పవన్ కళ్యాణ్ చొరవతోనే కూటమి ఏర్పాటు
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలను పట్టిపీడిస్తూ రాక్షస పాలన సాగించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి నుంచి విముక్తిని ప్రసాదించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకొని మరి కూటమి ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని, ఎన్నో అంశాలలో త్యాగాలు చేశారని దాని ఫలితమే నేడు నూటికి నూరు శాతం జనసేన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరింగిశెట్టి కీర్తన పేర్కొన్నారు.
బుధవారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. వైసిపి విముక్త ఆంధ్ర ప్రదేశ్ నినాదంతో వచ్చిన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
2019 ఎన్నికలలో 151 ఎమ్మెల్యేలు మరియు 22 ఎంపీలనిచ్చి వైసీపీకి ప్రజలు అఖండ విజయాన్ని కట్టబెడితే, ప్రజలు ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి స్వయాన బూడిదలో పోసిన పన్నీరు చేసుకున్నారని విమర్శించారు. దాని ప్రతిఫలంగా ఈ ఎన్నికలలో క్రికెట్ టీం లో 11 మంది ఉన్నట్టుగా వైసిపికి 11 మంది ఎమ్మెల్యేలు నిలిచారని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం కూల్చివేతలతో ప్రారంభించి, కుటిల రాజకీయాలు, ప్రశ్నించిన వారిని అనగదొక్కడం, అరాచకాలు, అవినీతి, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, పెట్రోలు డీజిల్, నిత్యవసర వస్తువుల పెంపు , యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగులకు చేసిన హామీలు నెరవేర్చకపోవడం, ఇలా అన్ని వర్గాల ప్రజలను ముంచిన జగన్ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు అధ పాతాళానికి తొక్కేసారని అన్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన, ఆయన వ్యక్తిగత జీవితం పైన, ప్రతిపక్ష నాయకుల పైన వ్యక్తిగత విమర్శలు చేసిన మంత్రులు రోజా, తదితర నోటి దూల కలిగిన ప్రజాప్రతినిధులు చిత్తుగా ఓడిపోయారనీ. ఇది పవన్ కళ్యాణ్ కు పట్ల ప్రజలకు ఉన్న అభిమానాన్ని ఏ పాటిదో నిరూపించిందన్నారు. తన తప్పులు పరిపాలన వైఫల్యాలను తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి రెండవసారి కూడా వై నాట్ 175 అన్నారు. ఏపీ ప్రజలు వై నాట్ 175 టు కూటమి అన్నట్లుగా ఓట్లు వేశారు. వై.. వైసిపి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని పరింగి శెట్టి కీర్తన పేర్కొన్నారు. తమ పార్టీ పట్ల ప్రజలు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజారంజకమైన పరిపాలనను అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కీర్తన పేర్కొన్నారు.