'ఇండిగోపై కఠిన చర్యలు’

పునరావృతం కానివ్వమన్న కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్‌మోహన్ నాయుడు

Update: 2025-12-08 12:27 GMT
Click the Play button to listen to article

ఇండిగో(IndiGo) విమానాల గందరగోళాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించమే కాకుండా వారిపై చర్యలు కూడా తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన మంత్రి(Civil Aviation Minister) కింజారపు రామ్‌మోహన్ నాయుడు (Ram Mohan Naidu Kinjarapu) పేర్కొన్నారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. “మేం ఈ పరిస్థితిని తేలికగా తీసుకోవడం లేదు. విచారణ జరుపుతున్నాం. ఈ పరిస్థితికి కారకులపై కఠిన చర్య తీసుకుంటాం” అని అన్నారు. విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులకు సంబంధించిన నిబంధనలను ఇండిగో సరిగా అమలుచేయకపోవడమే సర్వీసుల రద్దుకు దారితీసిందని, ఏవియేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ (AMSS) ఈ అంతరాయాలకు కారణం కాదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇతర ఎయిర్‌లైన్స్ నుంచి ఇలాంటివి పునరావృతం కాకుండా మా చర్యలు ఉండనున్నాయని చెప్పారు. ఈ రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఇండిగో సంక్షోభంపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి వివరణ ఇచ్చారు.


ప్రయాణికులకు రూ.569 కోట్లు తిరిగి చెల్లింపు..

వినానాశ్రయాల్లో ఎక్కువ గంటలు వేచి ఉండడం, అధిక ఛార్జీల వసూలు చేయడం గురించి ఎంపీ తంబి దురై అడిగిన ప్రశ్నకు ..‘‘ప్రయాణికుల సౌకర్యానికి చింతిస్తున్నాం. ఐదు లక్షలకు పైగా PNR రద్దయ్యాయి. ప్రయాణీకులకు రూ. 569 కోట్లు తిరిగి చెల్లించారు. నాలుగు ధరల శ్లాబ్‌లు ప్రకటించాం. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం," అని నాయుడు పేర్కొన్నారు.

Tags:    

Similar News