ఇరాన్ అధ్యక్షుడు రైసీని 'బుచర్ ఆఫ్ టెహ్రాన్' అని ఎందుకు అంటారు?

ఇరాన్ దేశాధ్యక్షుడు రైసీపై ఆ దేశ పౌరులకు ఎందుకంత వ్యతిరేకత? వేలాది మంది నిరసనకారులను ఆయన ఏం చేశారు? 'బుచర్ ఆఫ్ టెహ్రాన్' పేరు ఎందుకు మూటగట్టుకున్నారు?

Update: 2024-05-20 12:10 GMT

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పదవిలో ఉండగా ఇరానియన్లపై ఉక్కుపాదం మోపారు. తన ఆంక్షలకు ఎదురుతిరిగిన వాళ్లపై భద్రతా బలగాలతో అరెస్టు చేయించి జైల్లో పెట్టించారు. కొంతమందిని ఏకంగా ఊరి తీయించారు. అందుకే ఆయనను 'బచర్ ఆఫ్ టెహ్రాన్' అభివర్ణించారు.

ఇరాన్‌-అజర్‌బైజాన్‌ సరిహద్దుల్లో నిర్మించిన డ్యాంలను ప్రారంభించిన తర్వాత.. ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌లో తిరుగు పయనమయ్యారు. జోల్ఫా నగర సమీపంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్‌, ఇరాన్ తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, అధికారులు, అంగరక్షకులు కూడా మృతిచెందారు.

రైసీ కఠిన ఆంక్షలు..

రైసీ 2022లో మహిళల వస్త్రధారణపై తీవ్ర ఆంక్షలు విధించారు. డ్రస్ కోడ్ ఉల్లంఘించినందుకు పోలీసు కస్టడీలో 22 ఏళ్ల మహ్సా అమినీ మరణించింది. ఈ ఘటన ఇరాన్‌లో పెద్ద తిరుగుబాటుకు దారితీసింది. వేలాది మంది ఇరానియన్లు వీధుల్లోకి వచ్చి హిజాబ్‌లను బహిరంగంగా కాల్చి, జుట్టు కత్తిరించుకోవడం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. దాంతో భద్రతా బలగాలతో వందల మంది నిరసనకారులను చంపించాడు. వేలాది మందిని అరెస్టు చేయించారు. అశాంతిని ప్రేరేపించారని ఏడుగురు వ్యక్తులు ఉరితీయించాడు.

డెత్ కమిటీ మెంబర్..

1988లో రాజకీయ ఖైదీలకు ఉరిశిక్షలను పర్యవేక్షించే డెత్ కమిటీలో రైసీ సభ్యుడు. 1988లో టెహ్రాన్ సమీపంలోని జైళ్లలో వేలాది మంది అసమ్మతివాదులను ఉరితీసినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. నిజానికి ఈ ఘటనే అతనికి 'బచర్ ఆఫ్ టెహ్రాన్' అనే పేరు తెచ్చిపెట్టింది. 2019లో కూడా ఇరాన్ ప్రజలను అణచివేయడం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో రైసీపై అమెరికా ఆంక్షలు విధించింది.

1999 విద్యార్థి నిరసనలు..

1999లో విద్యార్థుల నిరసనలపై అణిచివేతలో రైసీ ముఖ్యమైన పాత్ర పోషించారు.

2009 హరిత ఉద్యమం అణిచివేత..

2009 గ్రీన్ మూవ్‌మెంట్ నిరసనల సందర్భంగా ధ్యక్ష ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ ప్రదర్శనకారులను క్రూరంగా అణచివేయడాన్ని రైసీ సమర్ధించారు.

2017 నిరసనలు..

2017 చివరలో, ఆర్థిక ఇబ్బందులు మరియు రాజకీయ మనోవేదనల కారణంగా ఇరాన్ అంతటా విస్తృతమైన నిరసనలు చెలరేగాయి. భద్రతా దళాలు కనీసం 25 మందిని హతమార్చాయి. వేలాది మందిని అరెస్టు చేశాయి. వీరిలో చాలా మందికి కఠినమైన శిక్షలు వేశారు.

2019 ఇంధన నిరసనలు

నవంబర్ 2019లో ఇరానియన్లు ఆకస్మిక ఇంధన ధరల పెరుగుదలను నిరసించారు. న్యాయవ్యవస్థ అధిపతిగా రైసీ ఆదేశాలతో భద్రతా దళాలు 300 నుండి 1,500 మంది నిరసనకారులను చంపేసినట్లు వార్తలొచ్చాయి.

రైసీ - యు.ఎస్..

ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయించడంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

రైసీ కుటుంబ నేపథ్యం..

రైసీ 1960లో ఈశాన్య ఇరానియన్ నగరమైన మషాద్‌లో ఒక మతపరమైన కుటుంబంలో జన్మించారు. ఇరాన్‌లోని బలమైన సంప్రదాయ వర్గానికి చెందిన రైసీ తన 15వ ఏట క్వామ్‌లో మత విద్యను అభ్యసించారు. ఇరాన్‌ సుప్రీం అయతుల్లా ఖమేనీకి ఇబ్రహీం రైసీ అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న రైసీ 20 ఏట ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు చేపట్టి పలు నగరాల్లో విధులు నిర్వహించారు. అనంతరం డిప్యూటీ ప్రాసిక్యూటర్‌గా రాజధాని టెహ్రాన్‌కు బదిలీ అయ్యారు. 1983లో జమైలానుమను పెళ్లాడారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. 1988లో అత్యంత వివాదాస్పదమైన బాధ్యతలను చేపట్టారు. ఖైదీలను సామూహికంగా ఉరితీసినందుకు ప్రతిపక్షాల్లో అపఖ్యాతి పాలయ్యారు. క్రమేణా రైసీ దేశంలో కీలక పదవులను అందిపుచ్చుకున్నారు. 2015లో ఇరాన్‌ అణుఒప్పందం చేసుకోవడాన్ని రైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. 2017లో నాటి అధ్యక్షుడు హసన్‌ రౌహానీపై అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2021లో ఆయన కల నెరవేరింది. ఎన్నికల్లో గెలిచారు.

రైసీ తర్వాత అధ్యక్షుడు..

హెలికాప్టర్ ప్రమాదంలో రైసీ మరణం తర్వాత ఇరాన్ రాజ్యాంగం ప్రకారం ఆ దేశ మొదటి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ మోఖ్బర్ బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు. 50 రోజుల్లోగా కొత్త అధ్యక్షుడి ఎన్నికకు ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశ రాజ్యాంగం చెబుతుంది.

Tags:    

Similar News