సుప్రీం తీర్పుతో న్యాయ శాస్త్ర పట్టభద్రులకు భారీ ఊరట

న్యాయ శాస్త్రంలో పట్టభద్రులకు సుప్రీ కోర్టు తీర్పు భారీ ఊరట కలిగించింది. ఏమిటి ఆ తీర్పు, ఎందుకు వారికి ఊరట కలిగించింది? ఇంతకాలం ఎందుకు ఇలా జరిగింది?

Update: 2024-09-09 04:00 GMT

గౌరవ్‌కుమార్‌ కేసులో సుప్రీం సీజే సంచలన తీర్పు

సుప్రీం తీర్పుతో భారీగా తగ్గిన ఎన్‌రోల్‌ మెంట్‌ ఖర్చులు

నూతన ఫీజులతో నేటి నుంచి ఎన్‌రోల్‌ మెంట్‌ ప్రక్రియ ప్రారంభం

సుప్రీం కోర్టు తీర్పుతో న్యాయ విద్యార్థులకు భారీ ఊరట కలిగింది. అణగారిన వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల న్యాయ విద్యార్థులు న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించేందుకు మార్గం సుగమమైంది. కొన్ని దశాబ్దాలుగా న్యాయవాదులు అనేక మంది మౌనంగా ఈ భారీ ఖర్చులను భరించి న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించిన వారే. ఈ నేపథ్యంలో అనేక మంది ఈ వ్యవహారాన్ని ప్రశ్నిస్తూనే వస్తున్నాచివరకు 2024 జూలై 30న సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ బెంచి సంచలన తీర్పునిచ్చింది. రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లు అడ్వకేట్‌ చట్టం 1961లోని సెక్షన్‌ 24(1) (ఎఫ్‌)లో పేర్కొన్న మొత్తం, స్టాంపు డ్యూటీ మినహా ఇతరత్రా వసూలు చేయరాదని ఆదేశించింది. దీంతో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించేవారు చెల్లించాల్సిన మొత్తం భారీగా తగ్గిపోయింది.

జూలై 30 వరకు ఏపీ బార్‌ కౌన్సిల్‌ వసూలుచేసే ఫీజులు ఇలా...

సుప్రీం తీర్పు వెలువడే నాటికి ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఫీజులు భారీగా ఉండేవి. ఒక వైపు రాష్ట్రంలో ఆర్థిక భారం పేద విద్యార్థులపై పడరాదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలు తీసుకువచ్చి అమలు చేస్తుంటే, మరో వైపు న్యాయవాద వృత్తిలోకి రావాలంటే ఎన్‌రోల్‌మెంట్‌ ఫీజుల ప్రహసనంతో పేదలు జంకే పరిస్థితి వచ్చింది.

పాత ఫీజుల విధానం...

నిబంధనల పుస్తకంతో పాటు దరఖాస్తు రుసుము రూ. 500లు.

ఎన్‌రోల్‌ మెంట్‌ ఫీజు జనరల్ విద్యార్థులకు రూ. 750లు. ఎస్‌సీ, ఎస్‌టీలకు రూ. 250లు.

గజిట్‌ పబ్లికేషన్‌ ఛార్జీలు (ప్రింటింగ్‌ ఆఫ్‌ ఎన్‌రోల్‌ మెంట్‌ సర్టిఫికేట్, ఐడి కార్డు, ప్రాసెసింగ్‌ ఫీజు రూ. 5,050లు. ఎస్‌సి, ఎస్‌టీలకు రూ. 3,550

లైబ్రరీ నిధి కింద రూ. 200లు

అడ్వకేట్స్‌ సంక్షేమ నిధి (బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా 40వ నిబంధన) రూ. 3,000లు.

స్టాంపు డ్యూటీ రూ. 500లు.

పత్రాల పరిశీలన ఫీజు రూ. 2,500లు.

మొత్తంగా ప్రతి ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థి రూ. 10,500లు, ఇతర వర్గాలకు చెందిన వారు రూ. 12,500లు చెల్లించాలి. ఇది కాకుండా పదో తరగతి తరువాత చేసిన విద్యాభ్యాసం సంవత్సరాలు మినహాయింపుతో పాటు మరో 5 సంవత్సరాలు మినహాయింపు ఇస్తారు. అంటే ఒక విద్యార్థి 1980లో 10వ తరగతి పూర్తి చేశాడు అనుకుంటే.. 1982లో ఇంటర్, 1985లో డిగ్రీ పూర్తిచేశాడు. 1987లో పీజీ కూడా పూర్తయింది. తరువాత అతను మూడు సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు. ఇతను ప్రస్తుతం పాత ఫీజు ప్రకారం ఎన్‌రోల్‌ చేసుకోవాలంటే ఇంటర్‌ 2, డిగ్రీ 3, పీజీ 2, ఎల్‌ఎల్‌బీ 3, అదనంగా 5 సంవత్సరాల మినహాయింపు అంటే 1980 నుంచి15 సంవత్సరాల వరకు అదనంగా ఎటువంటి మొత్తం చెల్లించాల్సిన పనిలేదు. కానీ మిగిలిన సంవత్సరాలకు అంటే (2024 మైనస్‌ 1980 = 44 సంవత్సరాలు)లో 15 సంవత్సరాలు మినహాయిస్తే ఇంకా 29 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి ఏడాదికి అదనంగా రూ. 700లు చొప్పున బార్‌ కౌన్సిల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 29x700 = రూ. 20,300లు చెల్లించాలి. మొత్తంగా ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థికి అయితే స్టాండర్డ్‌ ఫీజు రూ. 10,500 ప్లస్‌ గ్యాప్‌ ఫీజు రూ. 20,300 = రూ. 30,800లు చెల్లించాల్సి ఉంటుంది. అదే గ్యాప్‌ సడలింపు పరిమితికి లోబడిన విద్యార్థి అయితే రూ. 10,500లు చెల్లించాలి. ఇతర వర్గాల విద్యార్థులు అయితే స్టాండర్డ్‌ ఫీజు రూ.12,500 ప్లస్‌ గ్యాప్‌ ఫీజు రూ. 20,300 = 32,800లు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రిటైర్‌మెంట్‌ అయిన ఉద్యోగులు అయితే రూ. 12,500 తోపాటు అదనంగా రూ. 15వేలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఒకనాడు చదువుకునే అవకాశం లేక నేడు రెక్కల కష్టంతో విద్యార్జన చేసినా న్యాయవాద వృత్తిలోకి వెళ్లేందుకు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే వేలకు వేలు చెల్లించాల్సి రావడంతో న్యాయ శాస్త్ర పట్ట భద్రులు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి.

గౌరవ్‌కౌర్‌ రిట్‌ పిటీషన్‌తో నూతనంగా న్యాయవాద వృత్తిలోకి వచ్చేవారికి భారీ ఊరట...

గౌరవ్‌కౌర్‌ 2023లో సుప్రీం కోర్టులో ఈ సమస్యపై రిట్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. దీనిపై 2024 జూలై 30న సుప్రీం కోర్టు వెలువరించిన సంచలన తీర్పు న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరికి ఎనలేని ఊరట కల్పించింది. దీంతో అన్ని రాష్ట్రాల బార్‌ కౌన్సిళ్లు ఆగస్టు 3నుంచి ఎన్‌రోల్‌ మెంట్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశాయి. తాజాగా ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఈనెల 9నుంచి నూతన దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. అందులో జనరల్‌ కేటగిరీ వారు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఏపీ ఫీజు రూ. 600లు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఫీజు రూ. 150లు, స్టాంపు డ్యూటీ రూ. 500లు కలిపి రూ. 1,250లు, ఎస్‌సీ, ఎస్‌టీలు అయితే బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఏపీ ఫీజు రూ.100లు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఫీజు రూ. 25లు, స్టాంపు డ్యూటీ ఫీజు రూ. 500లు కలిపి రూ. 625లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ఆల్‌ ఇండియా బార్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐబీఈ) ఫీజుపైనా చర్చ...

సాధారణంగా ఐబీపీఎస్‌ (ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) వంటి సంస్థలు, కామన్‌ ఎంట్రన్స్‌టెస్టులు నిర్వహించేవారు సైతం తమ ఫీజును రూ. 1,000లకు మించ నీయడం లేదు. కానీ ఆల్‌ ఇండియా బార్‌ ఎగ్జామినేషన్‌ పరీక్ష (ఇది పోటీ పరీక్ష కాదు కేవలం క్వాలిఫయింగ్‌ పరీక్ష) మాత్రం జనరల్‌ కేటగిరీ విద్యార్థులకు రూ. 3,560లు, ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులకు రూ. 2,560లు చొప్పున చెల్లించాలని ఆదేశించడంపై చర్చలు మొదలయ్యాయి. క్వాలిఫై అయితే ప్రాక్టీస్‌ చేసేందుకు సర్టిఫికేట్‌ మాత్రమే ఇస్తారని, ఇందుకు ఇంత పెద్ద మొత్తంలో ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారనే చర్చ న్యాయ శాస్త్ర పట్టభద్రుల్లో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఈ ఫీజు కూడా భారీగా తగ్గుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News