కొనసాగుతున్న హైడ్రా బుల్‌డోజింగ్: డైవర్షన్ పాలిటిక్స్ అంటున్న బీఆర్ఎస్

ఎన్నికలముందు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు, సంక్షేమ పథకాల నుండి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టారని బీఆర్ఎస్ నేత మాధవరం అన్నారు.

Update: 2024-09-23 07:13 GMT

కొద్ది రోజుల విరామం తర్వాత హైడ్రా నిన్నటినుంచి మళ్ళీ అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభించిన సంగతి తెలిసిందే. నిన్న కూకట్‌పల్లి, సంగారెడ్డిలలో పని చేసిన హైడ్రా అధికారులు ఇవాళ మాదాపూర్‌ వెళ్ళారు. కావూరి హిల్స్ ప్రాంతంలో ఒక పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మించిన స్పోర్ట్స్ అకాడమీపై స్థానికులు కొంతకాలంగా ఫిర్యాదు చేస్తుండటంతో, ఇవాళ హైడ్రా సిబ్బంది ఆ అకాడమీ నిర్మాణాలను కూల్చివేశారు. అక్కడ కావూరి హిల్స్ పార్క్ పేరుతో బోర్డ్ ఏర్పాటు చేశారు.

మరోవైపు, కావూరి హిల్స్ అసోసియేషన్ నుంచి ఈ స్థలాన్ని లీజుకు తీసుకునే, తమ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. 25 ఏళ్ళకు లీజు తీసుకున్నామని, ఆ గడువు పూర్తి కాకముందే తొలగిస్తున్నారని ఆరోపించారు. అయితే, కోర్ట్ ఆదేశాలతోనే కావూరి హిల్స్ పార్క్‌లో ఆక్రమణలను తొలగించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చారు.

కావూరి హిల్స్ నుంచి గుట్టల బేగంపేట ప్రాంతానికి హైడ్రా బుల్‌డోజర్‌లు తరలివెళ్ళాయి. ఆ ప్రాంతంలోని స్థానికుల బిక్కుబిక్కమంటూ, హైడ్రా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు తమ ఇళ్ళు కూలుస్తుందో అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఎన్నికలముందు కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీలు, సంక్షేమ పథకాల నుండి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. శని, ఆదివారాలు వస్తుంటే హైదరాబాద్‌లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. కూల్చివేతల తర్వాత శిధిలాలను తీసివేయకుండా, చెత్తను జమ చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న నల్ల చెరువులో కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టాదారులకు చెందినదని అన్నారు.

Tags:    

Similar News