కాంక్రీట్ జంగిల్, కాలుష్యమేఘాలతోనే హైదరాబాద్ క్లౌడ్ బరస్ట్
హైదరాబాద్ నగరంలో గడచిన 50 ఏళ్లలో 14 సార్లు జలప్రళయాలు సంభవించాయి. జలప్రళయాలపై ‘ఫెడరల్ తెలంగాణ’ అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం...
By : Shaik Saleem
Update: 2025-09-19 02:23 GMT
హైదరాబాద్ నగరంలో తరచూ క్లౌడ్ బరస్ట్ (Hyderabad cloudburst) ఎందుకు అవుతోంది? ఆకాశానికి చిల్లులు పడ్డాయా? అన్నట్లు నగరంలో ఇటీవల అత్యంత భారీవర్షాలు కురుస్తున్నాయి.అసలు ఈ వర్షాలకు కారణాలేమిటి? ఇలాంటి జలప్రళయాలు నగరంలో గడచిన 14 ఏళ్లలో నమోదయ్యాయి.
అతి భారీవర్షాలకు కారణాలివి...
హైదరాబాద్ నగరం పచ్చదనం తగ్గిపోయి కాంక్రీట్ జంగిల్ గా(concrete jungle) మారడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, దీనివల్ల అధిక వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణశాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆకాశపు ధర్మరాజు చెప్పారు. నగరంలో ఇటీవల కాంక్రీటుతో ఆకాశహర్మ్యాలు నిర్మించి, గోడలు పెట్టకుండా అద్దాలను బిగిస్తున్నారు. దీనివల్ల వేడి పెరుగుతుందని, ఆ వేడి ప్రభావం వల్ల మేఘాలు ఏర్పడి భారీవర్షాలకు దారితీస్తుందని ఆయన చెప్పారు.హైదరాబాద్ నగరంలో సెల్ ఫోన్లు, ఇతర కమ్యూనికేషన్ గాడ్జెట్ల వినియోగం పెంపుతో రేడియేషన్ ప్రభావం పెరిగి ఉష్ణోగ్రతలతో పాటు భారీవర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ పై కాలుష్య మేఘాలు
హైదరాబాద్ నగరంపై కాలుష్య మేఘాలు (pollution) అలముకున్నాయి.‘‘హైదరాబాద్ పరిశ్రమలు, లక్షలాది వాహనాల నుంచి వెలువడుతున్న పొగ, దుమ్ము, ధూళి వల్ల వాయు కాలుష్యం భూమి నుంచి 2 నుంచి 5 కిలోమీటర్ల ఎత్తులో కమ్ముకుంటోంది. వాయు కాలుష్యమే హైదరాబాద్ నగరంలో మేఘాల విస్పోటానికి దారి తీస్తుంది. కాంక్రీటుతో నిర్మించిన భారీభవనాలకు గాజు పలకలతో కప్పటం వల్ల ఉష్ణోగ్రత మరింత పెరుగుతోంది.గాజుతో చేసిన పలకలు వేడిని నిలుపుకుంటున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రత నగరంలోని తేమను లాగడానికి అయస్కాంతంా పనిచేస్తుంది.వేడి చల్లటి గాలి, తేమ కలిసి పెద్ద మేఘాలు ఏర్పడి అతి భారీవర్షాలు కురుస్తున్నాయి’’ అని భారతవాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త ఆకాశపు ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ధూళి కణాలు నీటి అణువులు కలిసిపోయి వర్షపు బిందువులను ఏర్పరుస్తున్నాయని ఐఎండీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రెండు సెంటీమీటర్ల వర్షానికే రోడ్లు జలమయం
హైదరాబాద్ నగరంలో కురిసిన అతి భారీ వర్షాలపై ఐఎండీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ ప్రచురించింది. హైదరాబాద్ నగరంలో స్వల్ప వ్యవధిలో రెండు సెంటీమీటర్ల వర్షం కురిస్తే చాలు వరదలకు దారి తీస్తుంది. అదే నగరంలో కొన్ని గంటల్లో 10 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వర్షం కురిస్తే రోడ్లు కూడా చెరువులుగా మారుతున్నాయని ఐఎండీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణ సగటు వర్షపాతం 56 సెంటీమీటర్లు కాగా, ఇప్పటికే 81 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. క్యుములోనింబస్ మేఘాలు సాధారణంగా భూమికి 500 నుంచి 2000 మీటర్ల మధ్య ఏర్పడతాయి. అదే ఉష్ణ మండల ప్రాంతాల్లో 12- 18 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటాయని ఐఎండీ అధికారులు చెప్పారు.
పెరిగిన ఉష్ణోగ్రతలు
హైదరాబాద్ నగరంలో చెట్లను కొట్టేస్తుండటంతో పచ్చదనం తగ్గి, వాతావరణ సమతౌల్యం దెబ్బతింది. దీంతో నగరంలో గతంలో కంటే ఉష్ణోగ్రతలు పెరిగాయి. రెండు నుంచి అయిదు డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు పెరిగాయి.పెరిగిన ఉష్ణోగ్రతలతో తేమ శాతం వల్ల పెద్ద మేఘాలు ఏర్పడితే అత్యధిక భారీవర్షాలు కురుస్తున్నాయి.శుక్రవారం అత్యధిక ఉష్షోగ్రత సాధారణంగా 28 డిగ్రీల సెల్షియస్ ఉండాలి. కానీ కాలుష్యం వల్ల శుక్రవారం 32.1 డిగ్రీల సెల్షియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని హైదరాబాద్ కేంద్రం ఐఎండీ హెడ్ డాక్టర్ కె నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. శుక్రవారం అత్యల్ప ఉష్ణోగ్రత 21.2 డిగ్రీల సెల్షియస్ గా నమోదైందని ఆమె తెలిపారు.
అత్యధిక వర్షపాతం
హైదరాబాద్ నగరంలో ఈ ఏడాది ఇప్పటికే మూడు సార్లు అత్యధిక వర్షపాతం నమోదైంది. సెప్టెంబరు 17వతేదీన ముషీరాబాద్ ప్రాంతంలో అత్యధికంగా 184.43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.నగరంలోని 26 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సెప్టెంబరు 17వతేదీన హైదరాబాద్ నగరంలో అతి భారీవర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంతంలో అత్యధికంగా 126.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని 25 ప్రాంతాల్లో ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో రోడ్లన్నీ చెరువులుగా మారాయి. నగరంలోని పలు లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి.
అతి భారీవర్షాలు ఇలా గుర్తిస్తారు...
వాతావరణశాఖ భారీవర్షాలను మూడు రకాలుగా వర్గీకరించారు. 24 గంటల్లో 64.5 నుంచి 115.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే దాన్ని భారీవర్షంగా చెబుతారు. 115.6 నుంచి 204..4 మిల్లీ మీటర్ల వర్షపాతాన్ని అతి భారీవర్షంగా పరిగణిస్తారు. కేవలం 24 గంటల్లో 204.5 మిల్లీమీటర్ల వర్షపాతానికి మించి నమోదైతే దాన్ని అత్యంత భారీవర్షపాతంగా గుర్తిస్తారు. కేవలం గంట సమయంలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్ బరస్ట్ అని చెబుతారు.
50 ఏళ్లలో హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్ ఎప్పుడంటే...
హైదరాబాద్ నగరంలో గడచిన 50 ఏళ్లలో 14 సంవత్సరాల్లో అతి భారీవర్షాలు నమోదయ్యాయి. గత 50 ఏళ్లలో అత్యధిక భారీవర్షాలు 14 సంవత్సరాలు హైదరాబాద్ లో కురిశాయని ఐఎండీ డేటా వెల్లడించింది.క్యుములో నింబస్ మేఘాల ప్రభావం వల్ల అతి భారీవర్షాలు కురుస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వరదలు
భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంఘం (TSDPS) డేటా ప్రకారం సెప్టెంబరు 17వతేదీన జంట నగరాల్లో విస్తృతంగా భారీ వర్షపాతం కురిసింది. అన్ని ప్రధాన ప్రాంతాలలో 50 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.ముషీరాబాద్‌లో 184.3 మిల్లీమీటర్ల నగరంలోనే అత్యధికంగా నమోదైంది. భోలక్‌పూర్ (155.5 మి.మీ), చిల్కల్‌గూడ (147.5 మి.మీ), సికింద్రాబాద్ (146.5 మి.మీ), మరియు మెట్టుగూడ (140.3 మి.మీ.) కూడా అతి భారీ వర్షపాతం నమోదైంది. లింగంపల్లి, హిమాయత్‌నగర్, మియాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, బేగంపేటతో సహా అనేక ఇతర ప్రాంతాల్లో 100మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది.వరదనీటితో నిండిన రోడ్ల గుండా పాదచారులు నడవడానికి ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ స్తంభించి పోయింది.
14 ఏళ్ల అతి భారీ వర్షాల రికార్డులివి...
హైదరాబాద్ నగరంలో 2000వ సంవత్సరం ఆగస్టునెల 24వతేదీన అత్యధికంగా 241.5 మిల్లీమీటర్ల వర్షం కురిసి రికార్డు నెలకొల్పింది. 1989వ సంవత్సరం జులై 24 వతేదీన 140.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనే అతి భారీవర్షాలు కురిశాయి.2009వ సంవత్సరం ఆగస్టు 18వతేదీన 133.7 మిల్లీమీటర్లు, 2008 ఆగస్టు 9వతేదీన 121.9 మిల్లీమీటర్లు, 2012 జులై 21వతేదీన 115.1 మిల్లీమీటర్లు, 2001 జూన్ 12వతేదీన 114.6 మిల్లీమీటర్ల వర్షం కురిసి రికార్డులు నెలకొల్పింది.హైదరాబాద్ నగరంలో 1978వ సంవత్సరంలో ఆగస్టు నెల 15వతేదీన 113.7 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం నమోైదైంది.అలాగే 2017వ సంవత్సరం ఆగస్టు 26వతేదీన 113.7 మిల్లీమీటర్లు, 2006 జులై 27వతేదీన 106.8 మిల్లీమీటర్లు, 1991 ఆగస్టు 3వతేదీన 98.0 మిల్లీమీటర్లు,1981 జూన్ 26వతేదీన 97.2 మిల్లీమీటర్లు,2006 ఆగస్టు 5వతేదీన 96.1 మిల్లీమీటర్లు,1991వ సంవత్సరం సెప్టెంబరు 22వతేదీన 95.1 మిల్లీమీటర్లు, 1996 ఆగస్టు 28వతేదీన 92.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
వర్షపాతం ఆల్ టైం రికార్డులు
హైదరాబాద్ నగరంలో 1946 ఆగస్టు 1వతేదీన 24 గంటల్లో 241.5 మిల్లీమీటర్ల అత్యధిక వర్షం కురిసి ఐఎండీ రికార్డులకెక్కింది. 2000వ సంవత్సరం ఆగస్టు 24వతేదీన కురిసిన వర్షం కూడా ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. ఆ రోజు 241.5 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. 1989వ సంవత్సరంలో జులై 24వతేదీన 140.5 మిల్లీమీటర్లు, 2009 వ సంవత్సరం ఆగస్టు 18వతేదీన 133.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో 1891వ సంవత్సరం నవంబరు 10వతేదీన 45.5 అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 1966 ఫిబ్రవరి 6వతేదీన హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రత 6.1 గా నమోదైంది.
తెలంగాణలో భారీ నుంచి అతి భారీవర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన రోజుల సంఖ్య పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారుల రికార్డులే తేటతెల్లం చేస్తున్నాయి. 2015వ సంవత్సరంలో భారీ నుంచి అతి భారీవర్షాలు 43 రోజుల పాటు కురిస్తే 2021వ సంవత్సరంలో 100 రోజుల పాటు అధిక వర్షాలు నమోదయ్యాయి. గత ఏడాది 87 రోజులు, 2023లో 64 రోజులు, 2022వ సంవత్సరంలో 98 రోజుల పాటు అత్యంత భారీవర్షాలు కురిసినట్లు ఐఎండీ రికార్డుల్లో నమోదైంది. 2016లో 73 రోజులు.2017లో 49 రోజులు, 2018లో 45 రోజులు, 2019లో 60 రోజులు, 2020లో 92 రోజుల పాటు అధిక వర్షాలు కురిశాయని హైదరాబాద్ కేంద్రం ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆకాశపు ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో అతి భారీవర్షాల రికార్డుల పట్టిక
సంవత్సరం - భారీవర్షం కురిసిన రోజులు
2015 -43
2016 -73
2017 -49
2018 -45
2019 -60
2020 -92
2021 -100
2022 -98
2023 -64
2024 -87