మరో ఎన్నికల సైరన్ మోగింది! మహరాష్ట్ర, జార్ఖండ్‌ పోల్ షెడ్యూల్ విడుదల

మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది, జార్ఖండ్‌లో రెండు దశలలో నవంబర్ 13, 20 తేదీలలో పోలింగ్ జరుగుతుంది, రెండు చోట్లా ఫలితాలు 23నే ప్రకటిస్తారు.

Update: 2024-10-15 10:54 GMT

హర్యానా, కశ్మీర్ ఎన్నిల హడావుడి ముగిసి వారం కూడా గడవకముందే మరో ఎన్నికల యుద్ధానికి శంఖారావం మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఈ రెండు రాష్ట్రాలలో వచ్చే నెలలో జరగబోయే పోలింగ్ వివరాలను ప్రకటించారు. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది, 23న ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు జార్ఖండ్‌లో పోలింగ్ రెండు దశలలో జరుగుతుంది. నవంబర్ 13, 20 తేదీలలో అక్కడ పోలింగ్ జరుగుతుంది, అక్కడకూడా ఫలితాలు 23నే ప్రకటిస్తారు.

ఉపఎన్నికలు

మరోవైపు, దేశవ్యాప్తంగా 47 అసెంబ్లీ నియోజకవర్గాలకు, కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి కూడా నవంబర్ 13న ఉపఎన్నికలు జరుగుతాయి. వయనాడ్‌లో రాహుల్ గాంధి రాజీనామా చేయటంతో ఉపఎన్నిక జరుగుతోంది. గత పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ వయనాడ్‌తో పాటు, యూపీలోని రాయ్ బరేలీ నియోజకవర్గంలో కూడా పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు. ఫలితాల విడుదల తర్వాత రాయ్ బరేలీని ఎంచుకుని, వయనాడ్‌ను వదిలేశారు. వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంక గాంధి నిలబడుతుందని అప్పట్లో చెప్పారు.

మహారాష్ట్ర

మహారాష్ట్రలో ప్రస్తుతం మహాయుతి అనే కూటమి ప్రభుత్వం నడుస్తోంది. శివసేన చీలికవర్గానికి నాయకుడైన ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ కూటమిలో శివసేన చీలికవర్గం, బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ భాగస్వాములుగా ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్లు, బీజేపీ 105 సీట్లు, శివసేన 56 సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) 54 సీట్లు గెలుచుకున్నాయి. ఏ పార్టీకి మెజారిటీ రాకపోవటంతో కొంతకాలం రాష్ట్రపతి పాలన విధించారు. ఎన్‌సీపీ బీజేపీకి మద్దతు ఇస్తానని ప్రకటించటంతో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ 2019 నవంబర్ 23న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ఎన్‌సీపీ మనసు మార్చుకోవటంతో 2019 నవంబర్ 26న ఫడ్నవీస్ రాజీనామా చేశారు. అప్పుడు మహా వికాస్ ఆఘాడి అనే కూటమి ఏర్పడింది. దీనిలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్నాయి. ఉద్ధవ్ థాకరే నవంబర్ 28న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

2022 జూన్‌లో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం చోటుచేసుకుంది. బీజేపీ రాజకీయ మంత్రాంగంతో శివసేన చీలిపోయింది. మహాయుతి అనే కొత్త కూటమి అధికారంలోకి వచ్చింది. ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు, కొనసాగుతున్నారు. అయితే ఈ ఏడాది మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని అధికార కూటమికి కేవలం 17 సీట్లు రాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 30 సీట్లు రావటం గమనార్హం.

జార్ఖండ్

జార్ఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎమ్ఎమ్)-కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో 81 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ బీజేపీ, జనతాదళ్ యునైటెడ్, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ భాగస్వాములుగా ఉన్న ఎన్‌డీఏ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎమ్ఎమ్ 30 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి, హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రి అయ్యారు.

Tags:    

Similar News