశార. టీడీపీ కూటమి ( TDP Alliance ) అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోసారి పేదలకు ఇళ్లను పంపిణీ చేస్తున్నాం, 2029 నాటికి రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదన్న లక్ష్యంతో మేం పనిచేస్తున్నట్టు ఆయన చెప్పారు.
"2014-19లో 8.19 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టి పేదలకు అప్పగించాం. గత ఏడాది మూడు లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు చేయించాం. ఇప్పుడు 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయించాం" అని వివరించారు.

గత పాలనలో పేదలకు మోసం


వైసీపీ ప్రభుత్వంలో పేదలను వంచించారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. పాలన కూడా అస్తవ్యస్తం చేశారు. అని తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. వైసీపీ పాలనలో పేదల పొట్టకొట్టారని ఆగ్రహించారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లపై అప్పులు చేసి, ఆ భారం పేదలపై మోపారని అన్నారు.

"ఐదేళ్లలో 6.5 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారు. 4.73 లక్షల ఎన్టీఆర్ హౌసింగ్ ఇవ్వాలని భావిస్తే దానిని రద్దు చేశారు. రూ.923 కోట్ల పేదవాళ్ల డబ్బు ఎగ్గొట్టారు. రూ.9.70 లక్షల కోట్ల అప్పులు చేశారు. కేంద్రం ఇచ్చిన డబ్బు మళ్లించారు. అవినీతి అక్రమాలు, అధికార దుర్వినియోగం చేశారు. రూ.174 కోట్ల రూపాయల్ని టిడ్కో లబ్దిదారులు కట్టిన డబ్బును కూడా వాడేసుకున్నారు" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. అప్పులు ఉన్నారని బ్యాంకులు నోటీసులు జారీ చేసే వరకు పేదలకు తెలియదనీ, వైసీపీ బాధితులైన 22 వేల మంది లబ్దిదారులకు ఆ డబ్బు వెనక్కి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

పది లక్షల ఇళ్లు లక్ష్యం

పేదలకు 2029 నాటికి పది లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు.
"21 నెలల్లోనే 5.5 లక్షల ఇళ్లను కట్టి పేదవాళ్లకు అప్పగించాం. త్వరలో మరో 4.5 లక్షల ఇళ్లను నిర్మిస్తాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.2029 నాటికి అందరికీ ఇళ్లు ఇవ్వాలంటే ఇంకా 17 లక్షల పైచిలుకు ఇళ్లు నిర్మించాలని, ఈ ఏడాది జూన్ నాటికి 2 లక్షల ఇళ్లు, సెప్టెంబరుకు 1.60 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయిస్తాం అని ఆయన ప్రకటించారు. ఇప్పుడు పైపు ద్వారా నీళ్లు వచ్చినట్టే గ్యాస్ కూడా వస్తుంది. పైప్డ్ గ్యాస్ త్వరలోనే అందుబాటులోకి తెస్తాం అని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీరు ఇవ్వాల్సి ఉన్నా గత పాలకులు దానిని నిర్వీర్యం చేశారనీ, కేంద్రాన్ని ఒప్పించి 2028 వరకూ ఈ పథకం కొనసాగించేలా ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా నీరందింస్తాం అని ఆయన భరోసా ఇచ్చారు. ప్రతి ఇంటికి సౌర ఫలకాలు పెట్టుకుంటే ఉచిత విద్యుత్ వస్తుంది. పంపుసెట్ కు కూడా బిగించుకుంటే విద్యుత్ అంతా ఉచితంగా వస్తుందనే విషయం గుర్తు చేశారు.

2029కి మహిళా రిజర్వేషన్


మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరగడానికి వీలుగా 2029 నాటికి మహిళా రిజర్వేషన్ ( Women's Reservation by 2029 ) వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. దీనివల్ల రాజకీయంగా మహిళలు కీలకంగా మారనున్నారని ఆయన గుర్తు చేశారు. సామాజిక సేవతో పాటు ప్రజలకు ప్రాతినిధ్యం వహించేందుకు ముందుకు వచ్చే మహిళలకు తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీలు స్వాగతం పలుకుతాయి అని ప్రకటించారు. ఇదే సమయంలోనే వచ్చే ఏడాదికి ఐదు లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

సుపరిపాలనకే .. ఆకస్మిక తనిఖీలు

రాష్ట్రంలో మంచి పాలన అందించాలనేది ఎన్డీఏ కూటమి లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. సుపరిపాలన, సమర్ధవంతమైన పాలన ఇవ్వాలనే అనునిత్యం పనిచేస్తున్నామని చెప్పారు. నాయుడుపేట ప్రాంతంలో రిజిస్ట్రేషన్ విభాగం సేవలు సరిగా లేవని ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తం అయ్యింది.దానిని సరిచేసుకోమని వారికి స్పష్టం చేస్తున్నాను. ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు ( Surprise Inspections Statewide from April ) చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
"ఉద్యోగులకు మొదటి తేదీనే జీతాలు వచ్చేలా వ్యవస్థను గాడిలో పెట్టాం. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పాలనను ముందుకు తీసుకెళ్లాలి. పెన్షన్ తో పాటు వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగులు ఎలా వ్యవహరిస్తున్నారో కూడా తనిఖీ చేస్తున్నాం. పౌరసేవలు అందించటంలో చక్కగా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ అభినందనలు.సేవలు సరిగ్గా లేని చోట సరిచేసుకోవాలని అధికారులందరికీ చెబుతున్నాను. చక్కగా పనిచేయండి ప్రజలకు సేవలు అందించండి" అని కోరారు. ఇవన్నీ ఏప్రిల్ నుంచి ప్రారంభించే ఆకస్మిక తనిఖీల్లో పరిశీలిస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులకు గుర్తు చేశారు.
Read More
Next Story