హైడ్రాతో ప్రజల్లో చైతన్యం, చెరువు అంతర్ధానంపై పోలీసులకు ఫిర్యాదు
కబ్జాలపై ‘హైడ్రా’ ఉక్కుపాదం మోపుతుండటంతో ప్రజల్లో చైతన్యం వెల్లివిరుస్తోంది. తమ గ్రామంలోని చెరువు కనిపించడం లేదని ప్రజలు పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By : Shaik Saleem
Update: 2024-08-26 14:07 GMT
హైడ్రా చేస్తున్న కూల్చివేతలపై ప్రజల్లో చైతన్యం వచ్చింది.సాక్షాత్తూ తెలంగాణ సీఎం ఎ రేవంత్ రెడ్డి ఛైర్మన్ గా, సీనియర్ ఐజీ, ఐపీఎస్ అధికారి అయిన ఏవీ రంగనాథ్ మెంబర్ కన్వీనరుగా ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(Hydra) దూకుడుగా చెరువుల ఆక్రమణలను కూల్చివేస్తోంది.తమ గ్రామంలో ఉన్న తుమ్మల చెరువు కబ్జాదారుల చెరలో చిక్కి అదృశ్యం అయిందని, దీని ఆచూకీ చూపించాలని కోరుతూ గ్రామస్థులు పహాడిషరీఫ్ పోలీసుస్టేషనుకు వచ్చి ఫిర్యాదు చేశారు. నిన్న గండిపేటలో జంట జలాశయాలను పరిరక్షించేందుకు హైడ్రా చేపట్టిన కూల్చివేతలకు మద్ధతుగా ప్రజలు ర్యాలీ తీశారు.
మా గ్రామ తుమ్మల చెరువు జాడ కనిపెట్టండి
తమగ్రామంలోని సర్వేనంబరు 2లోని 8ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తుమ్మల చెరువు జాడ కనిపెట్టాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ సర్ధార్ నగర్ గ్రామ ప్రజలు మూకుమ్మడిగా వచ్చి పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైడ్రా కూల్చివేతలతో ప్రజల్లో కదలిక వచ్చి, గ్రామప్రజలంతా సంఘటితమై కబ్జాదారులకు వ్యతిరేకంగా పోలీసుస్టేషనుకు వచ్చి చెరువు జాడను కనిపెట్టాలని కోరుతూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.తుక్కుగూడలో 8 ఎకరాల్లో తుమ్మల చెరువు ఉండాలని,ఈ చెరువులోనే కొందరు అక్రమార్కులు కబ్జా చేసి వెంచర్లు వేశారని గ్రామస్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుస్టేషన్ ముందు ప్రజల ఆందోళన
తుమ్మల చెరువు కబ్జాతో వర్షాకాలంలో పొలంలోని పంటలు మునుగుతున్నాయని స్థానిక ప్రజలు పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తుమ్మల చెరువు కబ్జాల బారిన పడకుండా కాపాడాలని కోరుతూ గతంలో తాము రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయామని, పోలీసులైనా చెరువు ఆచూకీ వెతికిపెట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. చెరువు జాడ కనిపెట్టాలని కోరుతూ వచ్చిన ప్రజలు పోలీసుస్టేషన్ ముందు రచ్చ చేశారు.
తుమ్మల చెరువు కబ్జాపై హైడ్రాకు సమాచారం
తుమ్మల చెరువు కబ్జాపై ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు హైడ్రా అధికారులకు సమాచారం అందించారు. తుమ్మల చెరువు కబ్జా కథ హైడ్రాకు చేరిన నేపథ్యంలో హైడ్రా అధికారులు దీనిపై చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. హైడ్రా దూకుడుతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.