అమ్రాబాద్‌ టైగర్ రిజర్వులో శృంగారానికి వేళాయే...

వర్షాకాలం అడవుల్లోని పులులు, వన్యప్రాణులు సంతానోత్పత్తి కోసం జతకూడే సమయం వచ్చింది. దీంతో అభయారణ్యాల్లో జనసంచారంపై అటవీశాఖ అధికారులు ఆంక్షలు విధించారు.

Update: 2024-08-26 01:15 GMT

వర్షాకాలంలో వర్షాలు కురుస్తుండటంతోపాటు వాతావరణం వన్యప్రాణులకు అనువుగా ఉంటుంది. దీంతో అభయారణ్యంలోని పులులు, ఇతర వన్యప్రాణులు పునరుత్పత్తి కోసం వర్షాకాలాన్ని ఎంచుకుంటుంటాయి.పులులు సంభోగ సమయంలో ఏకాంతాన్ని కోరుకుంటాయి. అడవిలో చిన్న అలజడి కలిగినా పులులు జతకూడవు. జులై 1వతేదీ నుంచి సెప్టెంబర్‌ 31వ తేదీ వరకే పులులు సంతానోత్పత్తిలో పాల్గొంటాయి.ఈ సమయంలో పులులు,ఇతర జంతువులు చాలా ఆవేశంగా ఉంటాయని, అడవిలో జనసంచారం కనిపిస్తే అవి దాడి చేసే అవకాశం ఉందని, అందుకే నల్లమల అడవుల్లో ప్రజల సందర్శనకు అనుమతులు నిలిపివేసినట్లు అటవీశాఖ అధికారి రోహిత్‌ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


పులుల కోసం అడవిలో ఆవాసాలు
నాగర్‌కర్నూల్‌,నల్గొండ జిల్లాల్లో 2,61,139 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమ్రాబాద్‌ రిజర్వు టైగర్‌ (ఏటీఆర్‌)విస్తరించి ఉంది.పులుల కోసం అభయారణ్యంలో అటవీశాఖ అధికారులు ఆవాసాలను ఏర్పాటు చేశారు. పులులు సెప్టెంబరు నుంచి మూడు నెలల పాటు సంతానోత్పత్తి కోసం కలుస్తుంటాయి. ఇతర అటవీ ప్రాంతాల నుంచి కూడా పులులు వచ్చి కలుస్తుంటాయి.అభయారణ్యంలో పులుల సంతానోత్పత్తి వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించారు. పులుల సంరక్షణ ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించి పులుల సంతానోత్పత్తి సీజనులో వీటికి ఆటంకం కలగకుండా అటవీశాఖాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అమ్రాబాద్ అభయారణ్యంలో పులుల సంతాన ఉత్పత్తి కోసం అధికారులు చేపట్టిన చర్యలు దేశవ్యాప్తంగా నమూనాగా నిలిచాయి.

అడవుల్లోకి ప్రజలు వెళ్లకుండా నిషేధం
పులులు జతకూడే సమయంలో రక్షిత అటవీ ప్రాంతాల్లో ప్రజలు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఈ అడవి లోపల పలు దేవాలయాలు ఉన్నా, పులుల సంతానోత్పత్తి సమయంలో వాటి సందర్శనకు భక్తులు వెళ్లకుండా నిషేధం విధించారు.పులులున్న ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.పులుల సంతానోత్పత్తి సీజనులో పులులకు ఆటంకం కలిగించకుండా ఉండేందుకు అటవీ సమీప గ్రామాల రైతులు తమ పశువులను కోర్‌ ఏరియాలో కాకుండా బఫర్‌ ఏరియాలో మేపుకునే అవకాశం కల్పించామని మహబూబ్ నగర్ అటవీశాఖాధికారి రోహిత్ చెప్పారు.

జతకూడేందుకు తరలివస్తున్న పులులు
పులుల సంతానోత్పత్తి సీజన్ ప్రారంభం కావడంతో పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి పులులు కవ్వాల పులుల అభయారణ్యానికి వచ్చాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.జన్నారం అటవీ డివిజన్ లోని పలు ఫారెస్ట్ బీట్లలో పులి సంచరిస్తున్నట్లు అడవిలో దాని పగ్ మార్కులు రికార్డు అవడంతో వెలుగుచూసింది. ఎనిమల్ ట్రాకర్ల ద్వారా పులి కదలికలను గుర్తించామని జిల్లా అటవీశాఖ అధికారి శివ అశీష్ సింగ్ చెప్పారు.వేసవికాలంలో పులులు నాగార్జునసాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం నుంచి అమ్రాబాద్ పులుల అభయారణ్యానికి వస్తున్నాయని కెమెరా ట్రాప్ ల ద్వారా వెలుగుచూసింది.అటవీ శాఖ జులై 1 నుంచి సెప్టెంబర్‌ 31వతేదీ వరకు పెద్ద పులులు,చిరుతలు,ఎలుగుబంట్లు,ఇతర జంతువులు జతకూడే సమయం. ఎలాంటి అలజడి ఉండకూడదనే ఉద్దేశంతో ఎన్‌టీ సీఏ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటవీశాఖ అధికారి రోహిత్‌ వెల్లడించారు.

సఫారీ యాత్రలకు బ్రేక్
పులుల సంతానోత్పత్తికి ఆటంకం కలగకుండా అడవిలో పర్యాటకుల సఫారీ యాత్రను సెప్టెంబరు 30వతేదీ వరకు నిలిపివేశారు. పులులు, ఇతర వన్యప్రాణుల సంతానోత్పత్తికి ఆటంకం కలగకుండా పర్యాటకుల యాత్రలను నిలిపివేశామని అటవీశాఖ అధికారులు చెప్పారు.పులుల సంరక్షణ కోసం మల్లెల తీర్థం, ఉమామహేశ్వరం, సలేశ్వరం లింగమయ్య , లొద్ది మల్లయ్య జలపాతం ప్రాంతాల సందర్శనను నిలిపి వేశారు.పులులు,ఇతర వన్యప్రాణుల పునరుత్పత్తి సమయం కావడంతో సెప్టెంబరు 31వతేదీ నుంచి అమ్రాబాద్ టైగర్ రిజర్వులో జన సంచారానికి అనుమతి రద్దు చేశారు.

జాతర నిలిపివేత
తొలి ఏకాదశి సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే లొద్ది మల్లయ్య ఆలయంలో జరిగే జాతరను నిలిపివేశారు. అటవీప్రాంతం మీదుగా ఈ జాతరకు జనం వస్తే పులుల సంతానోత్సత్తికి విఘాతం కలగవచ్చని అధికారులు ఈ చర్య తీసుకున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ చెప్పారు.అటవీ ప్రాంతాల్లో పులుల కదలికలను రికార్డు చేసేందుకు హై రిజల్యూషన్ థర్మల్ ఇన్ ఫ్రారెడ్ కెమెరాలను అమర్పారు. పులుల కదలికలను అటవీశాఖ అధికారుల సెల్ ఫోనుకు వచ్చేలా సాఫ్ట్ వేర్ ను రూపొందించారు.



 పులుల కదలికలపై పర్యవేక్షణ

అడవిలో ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ కవర్‌ కాని చోట్ల రేడియో ఫ్రీక్వెన్సీ నెట్‌వర్క్‌ నుంచి ఇంటర్నెట్‌కు దృశ్యాలు కన్వర్టయ్యే స్ట్రీమింగ్‌తో పులుల కదలికలను మానిటర్‌ చేస్తున్నారు.అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ లో అటవీశాఖ అధికారులు ఆంక్షలు విధించింది.మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు రాష్ట్ర రహదారి పొడవునా వ్యర్థాల సేకరణకు అటవీశాఖ సిబ్బందిని నియమించింది. మన్ననూర్ ప్రవేశద్వారం నుంచి దోమల పెంట అటవీ చెక్ పోస్టు వరకు ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్ వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు లేకుండా చర్యలు చేపట్టారు.

దేశంలోనే అమ్రాబాద్ రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్
అమ్రాబాద్ పులుల అభయారణ్యం దేశంలోనే రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వుగా నిలిచింది.తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల పులుల అభయారణ్యాల్లో పులుల సంఖ్య పెరిగింది. 2018వ సంవత్సరంలో ఏడు పులులున్న అమ్రాబాద్ అభయారణ్యంలో వీటి సంఖ్య 33కు పెరిగింది.పులుల వేటను నివారించడంతో పాటు వీటి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలతో పులుల సంఖ్య పెరిగింది.

పులులకు హాని తలపెట్టవద్దు
పులుల ఉనికిపై అటవీ గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు వాటికి హాని తలపెట్టవద్దని అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలను కోరామని ఆదిలాబాద్ అటవీశాఖ అధికారులు కోరారు.పులి పశువులను చంపితే వెంటనే తమ అటవీశాఖ నష్టపరిహారం అందజేస్తుందని చెప్పారు. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన పులి కాగజ్ నగర్, అసిఫాబాద్,కైరిగూడ, తిర్యాణి మండలంలో సంచరించి కవ్వాల అభయారణ్యంలో వెళ్లిందని అటవీశాఖాధికారులు చెప్పారు.

కవ్వాల అభయారణ్యంలో పెరిగిన పులుల సంచారం
మంచిర్యాల జిల్లా కాగజ్‌నగర్‌ అటవీ డివిజన్‌లో గత కొద్దిరోజులుగా పులుల సంచారం పెరిగింది. రెండు మగ, ఒక ఆడ పులి కాగజ్‌నగర్‌ నుంచి దట్టమైన అటవీ ప్రాంతమైన చెన్నూర్‌ అటవీ డివిజన్‌కు కొద్దిరోజుల క్రితం తరలి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.కొత్తపల్లి మండలం పంగిడి సోమారం అటవీ ప్రాంతంలో ఐదు ఆవులపై పులి దాడి చేసి చంపినట్లు వార్తలు వెలువడ్డాయి. పులులు అడవుల్లోని కెమెరాట్రాప్ లలో చిక్కాయి.పులుల పగ్‌మార్క్‌ల ఆధారంగా అటవీ శాఖ అధికారులు వాటి కదలికలను గుర్తించారు.

పెరిగిన పులుల సంఖ్య
తెలంగాణ రాష్ట్రంలో పులుల పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలతో వీటి సంఖ్య గణనీయంగా పెరిగింది.అమ్రాబాద్, కవ్వాల పులుల అభయారణ్యంలో 2020వ సంవత్సరంలో తెలంగాణలో కేవలం 14 పులులున్నాయని పులుల గణనలో తేలింది. 2023వ సంవత్సరం నాటికి 33 పులులకు సంఖ్య పెరిగింది.ఇందులో 26 పులులు, ఏడు పులి పిల్లలున్నాయి.32 పులులు అమ్రాబాద్ అభయారణ్యంలోనే ఉన్నాయని అటవీ శాఖ జరిపిన పులుల గణనలో వెల్లడైంది.

జూపార్కులోనూ...
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శన శాలలోనూ పులులు సంతానోత్పత్తికి తాము చర్యలు తీసుకున్నామని జూపార్కు పశుసంవర్థక విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎంఏ హకీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. జూపార్కులో ఇప్పటికే 20 పులులున్నాయని, ఈ ఏడాది ఈ మేటింగ్ సీజనులో పులుల పునరుత్పత్తికి తాము అనువైన వాతావరణం కల్పించామని హకీం వివరించారు.

కవ్వాల అభయారణ్యంలో పులుల సంచారం
కవ్వాల పులుల అభయారణ్యంలో పులుల పరిరక్షణ కోసం అటవీ గ్రామాలను తరలించారు.దీంతో కవ్వాల పరిధిలోని జన్నారం ప్రాంతంలో ఓ పులి జాడలు కనిపించాయి.మహారాష్ట్ర నుంచి పులులను కవ్వాల అభయారణ్యానికి రప్పించేందుకు అటవీశాఖ మహారాష్ట్ర అధికారులతో చర్చలు జరుపుతోంది. దీంతోపాటు కాగజ్ నగర్ కారిడార్ ను కూడా పులుల పరిరక్షణ జోన్ గా ప్రకటించాలని నిర్ణయించారు.


Tags:    

Similar News