ఓటేద్దాం రండి: హైదరాబాదీయులకు అమరావతి పిలుపు

ఏపీలోని పల్నాడు జిల్లా పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ప్రచారం ఆదివారం హైదరాబాద్‌లో వినూత్నంగా జరిగింది. హైదరాబాద్ వాసులు ఏపీ ప్రచారరంగంలో దిగనున్నారు.

By :  Saleem SK
Update: 2024-04-28 15:18 GMT

హైదరాబాద్ నివాసముంటున్న పల్నాడు వాసులకు ఓటు ఉన్నా...లేకున్నా ఏపీ ఎన్నికల సందర్భంగా జన్మభూమికి తరలిరండి...మీ వంతు బాధ్యతగా ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయానికి తోడ్పాటు అందించి జన్మభూమి రుణాన్ని తీర్చుకోండి అని పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పిలుపునిచ్చారు.

- జగన్ పాలనలో కనీసం రాజధాని లేకుండా, ఉద్యోగాలు లేకుండా అన్నింట్లోనూ వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడేందుకు హైదరాబాద్ నివాసులు జన్మభూమికి తరలిరావాలని ఆయన కోరారు. దీంతో హైదరాబాద్ లో నివాసముంటున్న ఆంధ్రావాసుల్లో చైతన్యం వెల్లివిరిసింది. తాము సైతం ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామని ముక్తకంఠంతో ప్రకటించారు.

- కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో నివాసముంటున్న పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ వాసుల ఆత్మీయ సమావేశం హైదరాబాద్ నగరం మియాపూర్‌లోని నరేన్ గార్డెన్‌లో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి పల్నాడు జిల్లాకు చెందిన హైదరాబాద్ నివాసులు 5వేల మంది తరలివచ్చారు.

ఏపీకి కదిలి రండి...జన్మభూమి రుణం తీర్చుకోండి

‘‘మన ఊరు కోసం మన వాళ్ల కోసం మన బాధ్యతగా మన ఓటు వేద్దాం...మన పల్నాడు జిల్లాలో ఉన్న మన బంధువులతో ఓటు వేయిద్దాం...రండి కదిలిరండి... మన జన్మభూమి రుణం తీర్చుకుందాం’’ అని పలువురు నేతలు హైదరాబాద్ నగరంలో నివాసముంటున్న పల్నాడు జిల్లా వాసులను లావు రుద్రమదేవి అభ్యర్థించారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ అన్ని రంగాల్లో వెనుకబడిందని, ఏపీ అభివృద్ధితోపాటు మన రాజధాని అమరావతి అభివృద్ధి కోసం హైదరాబాద్ నివాసులు కార్యరంగంలో దిగి ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నర్సరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవదాయలు సోదరి లావు రుద్రమదేవి హైదరాబాద్ నివాసులను కోరారు.


పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి తరలివచ్చిన హైదరాబాద్ నివాసులు

ఏపీ ప్రజలు అల్లాడుతున్నారు...కనికరించండి

గలా గలా పారే కృష్ణానది తీరాన పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న, సాగునీరు, తాగునీటి కొరతతో రైతులు, ప్రజలు అల్లాడుతున్నారని, తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే తాను ఎత్తిపోతల పథకాలను నిర్మించి సాగు, తాగు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ చెప్పారు. గత అయిదేళ్లుగా ఏపీలో రోడ్లు అధ్వానంగా మారాయని, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారని, అన్ని వర్గాల ప్రజలు సమస్యల్లో ఉన్నారని ప్రవీణ్ పేర్కొన్నారు. ఏపీ ప్రజల సంక్షేమం కోసం చైతన్యవంతులైన హైదరాబాద్ నివాసులు వచ్చి సహకారం అందించాలని ప్రవీణ్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లోని ఆంధ్రా వాసుల్లో వెల్లివిరిసిన చైతన్యం

ఆదివారం జరిగిన మూడు పార్టీల కూటమి ఆత్మీయ సమావేశంతో హైదరాబాద్ లోని ఆంధ్రావాసుల్లో చైతన్యం వెల్లివిరిసింది. ఏపీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటే టీడీపీని గెలిపించేందుకు మేధావులైన హైదరాబాద్ నివాసులు కదిలిరావాలని ప్రవీణ్ కోరారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తేజస్వీని వైసీపీ సర్కారు పాలనపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. రాజధాని లేని రాష్ట్రం, ఉద్యోగాలు లేని యువత గంజాయి మత్తులో జోగేలా జగన్ చేశారని తేజస్వీని ఆరోపించారు.


భాష్యం ప్రవీణ్ ర్యాలీలో జనం

టీడీపీ తరపున ప్రచార రంగంలో దిగిన ఎన్ఆర్ఐలు

ఏపీలో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్ఆర్ఐలు ప్రచార రంగంలో దిగారు. తమకు సాఫ్ట్ వేర్, ఐటీ ఉద్యోగాలు వచ్చేందుకు చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు హైదరాబాద్ కు హైటెక్ సిటీ తీసుకువచ్చిన విజన్ తోడ్పడిందని పలువురు ఎన్ఆర్ఐలు చెప్పారు. తాము ఉద్యోగాలు చేసుకుంటూ అమెరికాలో స్థిరపడ్డామంటే అందుకు చంద్రబాబు చేసిన కృషి కారణమని ఎన్ఆర్ఐ జాస్తి శివబాలాజీ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. వి లవ్ చంద్రబాబు అంటూ పసుపు రంగు ఎన్ఆర్ఐ టీడీపీ అంటూ టీషర్టులు ధరించి ప్రచార రంగంలో దిగిన ఎన్ఆర్ఐలు టీడీపీకి ఓటేసి ఆంధ్రాను కాపాడుకుందాం అంటూ ప్రచారం సాగిస్తున్నారు. పదివేల మంది ఎన్ఆర్ఐలు టీడీపీ ప్రచార బరిలో దిగుతున్నారని టీడీపీ పెదకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

మే మొదటివారంలో ఆంధ్రాకు తరలనున్న హైదరాబాద్ నివాసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన హైదరాబాద్ నివాసులు ప్రచారంలో పాల్గొనేందుకు చలో ఆంధ్రా అంటూ ప్రత్యేక బస్సుల్లో తరలిపోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా పల్నాడు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన హైదరాబాద్ నివాసులు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నా వాటికి సెలవు పెట్టి 10 రోజుల పాటు ప్రచారానికి తరలిపోవాలని ఆదివారం నాడు జరిగిన పల్నాడు జిల్లా వాసుల సమావేశంలో నిర్ణయించారు.

Tags:    

Similar News