Tirumala Silathoranam || తిరుమలలో ప్రకృతి చెక్కిన అపురూపమైన రాతి చిత్రం..!

శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు‌ భూగర్భ శాస్త్రజ్ఞులు అంచనా.;

Update: 2025-04-23 13:35 GMT

తిరుమల వెంకటేశ్వర స్వామిని రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వచ్చేవారు స్వామివారి దర్శనం అనంతరం అక్కడే ఉండే కొన్ని పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తారు. అయితే, ఈ తిరుమల కొండల్లోనే ఉన్న మరో ప్రకృతి సహజసిద్ధమైన శిలాతోరణం గురించి చాలా మందికి తెలియదు. దాని గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.


తిరుమల కొండల్లోని చక్రతీర్థం జలధారకు సమీపంలో ఉన్న శిలాతోరణం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన అరుదైన ప్రదేశం. దీన్ని నేషనల్ జియో హెరిటేజ్ స్మారక చిహ్నంగా గుర్తించడంతో ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత సహజ సిద్ధమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా ప్రత్యేకత సాధించింది. శిలాతోరణం అంటే రాళ్లతో ఏర్పడిన పూలమాల వంటిదని అర్థం.


ప్రకృతి వైపరీత్యాలకు సైతం ఎదురు నిలబడి నేటికి చెక్కు చెదరకుండా నిలబడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందిఉధృతమైన వాతావరణం శిధిలత్వం, జలప్రవాహాల ఒరిపిడి చర్యల కారణంగా ఈ శిలాతోరణం ఏర్పడినట్లు నిపుణులు అంటున్నారు. ఇక్కడ ఉన్న రాళ్ళు ఒకదానిపై ఒక్కటి పెన వేసుకుని శిలల వలే సజీవ కళతో యాత్రికులను ఆకర్షిస్తుంది.

ఇలాంటి తోరణాలు ప్రపంచంలోనే మరో రెండు చోట్ల మాత్రమే ఉన్నాయట.అమెరికాలోనీ ఉటా ప్రాంతంలోని ఇంద్రధనుస్తోరణ, ఇంగ్లాండ్ లోని డాల్రాడియన్ శిలాసేతువు మాత్రమే ఇలాంటివి ఉన్నట్లు పరిశోధకుల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ శిలాతోరణం సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు‌ భూగర్భ శాస్త్రజ్ఞులు అంచనా చేశారు. 1980వ దశకంలో తిరుమల కొండల్లో భూగర్భ అధ్యయనాల్లో భాగంగా తవ్వకాలు జరపగా ఈ అరుదైన నిర్మాణం కనపడింది. అప్పటి నుంచి ఈ శిలాతోరణం ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భక్తులు ఈ ప్రదేశాన్ని పురాణాలతో పోల్చుకోవడం. ఈ అరుదైన ప్రదేశం తిరుమల కొండల్లో ఉండటంతో స్వామి వారి నిలయంగా భావిస్తారు. అలాగే ఈ శిలాతోరణం చూడటానికి పాములా వంపు తిరగడం, శంఖం లేదా విష్ణమూర్తి చక్రంలా కనిపించడం కూడా అందుకు కారణం. అలాగే ఈ శిలాతోరణం ఎత్తు తిరుమల గర్భగుడిలోని స్వామివారి ఎత్తుతో సమానంగా ఉందని పలువురు నమ్ముతారు.

మరోవైపు స్వామివారు తిరుమలకు తొలిసారి వచ్చినప్పుడు శ్రీవారిపాదాల వద్ద తొలి అడుగు వేయగా రెండో అడుగు ఈ ప్రదేశంలోనే వేశారని కూడా భావిస్తారు. ఇవన్నీ నిజమో కాదో కచ్చితంగా చెప్పలేకపోయినా ఈ సహజసిద్ధమైన నిర్మాణం మాత్రం అత్యంత అద్భుతంగా ఉంటుంది.


 




Tags:    

Similar News