ఎమ్మెల్యే శ్రీధర్ ను ఏమి చేద్దాం..
x
డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (ఫైల్)

ఎమ్మెల్యే శ్రీధర్ ను ఏమి చేద్దాం..

రైల్వే కోడూరులో జనసేన త్రిసభ్య కమిటీ విచారణ. కీలకంగా మారనున్న అభిప్రాయ సేకరణ.


ఓ మహిళను లైంగికంగా వేధింపు వివాదంలో చిక్కుకున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ మంగళవారం విచారణ చేపట్టింది. ఏ నిర్ణయం తీసుకోవాలనే విషయంలో దాదాపు 45 మంది జనసేన నేతల నుంచి కూడా అభిప్రాయ సేకరణకు రంగంలోకి దిగారు. నియోజకవర్గ నాయకుల అభిప్రాయాలు పార్టీ తీసుకునే నిర్ణయంలో కీలకంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

"త్రిసభ్య కమిటీకి తన వద్ద ఉన్న ఆధారాలు సమర్పించాను. పార్టీ నిర్ణయం తరువాత తన అభిప్రాయం వెల్లడిస్తా" అని విచారణకు హాజరైన రైల్వేకోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీడియా వద్ద ముక్తసరిగా మాట్లాడారు.

సంఘటన ఇదీ..

తిరుపతి జిల్లా (కడప జిల్లా) రైల్వే కోడూరు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఫలితాల అనంతరం ఫేస్ బుక్ లో శుభాకాంక్షలు చెప్పాను. అని రైల్వే కోడూరు పంచాయతీ కార్యాలయంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి వీణ చెప్పారు. ఈ పరిచయంతో మా ఇద్దరి సెల్ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చున్నామని ఆమె తెలిపారు. ఆ తరువాత చేసిన ఆరోపణలు ఇవి..
"ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగికంగా వేధించాడు. బలవంతంగా గర్భస్రావం చేయించాడు. ఏడాదిన్నరగా వేధింపులకు గురి చేస్తున్నాడు" అని ఆమె ఆరోపించారు. ఈ ఘటన వారం రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

ఎమ్మెల్యేకు జనసేన తాఖీదు..

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించారనే ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ సీరియస్ గా స్పందించింది. వారం రోజుల లోపు వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆరోపణల నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ముందు, వాస్తవాలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నట్లు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి పీ. హరిప్రసాద్ ఆదేశాలు జారీ చేయడంతో పాటు, విచారణకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిస్తున్నట్లు హరిప్రసాద్ ప్రకటించారు. ఆ కమిటీలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు టి. శివశంకర్, తంబళ్లపల్లె రమాదేవి, అనంతపురం జిల్లాకు చెందిన టిసి. వరుణ్ సభ్యులుగా ఉన్నారు.

అజ్ఞాతం వీడిన శ్రీధర్..

లైంగిక వేధింపుల ఆరోపణలపై జనసేన పార్టీ నేతలు టి. శివశంకర్, తంబళ్లపల్లె రమాదేవి, టిసి. వరుణ్ మంగళవారం మధ్యాహ్నం రైల్వే కోడూరుకు చేరుకున్నారు. ఓ ప్రయివేటు హెటల్ లో త్రిసభ్య కమిటీ భేటీ కావడంతో తన వివరణ ఇవ్వగానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వారం తరువాత అజ్ణాతం వీడారు. జనసేన సీనియర్ నేత శివశంకర్ ముందు ఎమ్మెల్యే శ్రీధర్ వివరణ ఇచ్చారు. ఆయన చెప్పింది త్రిసభ్య కమిటీ ఆలకించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడాల్సిన అవసరం ఏమిటి? ఆరోపణలు చేసిన మహిళ విడుదల చేసిన వీడియోలు, ఫొటోలపై కూడా త్రిసభ్య కమిటీ దాదాపు గంటకు పైగానే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను వివిధ కోణాల్లో ప్రశ్నించినట్లు తెలిసింది.
"డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడానికి ఆమె ఇదంతా చేసింది" అని త్రిసభ్య కమిటీ ముందు ఎమ్మెల్యే శ్రీధర్ చెప్పడానికి ప్రయత్నించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ వివరణపై కూడా త్రిసభ్య కమిటీ నేతలు సంతృప్తి చెందలేదని సమాచారం.

నిర్ణయం తరువాత స్పందిస్తా..

తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రైల్వో కోడూరు ఎమ్మెల్యే త్రిసభ్య కమిటీ మందు వివరణ ఇచ్చిన తరువాత వెలుపలికి వచ్చారు.
"కమిటీ సభ్యులుకు ఆధారాలు సమర్పించాను. పార్టీ తీసుకునే నిర్ణయం తరువాత మళ్లీ మాట్లాడతాను. అప్పుడే మీడియా ముందుకు వస్తాను" అని ఎమ్మెల్యే శ్రీధర్ ముక్తసరిగా చెప్పారు. ఇంతకు మించి మాట్లాడేందుకు ఆయన ఆసక్తి చూపలేదు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహరించిన తీరుపై జనసేన పార్టీ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు.

నేతల అభిప్రాయ సేకరణ


ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో త్రిసభ్య కమిటీలోని జనసేన పార్టీ సీనియర్ నేతలు టి. శివశంకర్, తంబళ్లపల్లె రమాదేవి, టిసి. వరుణ్ రైల్వే కోడూరు నియోజకవర్గంలో నాయకుల అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. దీనికోసం నియోజకవర్గంలోని రైల్వే కోడూరు, చిట్వేలి, పుల్లంపేట, ఓబులవారిపల్లె, పెనగలూరు మండలాల నుంచి దాదాపు 45 మంది చురుకైన కార్యకర్తలను కూడా పిలిపించారు. వారిలో జనసేన పార్టీ రాష్ట్రకార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, నల్లంశెట్టి యానాదయ్య, ఎన్. దాశరధి తోపాటు పెద్ద సంఖ్యలో కమిటీ ముందు తమ అభిప్రాయాలు చెప్పడానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు.
"ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సరళిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు" అనేది పార్టీ నాయకుల ద్వారా తెలిసిన సమాచారం. దీనికి ప్రధాన కారణం కూడా లేకపోలేదని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఎనిమిది మంది ఎమ్మెల్యేలా?

రైల్వే కోడూరు టీడీపీ ఇన్ చార్జి, గాడ్ ఫాదర్ ముక్కా రూపానందరెడ్డి పక్కన సామన్యుడిలా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్

రైల్వే కోడూరు నుంచి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ విజయం సాధించారు. ఆయన గాడ్ ఫాదర్, టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి ముక్కా రూపానందరెడ్డి తోపాటు ఆయన భార్య కొడుకులు, కోడళ్ల పెత్తనమే ఎక్కవనే ఆరోపణలు ఉన్నాయి.
"అన్ని నియోజకవర్గాలకు ఒకరే ఎమ్మెల్యే. మా నియోజకవర్గానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు" అని సెటైర్లు కూడా వేస్తుంటారు.
2024 ఎన్నికలకు ముందు రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జిగా బాధ్యతలు తీసుకున్న నేత ముక్కా రూపానందరెడ్డిది ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లె. ఈ పంచాయతీ నుంచి శ్రీధర్ వైసీపీ మద్దతు సర్పంచ్ గా గెలిపించడంలో రూపానందరెడ్డి గాడ్ ఫాదర్ గా ఉన్నారనేది ఆ ప్రాంత నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తన విశ్వాసపాత్రుడైన శ్రీధర్ కు జనసేన నుంచి టికెట్ ఇప్పించడం తోపాటు విజయం సాధించడంలో కీలకంగా పనిచేశారు. ఇంతవరకు సవ్యంగా ఉన్నప్పటికీ, ఎన్నికల తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ నామమాత్రంగా ఉంచి, వ్యవహారాలన్నింటిని టీడీపీ ఇన్ చార్జి ముక్కా రూపానందరెడ్డి పర్యవేక్షిస్తున్నారనే విషయంలో జనసేన పార్టీ రైల్వే కోడూరు నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో రైల్వే కోడూరు నియోజకవర్గ నేతలు త్రిసభ్య కమిటీ ముందు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. కమిటీ నేతలు ఎలాంటి ఏమి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Read More
Next Story