Tirumala Drone || తిరుమల ఆలయం పై డ్రోన్ కలకలం. యూట్యూబర్ అరెస్ట్..!
తిరుమలలో మరోసారి భద్రత వైఫల్యం.;
తిరుమల కొండలపై విమానాలు తరచూ ఎగురుతుండటం ఈ మధ్యకాలంలో సర్వ సాధారణమైంది.ఏకంగా శ్రీవారి ఆలయం సమీపంలోనే విమానాల రాకపోకలు సాగించడం భక్తుల కంటపడుతోంది.ఆనంద నిలయం పైనా విమానాలు ప్రయాణం భక్తులను కలవరపెడుతోంది. అయితే తిరుమల కొండపై విమానాలు ఎగరడం ఆగమ శాస్త్ర విరుద్ధమన్న చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. దీంతో తిరుమల హిల్స్ నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలన్న డిమాండ్ కూడా ఎప్పటినుంచో వినిపిస్తోంది.
తిరుమల కొండపై ఆకాశమార్గాన విమాన విహంగం అటుంచితే ఇప్పుడు డ్రోన్ ఎగరడం సంచలనంగా మారింది. ఏడాది క్రితం మాడ వీధుల్లో డ్రోన్ ఎగరడం ఆ తర్వాత వెలుగులోకి రావడంతో టీటీడీ చర్యలు చేపట్టింది.ఇప్పుడు తాజాగా ఓ యూట్యూబర్ తిరుమలలో డ్రోన్ కెమెరా తో చిత్రీకరించడం భద్రతా వైఫల్యాలను మరోసారి ఎత్తిచూపింది. రాజస్థాన్ కు చెందిన ఓ యూట్యూబర్ శ్రీవారి ఆలయ పరిసరాల ప్రాంతాల్లో 10 నిమిషాల పాటు నింగిలో డ్రోన్ తో షూట్ చేశాడు. వెంటనే సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు. యువకుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న హరినామ సంకీర్తన మండపం వద్ద డ్రోన్ ఎగుర వేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అన్షుమన్ తరెజా అను ఓ యూట్యూబర్ శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న మండపం వద్ద డ్రోన్ ఎగురవేసినట్లు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తెలిపారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని డ్రోన్ స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించినట్లు ప్రకటనలో తెలిపారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.