దేశంలో మద్యం విక్రయాల్లో తెలంగాణ నంబర్ వన్, అధికంగా తాగుతున్నారు
తెలంగాణ రాష్ట్రం మద్యం విక్రయాల్లో అగ్రస్థానంలో నిలిచిందని తాజాగా విడుదలైన నివేదికలో వెల్లడైంది.2014 కంటే 2023 నాటికి మద్యం విక్రయాలు అధికంగా పెరిగాయి.
By : Shaik Saleem
Update: 2024-08-28 05:48 GMT
తెలంగాణ రాష్ట్రంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో మద్యం తలసరి వినియోగ వ్యయం గణనీయంగా పెరిగింది.దేశంలోనే తెలంగాణ రాష్ట్ర వాసులు అత్యధికంగా మద్యం తాగుతున్నారని తాజాగా విడుదలైన నివేదిక వెల్లడించింది. 2022-23వ ఆర్థిక సంవత్సరంలో మద్యంపై తలసరి వినియోగ వ్యయం రూ.1,623లుగా ఉంది. మద్య పానీయాల విక్రయాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) ప్రచురించిన ఆల్కహాలిక్ పానీయాలపై పన్నుల నుంచి ఆదాయ సమీకరణ అనే నివేదిక ప్రకారం మద్య పానీయాలపై అత్యధిక సగటు వార్షిక తలసరి వినియోగ వ్యయంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది.
49 శాతం మంది మద్యపాన ప్రియులే...
గతంలో కేంద్రం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ జరిపిన సర్వేలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇద్దరిలో ఒకరు మద్యం తాగేవారేనని తేలింది. ఈ సర్వేలో 49 శాతం మంది గ్రామీణ ప్రాంతాల పురుషులు మద్యం తాగుతున్నారని సర్వేలో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లోని ప్రతీ ముగ్గురిలో ఒకరు మద్యం సేవిస్తున్నారని సర్వే చెబుతోంది. తెలంగాణ గ్రామీణ మహిళల్లో 9 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 2.6 శాతం మంది మహిళలకు మద్యం తాగే అలవాటు ఉందని సర్వే తెలిపింది.
తెలంగాణ సంస్కృతిలో తాటి కల్లు భాగం
తెలంగాణ సంస్కృతిలో తాటి కల్లు సేవించడం ఓ భాగమని తెలంగాణకు చెందిన ఎకనమిస్ట్ పాపారావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గతంలో తెలంగాణవాసులు తాటికల్లు తాగేవారని, ప్రస్థుతం మద్యం,బీరు తాగుతున్నారని ఆయన చెప్పారు.ఏ వేడుక అయినా మద్యం తాగడం రివాజుగా మారిందని ఆయన తెలిపారు. బెల్టు షాపులు, పబ్ లు, బార్ ల వల్ల మద్యం విక్రయాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు.
మద్యం విక్రయాలను తగ్గించాలి
తెలంగాణలో మద్యం విక్రయాల జోరు, అధికంగా మద్యం తాగడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆర్థిక విశ్లేషకులు పాపారావు చెప్పారు. మద్యపానం వల్ల ఆరోగ్యం దెబ్బతిని మరణిస్తున్నారని, దీనివల్ల పలు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆయన చెప్పారు. బెల్టు షాపులను ఎత్తివేయించి, 18 ఏళ్ల లోపు పిల్లలకు మద్యం విక్రయించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పాపారావు సూచించారు. పగలూ, రాత్రి అనకుండా మద్యం తాగి ప్రజలు ఆరోగ్యాలు దెబ్బతీసుకోవద్దంటూ ఆయన సూచించారు.
బెల్టుషాపులతో మద్యం విక్రయాలు పెరిగాయి...
గత కేసీఆర్ సర్కారు మద్యం విక్రయాల్లో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ స్థానంలో తీసుకువెళ్లిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు.ప్రతీ వాడలో మద్యం దుకాణాలు, బెల్టుషాపులు పెట్టి మద్యం అమ్మకాలు పెంచిందని గతంలో ఈటల విమర్శలు గుప్పించారు.
సగటు మద్యపానీయాల ఖర్చు పెరిగింది...
తెలంగాణలో 2014-15వ ఆర్థిక సంవత్సరంలో మద్యం కోసం సగటున రూ.745 ఖర్చు చేశారు.2014వ సంవత్సరంతో పోలిస్తే తెలంగాణ మద్య పానీయాల ఖర్చులో భారీ పెరుగుదల కనిపించింది. 2020-21వ ఆర్థిక సంవత్సరంలో కోవిడ్-19 మహమ్మారి వల్ల చాలా రాష్ట్రాల్లో మద్యం వార్షిక తలసరి వినియోగ వ్యయం పడిపోయింది.తెలంగాణలో మద్యం సగటు తలసరి వినియోగం అనూహ్యంగా పెరిగింది.
మద్యానికి అధిక డబ్బు వెచ్చిస్తున్నారు...
తెలంగాణ పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ లో మద్యంపై తలసరి వినియోగ వ్యయం రూ.1,306, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రూ.1,227 వరుసగా 2,3 స్థానాల్లో నిలిచాయి.తెలుగు వారు దేశంలోనే అధికంగా మద్యం తాగుతున్నారని తేలింది. 2014వ సంవత్సరంతో పోలిస్తే గోవా, కేరళ, ఉత్తరప్రదేశ్,పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు ఆల్కహాలిక్ పానీయాల వినియోగ వ్యయంలో తగ్గుదల కనిపించింది. తెలంగాణ రాష్ట్రం 2022-23వ ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి రూ.4,860తో తలసరి రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం సేకరణలో అగ్రస్థానంలో ఉంది.మద్యం ఆదాయంలో కర్ణాటక ,హర్యానా రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.