ఢిల్లీ ధర్నా: బీజేపీని బ్లాక్ మెయిల్ చేయటమే జగన్ లక్ష్యమా?
తనకు ఇండి కూటమితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని, అవసరమైతే ఆ కూటమిలోకి జంప్ చేయగలనని బీజేపీ పెద్దలకు సందేశాన్ని ఇవ్వటమే జగన్ లక్ష్యమని అంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నా ఓ మోస్తరుగా విజయవంతం అయిందని చెప్పొచ్చు. అఖిలేష్ యాదవ్, సంజయ్ రౌత్ వంటి కొందరు జాతీయస్థాయి నేతలు శిబిరాన్ని సందర్శించి జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. అయితే జగన్ ధర్నా ద్వారా మరో లక్ష్యాన్ని కూడా సాధించారని ఒక వాదన ఇవాళ రౌండ్‌లు కొడుతోంది.
ఏపీలో ఆటవిక పాలన జరుగుతోందని జాతీయస్థాయిలో కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టటం లక్ష్యంగా జగన్ ఇవాళ ఉదయం జంతర్ మంతర్ దగ్గర ధర్నా ప్రారంభించారు. ఇండియా కూటమికి చెందిన పలువురు జాతీయ నేతలు ధర్నా శిబిరానికి హాజరయ్యి సంఘీభావం ప్రకటించారు. గత పదేళ్ళుగా రాజ్యసభ ఎంపీగా ఢిల్లీలో ఉంటున్న విజయసాయిరెడ్డి, మరోవైపు వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా ఎంపికైన పారిశ్రామికవేత్త, రిలయెన్స్ డైరెక్టర్ పరిమళ్ నాథ్వానిలకు ఉన్న రాజకీయ పరిచయాలు బాగానే ఉపయోగపడినట్లు కనిపిస్తోంది. సమాజ్‌వాది అధినేత, ఇండీ కూటమిలో కీలక నేత అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నదీముల్ హక్, ఉద్ధవ్ శివసేన ఎంపీలు సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, సమాజ్‌వాది ఎంపీ రాంగోపాల్ యాదవ్, అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై, ఐయూఎంఎల్ ఎంపీ వహాబ్ తదితరులు ధర్నా శిబిరానికి హాజరైనవారిలో ఉన్నారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరికాదని అఖిలేష్ అన్నారు. యూపీలో కూడా ఇదే పరిస్థితి ఉందని, బుల్డోజర్ రాజకీయం నడుస్తోందని చెప్పారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ జగన్ జాతీయనేతలకు వీడియోలు చూపించారు. త్వరలో రాష్ట్రపతిని, ప్రధానిని కలిసి పరిస్థితి వివరిస్తామని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించమని కోరతామని చెప్పారు.
ధర్నా శిబిరాన్ని సందర్శించిన ఇండి కూటమి నేతలను చూపించటంద్వారా జగన్ మరో లక్ష్యాన్ని కూడా సాధించారనే వాదన వినబడుతోంది. తనకు ఇండి కూటమితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని, అవసరమైతే ఆ కూటమిలోకి జంప్ చేయగలనని బీజేపీ పెద్దలకు సందేశాన్ని ఇవ్వటమే ఆ లక్ష్యమని అంటున్నారు. నిన్న ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులపై జగన్ స్పందించకపోవటానికి కారణం కూడా ఇదేనని చెబుతున్నారు. సాక్షి పేపర్, టీవీ ఛానల్‌లోనేమో చంద్రబాబు చక్రం తిప్పలేకపోయాడని, ఏపీకి కేంద్రం పంగనామాలు పెట్టిందని తీవ్రంగా విమర్శలు చేసి, జగన్ ఒక్కమాట కూడా మాట్లాడకపోవటానికి కారణం - బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు కాకుండా, అదే సమయంలో మిత్రపక్షమైనట్లు కాకుండా గోడమీద పిల్లిలాగా కనబడటానికేనని అంటున్నారు. ఒకవేళ ఈ వాదన నిజమైతే, ఇలాంటి రాజకీయాలలో పండిపోయిఉన్న మోదీ, అమిత్‌షాలు జగన్ చేసే ఈ బ్లాక్ మెయిల్ రాజకీయానికి ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. రాజ్యసభలో ఎన్‌డీఏ కూటమికి మెజారిటీకోసం వైసీపీకి ఉన్న పదకొండుమంది సభ్యుల మద్దతు అవసరం కాబట్టి జగన్‌ను వదులుకోకూడదని చూస్తారా, లేకపోతే సీబీఐ, ఈడీ సంస్థల ద్వారా మరోసారి ఝలక్ ఇచ్చి తమ దోవలోకి తెచ్చుకుంటారా అనేది చూడాల్సి ఉంది. జగన్‌పై ఉన్న అక్రమ ఆస్తుల కేసులతోపాటు, వివేకానంద హత్య కేసును కూడా తిరగతోడవచ్చు. దీనికి ఇంకో కోణంకూడా ఉంది. బీజేపీ, చంద్రబాబు కలిసి రాజ్యసభలోని వైసీపీ పార్టీని చీల్చి పదకొండుమందిలో కొందరిని లాక్కునే అవకాశం కూడా లేకపోలేదు. అందులోనూ మోది, అమిత్‌షాలు దీనిలో సిద్ధహస్తులని వేరే చెప్పనక్కరలేదు కదా.
ఇదిలా ఉంటే, బాబాయి వివేకానందరెడ్డిని హత్యచేసినవారిని పట్టుకోవాలని ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదంటూ షర్మిల జగన్‌ను నిలదీస్తున్నారు.