గురుకులాలకు పడ్డ తాళాలు.. ప్రభుత్వంపై హరీష్ మండిపాటు...

రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు తాళాలు పడ్డాయి. భవన యజమానులు అంతా కూడబలుక్కుని.. అద్దెల అంశంపై భవనాలకు తాళాలు వేశారు.

Update: 2024-10-15 08:17 GMT

రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకులాలకు తాళాలు పడ్డాయి. భవన యజమానులు అంతా కూడబలుక్కుని.. అద్దెల అంశంపై భవనాలకు తాళాలు వేశారు. తమకు అద్దె చెల్లించే విషయంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని, ఎన్నిసార్లు అడిగినా ఉలుకు పలుకు లేకుండా ప్రవర్తిస్తుందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగానే ఈరోజు మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, వసతి గృహాల భవనాలకు యాజమానులు తాళాలు వేశారు. తమకు దాదాపు 9నెలల కిరాయి అందాల్సి ఉందని, పలు ప్రాంతాల్లో 30 నెలల కిరాయి కూడా రావాల్సి ఉందని భవన యజమానులు చెప్తున్నారు. ఇదే విసయాన్ని తెలుపుతూ ప్రతి భవనం ఎదుట ఒక బ్యానర్‌ను కూడా ఏర్పాటు చేశారు యజమానులు. అందులో అసలు విషయాన్ని వారు వివరించారు. అద్దె అందని కారణంగానే తాళాలు వేసినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలియక పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు బయటే పడిగాపులు కాస్తున్నారు. తమకు వెంటనే బకాయిలు చెల్లించాలని, చెల్లింపు పూర్తికాగానే తాళాలు తెరుస్తామని రాష్ట్ర గురుకుల విద్యాలయ ప్రైవేటు భవన యాజమాన్య సంఘం డిమాండ్ చేసింది.

సంఘం ఏమంటోందంటే..

‘మార్చి నెల నుంచి గురుకుల భవనాలకు నెల వారి అద్దె చెల్లించనందున, కొన్ని గురుకులాల్లో 30 నెలలకు పైగా అద్దె బకాయిలు ఉన్నాయి. ఈ విషయంపై అనేక సార్లు కమిషనర్ స్థాయిలో వినతి పత్రాలు ఇచ్చినా ఏ విధమైన స్పందన లేదు. దాంతో ఇప్పటికే ఇచ్చిన నోటీసు ఆధారంగా నేడు మా భవనాలకు తాళాలు వేసుకుంటూ బకాయి చెల్లించిన తర్వాతే తాళం తీస్తాం. అసౌకర్యానికి చింతిస్తూ.. మా బాధలు అర్థం చేసుకోగరని తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి’’ అని వారు పేర్కొన్నారు. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు స్పందిస్తూ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగానికి చెదలు పట్టడం మొదలయ్యాయంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా సీఎంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అద్దెలు ఎప్పుడు చెల్లిస్తారు?: హరీష్

గురుకులాల భవనాలకు యజమానులు తాళాలు తేసుకోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దుస్థితి రావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వం 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యజమాని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కు తాళం వేసిన దుస్థితి. కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అద్వాన్న స్థితికి చేరుకున్నదనడానికి ఇది మరొక నిదర్శనం. ముఖ్యమంత్రి సారు.. గురుకులాలకు అద్దెలు ఇంకెప్పుడు చెల్లిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజురోజుకి దిగజారి పోతున్న విద్యావ్యవస్థ గురించి విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్న మీరు.. ఇంకెప్పుడు పట్టించుకుంటారు?’’ అని ప్రశ్నించారు.

బాధ్యత బీఆర్ఎస్‌ది కాదా..!

ఈ క్రమంలో ప్రజల నుంచి బీఆర్ఎస్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురివిందన తన నలుపు ఎరగదన్నట్లు బీఆర్ఎస్ తీరు ఉందంటూ కాంగ్రెస్ వర్గాలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. భవన యజమానులు పెట్టిన పోస్టర్‌లోనే కొన్ని ప్రాంతాల్లో 30 నెలల అద్దె బకాయిలు ఉన్నాయని వెల్లడించారని, 30 నెలల క్రితం తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో 30 నెలల బకాయిలు ఎలా వచ్చాయో వివరించాలని, ఇష్టారాజ్యంగా గురుకులాలు పెట్టి గురుకుల వ్యవస్థను చెడగొట్టిన ఘనత కేసీఆర్‌ది కాదా అని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి.

ఆరోపణలు తర్వాత తెరిచేదెప్పుడు..

కాగా గురుకులాలకు తాళాలు పడ్డ అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతుండటంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలు, తిట్లు ఇవన్నీ తర్వాత ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? గురుకులాలు మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటాయి? ఇది వేల మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశంగా ప్రభుత్వం గుర్తించి.. వీలైనంత తర్వాత దీనిపై చర్యలు చేపట్టాలి అని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, వారికి నిరాంటంకంగా, యథావిథిగా చదువు లభించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News