
డిజిటల్ బాటలో టీటీడీ కాలేజీలు, విద్యకు 119 కొట్ల బడ్జెట్
విద్యార్థినులకు ఎల్లవేళలా వైద్య సదుపాయం.
టీటీడీ విద్యా శాఖకు 2026–27సంవత్సరంలో రూ.118.89 కోట్లు
డిజిటల్ క్లాస్ రూములు, మౌళిక సదుపాయాలు
విద్యా రంగ అభివృద్ధికి పెద్దపీట వేసిన టిటిడి
టీటీడీ పాలన చిన్న రాష్ట్రానికి ఏమాత్రం తీసిపోదు. అన్ని శాఖలతో ప్రత్యేక వ్యవస్థ ఉన్న ఈ ధార్మిక సంస్థ విద్యా రంగంలో పేదల పిల్లలకు డిజిటల్ విద్య, పోటీ ప్రపంచంలో రాణించే స్కిల్ డెవలప్మెంట్ బోధనకు ప్రణాళిక సిద్ధం చేసింది. పేద విద్యార్థులకు ఊతం ఇవ్వడానికి టీటీడీ విద్యాశాఖకు చరిత్రలో మొదటిసారి రూ.118.89 కోట్లు కేటాయించింది. విద్యార్థినుల ఆరోగ్య భద్రతకు కూడా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నారు.
"టీటీడీ విద్య సంస్థల్లో అత్యాధునిక సాంకేతికత వ్యవస్థ ఏర్పాటు చేయడం. విద్యార్థుల సామర్థ్యాల పెంపుదలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు చెప్పారు. ఈ అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యా శాఖలో సమగ్ర మార్పులు తీసుకురావాలని లక్ష్యం నిధులు పెంచామని ఆయన వివరించారు.
టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోనే కాకుండా దేశంలో ఢిల్లీ తరువాత, రెండు తెలుగు రాష్ట్రాల్లో 31 విద్యా సంస్థలు నిర్వహిస్తోంది. తిరుపతిలో ఓ విశ్వవిద్యాలయం తోపాటు ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ, సాంకేతిక విద్య తోపాటు సంప్రదాయ వేదపాఠశాలలు కూడా నిర్వహిస్తోంది. టీటీడీ విద్యా సంస్థల్లో సీట్లకు డిమాండ్ ఉంటుంది. ఈ కాలేజీల్లో హాస్టల్ తోపాటు భోజన వసతి కూడా కల్పిస్తున్నారు.
తిరుపతిలో టీటీడీ పాఠశాలలు: ౨ నిర్వహిస్తోంది.
పాలిటెక్నిక్ కళాశాలలు: 1
తిరుపతిలో ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాల.
వేద పాఠశాలలు: 6
తిరుమల, విజయనగరం, భీమవరం, కొటప్పకొండ, నల్లగొండ, కీసరగుట్టలో
డిగ్రీ కళాశాలలు: 2
తిరుపతిలో ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ 1945లో ఏర్పాటు చేసిన కాలేజీలో మూడే వేల మంది విద్యార్థులకు 150 మంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఉన్నారు. 2022 సెప్టెంబర్ లో నాక్ ఏ ప్లస్ గ్రేడ్ దక్కింది.
తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజీలో 19 విభాగాల్లో 19 కోర్సులు అందుబాటులో ఉంటే, 2,200 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 1,500 మందికి టీటీడీ హాస్టల్ కల్పించింది. 1969లో ఏర్పాటు చేసిన ఈ కాలేజీకి 2023లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పదేళ్ల పాటు అటానమస్ (స్వయంప్రతిపత్తి) హోదా కల్పించింది. మొదటి సంవత్సరంలోనే నాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించింది.
ఇంటర్ మహిళా కాలేజీలు: 2
తిరుపతిలో బాలికల కోసం రెండు ఇంటర్, ఓ డిగ్రీ కాలేజీ నిర్వహిస్తున్నారు. శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కాలేజీ, డిగ్రీ (ఎస్పీడబ్ల్యూ) కాలేజీల్లో 2,100 మంది విద్యార్థినులు ఉన్నారు. మహిళా డిగ్రీ కాలేజీ ద్వారా మహిళా విద్యా, వసతికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని టీటీడీ సంకల్పించింది.
"2025 డిసెంబర్ నెలలో జరిగిన టీటీడీ బోర్డు మీటింగ్ లో ఆ సీట్లకు అదనంగా మరో 270 సీట్లు పెంచడానికి ఆమోదం తెలిపినట్టు" టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు గుర్తు చేశారు.
భారీగా నిధులు కేటాయింపు
టీటీడీ చరిత్రలో లేని విధంగా పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ, సాంకేతిక విద్యాభ్యాసం వరకు ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన కోసం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.118.89 కోట్లు టీటీడీ బడ్జెట్ లో కేటాయించింది. సాధారణంగా బడ్జెట్ లో పరిపాలనా వ్యవహారాలు, జీతభత్యాలు, అభివృద్ది కార్యక్రమాలకు నిధులు కేటాయించడం సర్వసాధారణం. వాటన్నింటికి భిన్నంగా టీటీడీ బడ్జెట్ కేటాయించింది. ఇప్పటి వరకు టీటీడీ రూపొందించే బడ్జెట్ లో విద్య తోపాటు అభివృద్ధి, వసతుల కల్పన భవనాల నిర్మాణానికి కూడా విద్యా శాఖ బడ్జెట్ లో నిధులు ఇలా కేటాయించారు.
టీటీడీ గతంలో విద్యాశాఖలో జీతాలు మినహా అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులు ఇలా ఉన్నాయి. 2021–22 సంవత్సరానికి రూ.24.37 కోట్లు, 2022–23 సంవత్సరానికి రూ.39.04 కోట్లు, 2023–24 సంవత్సరానికి రూ.33.08 కోట్లు, 2024–25 సంవత్సరానికి రూ.25.99 కోట్లు, 2025–26 సంవత్సరానికి రూ.13.08 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో భవనాల నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి తదితర పనులు చేపట్టారు.
కొత్త సంప్రదాయం...
పరిపాలన, వేతనాలు, వసతులతో నిమిత్తం లేకుండా, విద్య బోధన, సాంకేతిక అంశాల కోసం ఈ ఏడాది 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.118.89 కోట్లు కేటాయించారు. శ్రీఎస్వీ విద్యాదాన ట్రస్ట్, టిటిడి కలిపి విద్యాసంస్థలను మరింత ఆధునీకరించడం తోపాటు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ మొత్తం కేటాయించామని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్ర తెలిపారు.
టిటిడి విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అనేక పలు సూచనలు చేశారు.
"టిటిడి విద్యా సంస్థల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఈసారి రూ.118.89 కోట్ల నిధులను కేటాయించాం. ఈ నిధులతో టిటిడి విద్యా సంస్థలలో అదనపు తరగతి గదులు, అదనపు వసతి గదుల నిర్మాణం, పాఠశాలలు కళాశాలలో అభివృద్ధి పనులు చేపడతాం" అని చైర్మన్ నాయుడు, ఈఓ రవిచంద్ర వెల్లడించారు.
స్కిల్ డెవలప్ మెంట్
విద్యార్థులను కేవలం విద్యకే పరిమితం చేయకూడదని కూడా నిర్ణయించారు. స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాల్లో మరింతగా తీర్చదిద్దడానికి వనరులు కల్పిస్తారు. టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే విద్యార్థులకు ఐఐటీ, నీట్, సీఏ, క్లాట్ తరహా కోర్సులు, స్కిల్ డెవలప్‌మెంట్, జాబ్ ఓరియెంటెడ్, వృత్తి ఆధారిత కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
డిజిటల్ తరగతులు
పోటీ ప్రపంచంలో పేదల పిల్లలు కూడా రాణించే విధంగా ఆధునిక సాంకేతికతను టీటీడీ అందుబాటులోకి తెస్తోంది. ప్రాధమిక స్థాయి నుంచి డిగ్రీ వరకు ఉపాధ్యాయుల బోధన మాత్రమే ఉంది. తెలంగాణలో పదవీ విరమణ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఏ.శరత్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టీటీడీ జేఈఓగా నియమించారు. ఆయన బాధ్యతలు తీసుకున్న తరువాత విద్యా సంస్థలు పరిశీలించడం, సమీక్షలతో పరిస్థితి అధ్యయనం చేస్తున్నారు.
"తరగతి గదుల్లో డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా బడ్జెట్ లో కేటాయించడం, వసతులు కల్పనకు టీటీడీ ప్రాధాన్యత ఇస్తోంది" టీటీడీ జేఈఓ (విద్యా, ఆరోగ్యం) డాక్టర్ ఏ. శరత్ చెప్పారు.
టీటీడీ విద్యా సంస్థల్లోని తరగతి గదుల్లో అత్యాధునిక సాంకేతిక బోధనకు పెద్దపీట వేస్తూ డిజిటల్ క్లాస్‌రూమ్స్, కంప్యూటర్లు, స్మార్ట్ ప్యానల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, వర్చువల్ కాన్ఫరెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలలు, కళాశాలలలో ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. మొబైల్ మెడికల్ యూనిట్ సేవలు అందించడం వంటి చర్యలు చేపట్టడానికి కార్యాచరణ సిద్ధం చేశారు. వేసవి సెలవుల్లో వీటిని సమకూర్చడం ద్వారా రానున్న విద్యా సంవత్సరం నాటికి వసతులు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంగా పనులు వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఆరోగ్యానికి రక్షణ
టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్రధానమైనవి శ్రీపద్మావతీ మహిళా జూనియర్ కాలేజీ 968 సీట్లు, డిగ్రీ కాలేజీలో సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాలలో కూడా వందలాది మంది డే స్కాలర్, టీటీడీ హాస్టల్ విద్యార్థినులు ఉన్నారు. వారి ఆరోగ్య భద్రతకు మరింత ప్రాధాన్యత ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
"కాలేజీ, హాస్టల్ లో విద్యార్థినులకు వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం. వైద్య సిబ్బందిని షిఫ్టుల వారీగా ఉంచాలని కూడా నిర్ణయించాం" అని చైర్మన్ నాయుడు వివరించారు.
Next Story

