అందరి ఆకలి, అవసరాలూ తీర్చే డెలివరీ బాయ్‌ల కష్టాలను ఎవరు తీరుస్తారు!

రోజు కూలీలలాగా ఈ ఉద్యోగాలన్నీ అసంఘటితరంగంలోని తాత్కాలిక కొలువులు కావటంతో వీరికి ఉద్యోగభద్రత ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, పైగా ప్రమాదావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Update: 2024-09-05 13:49 GMT

జోరున వర్షం కురుస్తుంటుంది. మీకు ఉన్నట్టుండి వేడివేడిగా మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది, లేదా చిల్లీ చికెన్ ఒక పట్టు పట్టాలనిపిస్తుంది. కాలు కదపకుండా, సోఫాలో కూర్చునే ఒక్క క్లిక్‌తో ఆర్డర్ చేసిపడేస్తారు. పదో, ఇరవయ్యో నిమిషాలలో మీరు కోరుకున్న ఆహారం మీ చేతుల్లో ఉంటుంది. అయితే దీనివెనక ఎంత కష్టం ఉందో, ఎన్ని అవాంతరాలు దాటుకుని ఆ డెలివరీ బాయ్‌లు ఆ ఆర్డర్‌ను తీసుకొచ్చారో ఎప్పుడైనా ఊహించారా?

వారు డెలివరీ బాయ్‌లు కాదు, మన ఆకలిని తీర్చే అన్నదాతలు, కోరుకున్న వస్తువులను తీసుకొచ్చే దేవతలు. భగభగ మండే ఎండలు, ఎడతెగక కురిసే వానలను కూడా లెక్క చేయకుండా, అనేక చిక్కులను, అవాంతరాలను దాటుకుని వచ్చి మనకు ఆహారాన్ని, సరుకులను, వస్తువులను అందిస్తూ ఉంటారు. డబ్బు మనదే అయినా కూడా వారు లేకపోతే ఆ ఆహారంగానీ, వస్తువులుగానీ మనదాకా చేరేవి కావుకదా.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ వస్తువుల డెలివరీ, స్విగ్గీ, జొమోటో వంటి ఫుడ్ డెలివరీ, బిగ్ బాస్కెట్, జెప్టో, బ్లింక్ఇట్ వంటి గ్రోసరీస్(వెచ్చాలు) డెలివరీ, ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి కారు, ఆటో, బైక్ క్యాబ్ డ్రైవర్‌ వంటి తాత్కాలిక ఉద్యోగులను గిగ్ వర్కర్‌లు అంటారు. రోజు కూలీలలాగా ఈ ఉద్యోగాలన్నీ అసంఘటితరంగంలోని తాత్కాలిక కొలువులు కావటంతో వీరికి ఉద్యోగభద్రత ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, పైగా ప్రమాదావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గిగ్ వర్కర్‌ల పుణ్యమా అని ఇటు వీరు పనిచేసే కంపెనీల యాజమాన్యాలు, అటు ఆ యాజమాన్యాలతో ఒప్పందాలు కుదుర్చుకున్న హోటల్, రెస్టారెంట్, వివిధ వ్యాపార సంస్థల యాజమాన్యాలు రెండూ ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెందుతున్నాయిగానీ, ఈ గిగ్ వర్కర్‌ల బతుకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నవిధంగా ఉంటున్నాయి.



మరోవైపు వీరికి వృత్తిపరమైన రిస్క్‌లు ఎక్కువగా ఉంటాయి. ఏ కారణంగానైనా ఫుడ్ డెలివరీ ఆలస్యమయితే ఒక్కొక్కచోట వినియోగదారులు తమపై భౌతిక దాడులు కూడా చేస్తుంటారు. ఈ మధ్య హైదరాబాద్ యూసఫ్ గూడాలో రిజ్వాన్ అనే ఒక డెలివరీ బాయ్ ఫుడ్ ఇవ్వటానికి వెళ్ళినచోట కుక్క వెంటబడటంతో అతను దానిని తప్పించుకునే ప్రయత్నంలో మూడో అంతస్తునుంచి జారిపడి చనిపోయాడు. ఆల్వాల్‌లో స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న ఒక యువకుడు ఫుడ్ డెలివరీకి వెళుతూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇలా చనిపోయినవారి కుటుంబాలకు అటు ఆ డెలివరీ కంపెనీల నుంచిగానీ, ప్రభుత్వంనుంచిగానీ ఎలాంటి సాయమూ అందలేదు.

ఈ గిగ్ వర్కర్‌లపై తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుందనేదానిపై తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, హీట్ వాచ్ అనే సంస్థ కలిసి సంయుక్తంగా ఈ ఏడాది జూన్‌లో ఒక సర్వే నిర్వహించాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితులబారిన పడుతున్న వారిలో అత్యధికంగా ఉన్నది గిగ్ వర్కర్‌లేనని సర్వే నిర్వాహకులు చెబుతున్నారు. వీరికి వైద్య సంరక్షణ అందని ద్రాక్షేనని, వారు పని చేసే కంపెనీల యాజమాన్యాలు వీరికి కనీస సౌకర్యాలు కూడా అందించటంలేదని పేర్కొన్నారు. డెలివరి బాయ్స్‌ సహాయంతో రూ.కోట్లలో లాభాలు గడిస్తున్న కంపెనీలు.. వారి భద్రతను పూర్తిగా గాలికి వదిలేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. నిర్ణీత సమయంలో డెలివరీ అందించాలన్న తాపత్రయంలో గిగ్‌ వర్కర్లు ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.

వర్షాకాలంలో డెలివరీ బాయ్‌ల అగచాట్లు

వర్షాకాలంలో ఆహారం సరఫరా చేసే డెలివరీ బాయ్‌ల కష్టాలు మామూలుగా ఉండవు. భారీ వర్షం కురవటంవలనో, వానల్లో నీళ్ళు చేరి బైక్ చెడిపోవటంవలనో డెలివరీ ఆలస్యం అయితే కొందరు వినియోగదారులు తమను దుర్భాషలాడతారని, లేదంటే కంపెనీకి తమపై ఫిర్యాదు చేస్తారని సుభాష్ అనే ఒక డెలివరీ బాయ్ చెప్పాడు. ఫిర్యాదుల వలన తమ రేటింగులు దెబ్బతింటాయని తెలిపాడు. వర్షాల వలన వాహనాలు రిపేర్‌కు రావటం ఎక్కువగా జరుగుతుంటుందని చెప్పాడు.

మరోవైపు క్యాబ్ డ్రైవర్‌ల కష్టాలు భిన్నంగా ఉంటాయి. వర్షాలలో డ్రైవింగ్ చాలా దుర్లభంగా ఉంటుందని, ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయో, ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియదని ఇర్ఫాన్ అనే ఒక క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. వర్షాలు కురుస్తున్నాయని ట్రిప్ క్యాన్సిల్ చేస్తే కస్టమర్ కంపెనీకి ఫిర్యాదు చేస్తాడని తెలిపాడు. ఫిర్యాదు నమోదయితే తన డ్రైవర్ ఐడీని కంపెనీ తాత్కాలింగా సస్పెండ్ చేస్తుందని వాపోయాడు. మరోవైపు వర్షాల కారణంగా తమ వాహనానికి రిపేర్లు వస్తుంటాయని, ఇప్పుడు వచ్చే అధునాతన వాహనాలలో చిన్న చిన్న సెన్సర్‌ల వంటి పార్టులు చెడిపోయినా, కొత్తవి కొనాలంటే అత్యంత ఖరీదుగా ఉంటాయని చెప్పాడు.

ఎండాకాలంలో వేరే రకం కష్టాలు

ఈ ఏడు దేశవ్యాప్తంగా ఎండలు అదరగొట్టిన సంగతి తెలిసిందే. తీవ్రమైన ఉష్ణోగ్రతలలో వీధులలో తిరగటంతో తాత్కాలిక ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. తీవ్రమైన అలసట, డీహైడ్రేషన్, కళ్ళు తిరగటం, వాంతులు అవుతున్న భావన వంటి లక్షణాలను ఎదుర్కొన్నారు. అయితే ఇలాంటి లక్షణాలను అనుభవించినా కూడా తాము సెలవు తీసుకునే పరిస్థితి లేదని వాపోయారు. సాధారణ ఉద్యోగికి ఉన్నట్లు సెలవు దినాలు, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తదితర సౌకర్యాలు లేకుండానే తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ తాత్కాలిక ఉద్యోగులు పని చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఈ తాత్కాలిక ఉద్యోగాలలో పని చేస్తున్నవారి సంఖ్య 77 లక్షలుగా ఉంది. ఇన్ని లక్షలమంది ఉన్నాకూడా వీరి ఆరోగ్యం, భద్రతకు సంబంధించి బలమైన చట్టాలు, విధివిధానాలు, మార్గదర్శకాలు లేవు. దీనిపై తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, జాతీయ మానవహక్కుల సంఘానికి ఒక వినతిపత్రం సమర్పించింది. తాగునీరు, వేసవిలో ఓరల్ రీహైడ్రేషన్ పానీయాలు, వర్షాకాలంలో రెయిన్ కోట్‌లు, పరిశుభ్రమైన టాయిలెట్‌లు, నగరవ్యాప్తంగా 4 కి.మీ. కు ఒకచోట కల్పించాలని, ఈ పరిశ్రమకు సంబంధించిన కార్పొరేట్ సంస్థలు కూడా ఈ సౌకర్యాలన్నింటినీ అందించాలని ఆ వినతిపత్రంలో డిమాండ్ చేశారు. తమకు రెగ్యులర్‌గా వైద్య సౌకర్యాలు అందించాలని, ప్రథమ చికిత్స కిట్‌లు అందుబాటులో ఉండేటట్లు చూడాలని కోరారు. వాతావరణ పరిస్థితులపై రెగ్యులర్‌గా అప్‌డేట్‌లు ఇస్తుండాలని కూడా డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఈ విషయంపై స్విగ్గీ, జొమోటో సంస్థలకు ఒక విజ్ఞప్తి చేశారు. డెలివరీ బాయ్‌లకు హెల్త్ బెనిఫిట్స్‌తో పాటు, ఇన్సూరెన్స్, సోషల్ సెక్యూరిటీ వంటివి కల్పించాలని కోరారు. గిగ్ వర్కర్స్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని గుర్తు చేశారు. ఇక్కడ ప్రతి నెలా 45 శాతం వ్యాపారం పెరుగుతోందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే గిగ్ వర్కర్‌లకు జాబ్ సెక్యూరిటీ, హెల్త్ ఇన్సూరెన్స్, ఫిక్సెడ్ శాలరీ వంటివి కల్పించటానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా వీరికి హెల్త్ ఇన్సూరెన్స్ హామీలు ఇచ్చింది.

నరేంద్ర మోది ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక శాఖ ఈ ఏడాది మొదట్లో ఈ గిగ్ వర్కర్‌లకోసం ఒక ముసాయిదాను రూపొందించి ఆమోదంకోసం ఆర్థికశాఖకు పంపింది. ఈ చట్టం పార్లమెంటులో ఆమోద ముద్ర పొందితే ఈ కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, కనీస వేతనాలు, పనిగంటలు, సెలవులు వంటి అనేక సౌకర్యాలు పొందగలుగుతారు. ఇప్పటికే గిగ్ వర్కర్‌ల భద్రతకు, సంక్షేమానికి చర్యలు తీసుకోవాలంటూ వారికోసం ఒక సోషల్ సెక్యూరిటీ కోడ్‌ను సిద్ధం చేసింది. దానిని అమలు చేయాలంటూ అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కోడ్ ప్రకారం ప్రతి ఫుడ్ డెలివరీకి 2% లెవీని వసూలు చేయాలి, ఆ నిధులను ఫుడ్ డెలివరీ బాయ్స్ సంక్షేమానికి వెచ్చించాలి.

ఈ వర్కర్‌లకోసం అనేక రాష్ట్రాలలో ప్రత్యేక చట్టాలు ఏర్పడ్డాయి. రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సోషల్ సెక్యూరిటీ కోడ్‌ను అమలు చేస్తోంది. వీరి సంక్షేమనిధికోసం రు.200 కోట్ల నిధులను కేటాయించింది. మహారాష్ట్రలో కూడా ఈ చట్టంపై చర్చ జరుగుతోంది. ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్‌లు ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News