VB-G RAM G చట్టాన్ని "గ్రామ వ్యతిరేక" చట్టం: రాహుల్
20 ఏళ్ల నాటి MGNREGA స్థానంలో ఏటా 125 రోజుల గ్రామీణ వేతన ఉపాధికి హామీ ఇచ్చే VB-G RAM G బిల్లును పార్లమెంటు ఆమోదించింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం( డిసెంబర్ 19)తో ముగిశాయి. ఈ సమావేశాలు 1వ తేదీన మొదలయిన విషయం తెలిసిందే. మొత్తం 15 రోజుల పాటు జరిగిన సమావేశాలు వాడీవేడిగా సాగాయి. సమావేశాల సందర్భంగా లోక్‌సభ పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(MGNREGA) పథకం స్థానంలో ‘వీబీ జీ రామ్ జీ’ పేరుతో తీసుకువచ్చిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష ఎంపీల ఆందోళనలు, నిరసనల మధ్య ఈ బిల్లును ఆమోదించారు.
ఈ సందర్భంగా లోక్‌సభా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడుతూ.. ప్రభుత్వం 20 సంవత్సరాల MGNREGA ను ఒకే రోజులో కూల్చివేసిందని ఆరోపించారు. కొత్త VB-G RAM G చట్టాన్ని "గ్రామ వ్యతిరేక" చట్టంగా అభివర్ణించారు. బిల్లు గ్రామీణ కార్మికుల పరపతిని బలహీనపరుస్తుందని పేర్కొన్నారు.
"కోవిడ్ సమయంలో MGNREGA అంటే ఏమిటో మనం చూశాము. ఆర్థిక వ్యవస్థ మూతపడి జీవనోపాధి కుప్పకూలినప్పుడు, కోట్లాది మంది ఆకలి, అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఇది కాపాడింది" అని రాహుల్ పేర్కొన్నారు.
VB-G RAM G బిల్లు MGNREGAకి "పునరుద్ధరణ" కాదంటూ రాహుల్ ఎక్స్ లో ఇలా పోస్టు చేశారు. "నిన్న రాత్రి, మోదీ ప్రభుత్వం 20 సంవత్సరాల MGNREGAను ఒకే రోజులో కూల్చివేసింది.
"ప్రధాని మోదీ లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి: శ్రమశక్తిని బలహీనపరచడం, గ్రామీణ భారతదేశం, ముఖ్యంగా దళితులు, ఓబీసీలు,ఆదివాసీల పరపతిని బలహీనపరచడం, అధికారాన్ని కేంద్రీకరించడం, ఆపై సంస్కరణల పేరుతో అమ్మడం" అని కాంగ్రెస్ నాయకుడు ఆరోపించారు.
నిరసనల మధ్య బిల్లు ఆమోదం
20 ఏళ్ల నాటి MGNREGA స్థానంలో ప్రతి సంవత్సరం 125 రోజుల గ్రామీణ వేతన ఉపాధికి హామీ ఇచ్చే VB-G RAM G బిల్లును పార్లమెంటు గురువారం రాత్రి (డిసెంబర్ 18) ఆమోదించింది. ఇది ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య జరిగింది.
గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య రాష్ట్రాలపై ప్రభుత్వం ఆర్థిక భారాన్ని మోపుతోందని ఆరోపిస్తూ.. లోక్‌సభ ఆమోదించిన కొన్ని గంటల తర్వాత, గురువారం రాత్రి రాజ్యసభ వాయిస్ ఓటుతో విక్సిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) బిల్లును ఆమోదించింది.