"రేవ్ పార్టీ జరిగిందని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు"
రాజ్ పాకాల తాను డ్రగ్స్ సేవించలేదని నిరూపించుకోవాలని చెప్పారు. అతను ఈ పార్టీపై మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చిఉంటే అనుమానాలు వచ్చేవి కావని అన్నారు.
జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని అధికారపార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి చెప్పారు. రేవ్ పార్టీ జరిగినట్లు మీడియాలో కథనాలు మాత్రమే వచ్చాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి ప్రచారం చేయించినట్లు బీఆర్ఎస్ నేతలు అక్కసు వెళ్ళగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసినట్లుగా ఫామ్‌హౌస్‌లో స్టింగ్, కోవర్ట్ ఆపరేషన్లు ఇప్పుడు జరగలేదని యెన్నం అన్నారు. రాజ్ పాకాల తాను డ్రగ్స్ సేవించలేదని నిరూపించుకోవాలని చెప్పారు. అతను ఈ పార్టీపై మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చిఉంటే అనుమానాలు వచ్చేవి కావని అన్నారు.
మరోవైపు, నిన్న తన ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడులు చేసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రాజ్ పాకాల ఇవాళ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అటు పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని, తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్ట్ ఇవాళ స్పందించి కీలక ఆదేశాలు జారీచేసింది. విచారణకు హాజరయ్యేందుకు అతనికి రెండు రోజుల సమావేశం ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. జన్వాడ ఫామ్ హౌస్ కేసు విచారణలో ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని, దర్యాప్తులో తీవ్ర నిర్ణయాలేమీ తీసుకోబోమని పోలీసుల తరపున ఏఏజీ కోర్టుకు తెలుపగా, నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్ళాలని న్యాయస్థానం సూచించింది.
ఈ కేసుకు సంబంధించి తమ విచారణకు హాజరు కావాలని మోకిల పోలీసులు రాజ్ పాకాలకు నోటీసులు ఇచ్చారు. ఆయన అందుబాటులో లేకపోవటంతో జన్వాడలోని ఓరియన్ విల్లాస్‌లో 40వ నంబర్ విల్లాకు పోలీసులు నోటీసులు అంటించి వెళ్ళిపోయారు.
ఇదిలా ఉంటే, రాజ్ పాకాల స్నేహితుడు, నిన్న పార్టీలో కొకైన్ తీసుకున్నట్లు ఆరోపించబడిన విజయ్ మద్దుకూరి ఇవాళ పోలీసుల వద్ద విచారణకు హాజరు కాలేదు. ఫామ్‌హౌస్‌లో క్యాసినో ఆడినట్లు దర్యాప్తులో తేలితే మరో కేసు నమోదు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.