పల్నాటి చరిత్ర చెప్పే ‘వీరమేడపి’

నాగమ్మ, బ్రహ్మనాయుడుల మధ్య జరిగిన పల్నాటి యుద్ధానికి ప్రత్యక్ష్య సాక్ష్యం వీరమేడపి. బ్రహ్మనాయుడు రాజ్యం వదిలి నివశించిన ప్రాంతం. ఆ ఊరు ఇప్పుడు ఎక్కడ ఉంది?

Update: 2024-09-25 04:00 GMT

ప్రతి ఊరికీ ఒక కథ ఉంటుంది. ప్రతి శిథిలానికీ ఒక చరిత్ర ఉంటుంది. ‘వీర మేడపి’ గ్రామాన్ని తడిమితే చాలు గతించిన ఎన్నడో గతించిన పల్నాటి వీర గాధ మన ముందు సాక్షాత్కరిస్తుంది. అక్కడి చెన్నకేశవాలయాన్ని గమనిస్తే చాలు ఆ వీర గాథకు మౌన సాక్షిగా నిలబడినట్లనిపిస్తుంది. శిథిల మవుతున్న ఆ ఆలయాన్ని పరికిస్తే కాల గమనానికి మౌనంగా మోకరిల్లినట్లనిపిస్తుంది.

నాయకురాలు నాగమ్మ కుతంత్రాలతో జరిగిన కోడి పందాలలో బ్రహ్మనాయుడు పందెం ప్రకారం రాజ్యం వదిలి నివశించిన ప్రాంతమే ఈ వీర మేడపి గ్రామం. ప్రకాశం జిల్లాలోని మండల కేంద్రమైన త్రిపురాంతకానికి పది కిలో మీటర్ల దూరంలో తూర్పువైపున ఈ వీర మేడపి గ్రామం ఉంది. పందెంలో ఓడిపోయిన బ్రహ్మనాయుడు శ్రీశైలం వెళ్లి అక్కడ మల్లికార్జునుని సేవించాడు. తరువాత మార్కాపురం వచ్చి అక్కడ చెన్నకేశవుని ఆరాధించాడు. అనంతరం త్రిపురాంతకం వచ్చిన బ్రహ్మనాయుడు అక్కడికి సమీపంలో ఉన్న మేడి చెట్లను కొట్టించి మేడపి గ్రామాన్ని నిర్మించినట్లు, రానున్న యుద్దానికి ప్రజలను సన్నద్ధం చేయడానికి యువకులకు ఆ గ్రామంలోనే యుద్ధ శిక్షణ ఇచ్చినట్లు ప్రశస్తి. అందు చేతనే ఆ గ్రామానికి ‘వీరమేడపి’ అన్న పేరు సార్థకమైందని అంటారు. ఈ గ్రామంలోనే బ్రహ్మనాయుడు చెన్నకేశవుని ఆలయాన్ని నిర్మించాడు.

Delete Edit

వీరమేడపి గ్రామం

ఆ సమయంలో చెన్నకేశవుని విగ్రహం బ్రహ్మనాయుడు స్వయంగా తెచ్చి ప్రతిష్టించినట్లు వాడుకలో ఉంది. బ్రహ్మనాయుడు చెన్నకేశవ స్వామికి మహా భక్తుడు. మాచర్లలో ఆ స్వామి ఆలయాన్ని నిర్మించి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామిని కొలిచిన బ్రహ్మనాయుడు, వీరమేడపిలో ఉండవలసి రావడం వల్ల అక్కడ కూడా ఆ స్వామి ఆలయాన్ని నిర్మించాడని అంటారు. కుల వైషమ్యాలకు వ్యతిరేకంగా సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేసిన సంస్కర్తగా చరిత్రలో బ్రహ్మనాయుడుకు ఉన్న పేరు ప్రఖ్యాతలు అందరికీ తెలిసిందే. అలాంటి బ్రహ్మనాయుడు ఈ గ్రామ సమీపంలోనే మేడి చెరువును కూడా నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడుల మధ్య జరిగిన రాయభారం విఫలమవుతుంది. యుద్దం అనివార్యమవుతుంది. వారిరువురూ ప్రతిజ్ఞలు చేసి యుద్ధానికి సిద్దమవుతారు. యుద్ధ ప్రతిజ్ఞలు చేసి కంకణాలు కట్టుకున్న ప్రదేశంలో ఏర్పడ్డ గ్రామాన్ని ‘కంకణాలపల్లె’ గా పిలుస్తారు. ఈ పేరుతో ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది. నేటికీ ఆ గ్రామాన్ని కంకణాలపల్లెగానే పిలవడం విశేషం.

Delete Edit

మాచర్ల చెన్నకేశవ స్వామి ఆలయం

అలాగే బ్రహ్మనాయుడు యుద్ధానికి వెళుతూ త్రిపుర సుందరి దేవిని మరీ కొలిచి వెళ్లడం వల్ల ఆ దేవతను కొలిచిన స్థలంలో ఏర్పడిన గ్రామానికి ‘త్రిపురవరం’ అన్న పేరు వచ్చింది. ఈ రెండు గ్రామాలు త్రిపురాంతకం మండలంలోని వీరమేడపి గ్రామానికి సమీపంలోనే ఉన్నాయి. బ్రహ్మనాయుడి సైన్యాలకు, నాయకురాలు నాగమ్మ సైన్యాలకు మధ్య ‘కారంపూడి’ వద్ద జరిగిన చారిత్రాత్మక పల్నాటి యుద్ధంలో నాగమ్మ ఓడిపోతుంది. బ్రహ్మనాయుడి కుమారుడు, నూనూగు మీసాల బాలచంద్రుడు వీరోచితంగా ఆ యుద్ధంలో పోరాడి, ప్రదర్శించిన సాహసాలు ఈ నాటికీ కథలు, కథలుగా చెప్పుకుంటుంటారు. ఇంతటి చరిత్ర కలిగిన వీరమేడపి గ్రామంలో బ్రహ్మనాయుడి చేత నిర్మించిన చెన్నకేశవాలయం శిథిలావస్థకు చేరుకుంటోంది. ఈ ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయనే దురాశతో కొందరు దుండగులు మూల విరాట్ ను ధ్వంసం చేసారు. బ్రహ్మనాయుడు నిర్మించిన మరొక దేవాలయం అంకాలమ్మ గుడి కూడా దుండగుల దురాశకు ధ్వంసమై పోయింది.

పల్నాటి యుద్ధానంతరం వీరుల జ్ఞాపకార్థం ఇక్కడ నిర్మించిన వీరుల గుడికూడా అవసాన దశకు చేరుకుంది. ఇత్తడితో పోత పోసిన వీరుల విగ్రహాలు ఈ ఆలయంలో ఈ నాటికీ ఉన్నాయి. ఇక్కడ బాలచంద్రుడు బొంగరాలు ఆడిన ప్రదేశాన్ని బొంగరాల గడ్డగా ఈ నాటికీ పిలుస్తుంటారు. ఈ గడ్డ ప్రాంతంలో సాగర్ నీరు పారే అవకాశం ఉన్నా గ్రామస్తులు మాత్రం వారి చారిత్రక చిహ్నంగా బొంగరాల గడ్డను సాగు చేయకుండా అలాగే కాపాడుతూనే ఉన్నారు. ప్రతి ఏటా కార్తీక బహుళ అమావాస్య నాడు ఇక్కడ ‘వీరుల కొలుపు’ వైభవంగా జరుగుతుంది. ఇక్కడికి కోటప్పకొండ, పుల్లలచెరువు, గంగవరం నుంచి భక్తులు వచ్చి ఈ వీరుల కొలుపులో కత్తుల కవాతు చేస్తారు. పల్నాటి వీర గాధలను గానం చేస్తూ ఈ కొలుపులో బుర్ర కథలు కూడా చెబుతారు. చెన్నకేశవ స్వామి ఆలయానికి సాగరు కాలువ కింద సాగయ్యే ఆరు ఎకరాల పొలం కూడా ఉంది. కానీ ఈ పొలం ఒక గ్రామ పెద్ద అధీనంలో ఉండటం వల్ల ఆదాయం ఉన్నా ఆలయానికి ఆలనా పాలనా కరువైంది. ఇంతటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతాన్ని అటు దేవదాయ శాఖ కానీ, ఇటు పురావస్తు శాఖ కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. చారిత్రక శిథిలాలు మన జాతి సంస్కృతి చిహ్నాలని భావించే పురావస్తు శాఖ వారైనా ఈ శిథిల దేవాలయాలను స్వాధీనం చేసుకోవాలని, వాటిని కాపాడాలని ఇక్కడి ప్రజల చిరకాల కోరిక. 

Tags:    

Similar News