హైదరాబాద్‌లో నెలరోజులపాటు ఆంక్షలకు కారణం ఏమిటి?

ఈ నెల రోజులూ సభలూ సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి గుమిగూడితే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

Update: 2024-10-28 06:43 GMT

నెలరోజులపాటు హైదరాబాద్ నగరంలో ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. నవంబర్ 28 సాయంత్రం 6 గం. దాకా ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల రోజులూ సభలూ సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఐదుగురికి మించి గుమిగూడితే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. బీఎస్ఎస్ సెక్షన్ 163(పాత సీఆర్పీసీ 144 సెక్షన్) కింద ఆంక్షలు విధించినట్లు ఆదేశాల్లో తెలిపారు. నగరంలో అశాంతి సృష్టించటానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇటీవల సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ గుడిపై ఘటన తర్వాత అల్లర్లు జరగటం, గ్రూప్-1 విద్యార్థుల వరసగా ఆందోళనలు, మూసీ నిర్వాసితులు, బెటాలియన్ పోలీసులు వంటి వివిధ వర్గాలు వరసగా ఆందోళనలు జరపటం వంటి ఘటనల రీత్యా నగరంలో శాంతిభద్రతల నిర్వహణ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. దానికితోడు ఏక్ పోలీస్ విధానం అమలు, సస్పెండ్ చేసిన కానిస్టేబుళ్ళను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ బెటాలియన్ పోలీసులు చేస్తున్న ఆందోళన ఉధృతమయింది. యూనిఫామ్‌లతో వచ్చి సచివాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరికలు జారీచేశారు. ఆ కారణంతోనే ఆంక్షల నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది.

Tags:    

Similar News