పవన్ కట్టర్ హిందూత్వవాదిలా మారుతున్నారా!

మొదట్లో పవన్ కళ్యాణ్ వామపక్ష సానుభూతిపరుడిలాగా మాట్లాడారు. ఎర్నెస్టో చే గువేరా అంటే తనకెంతో ఇష్టమని, ఆయన తనలో పోరాట స్ఫూర్తిని నింపారని అనేకసార్లు చెప్పారు.

Update: 2024-09-24 16:25 GMT

చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ చెప్పే పాపులర్ డైలాగ్ ఒకటి ఉంది… “అదిగో, చంద్రముఖిలాగా మారుతున్న గంగను చూడు” అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను చూసి చాలామంది ఇదే డైలాగ్ చెబుతున్నారు. “కట్టర్ హిందూత్వవాదిలాగా మారుతున్న పవన్ కళ్యాణ్‌ను చూడండి” అని. ఈ వాదనలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో ఒకసారి చూద్దాం.

మొదట్లో పవన్ కళ్యాణ్ వామపక్ష సానుభూతిపరుడిలాగా మాట్లాడారు. క్యూబా విప్లవ యోధుడు ఎర్నెస్టో చే గువేరా అంటే తనకెంతో ఇష్టమని, ఆయన తనలో పోరాట స్ఫూర్తిని నింపారని అనేకసార్లు చెప్పారు. చే బొమ్మను తన సినిమాలలో కూడా పెట్టుకునేవారు. ఒకసారేమో, చిన్నతనంలో జనాల కష్టాలు చూడలేక నక్సలైట్లలో చేరాలని అనుకున్నానని చెప్పారు. మాజీ వామపక్ష తీవ్రవాది గద్దర్‌కు అభిమానినని అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ దిగ్గజం తరిమెల నాగిరెడ్డి పేరును తరచూ ప్రస్తావించేవారు. నాగిరెడ్డి రాసిన ‘తాకట్టులో భారతదేశం’ పుస్తకం చదివి మూడురోజులు భోజనం చేయలేకపోయానని చెప్పారు. ఒక సందర్భంలో ఆయన పేరును తన సభాస్థలికి పేరు పెట్టుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, 2014 అసెంబ్లీ ఎన్నికలలో నేరుగా వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు.

కట్ చేస్తే - ఇటీవల పవన్ చర్యలు కట్టర్ హిందూత్వవాదిలాగా అనిపిస్తున్నాయి. సనాతనధర్మ పరిరక్షకుడిలాగా మాట్లాడుతున్నారు. తిరుమల లడ్డు వివాదంపై మొదటి రెండు మూడు రోజులు మౌనంగా ఉన్న పవన్ ఒక్కసారిగా రెచ్చిపోయారు. తన బహిరంగ సభలలో ఉన్నట్టుండి పూనకం వచ్చినట్లు మాట్లాడినట్లుగానే, లడ్డు వివాదంపై ఒక్కసారిగా దూకుడు పెంచారు. ప్రాయశ్చిత్త దీక్ష అంటూ మొదలుపెట్టారు. కనకదుర్గమ్మ గుడిలో శుద్ధి కార్యక్రం చేశారు. దీనిపై భిన్న వాదనలు వినబడుతున్నాయి. పవన్ పూర్తి హిందూత్వవాదిలాగా, మత ఛాందసవాదిలాగా మారిపోయారని కొందరు విమర్శిస్తుండగా, బుడమేరు వరదలలో బాధితులను పరామర్శించటానికి జనం గుమిగూడతారని సాకు చెప్పిన పవన్, ఇప్పుడు గుడులచుట్టూ ఎలా తిరుగుతున్నారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, పవన్ వైఖరిని కొందరు సమర్థిస్తున్నారు కూడా.

పవన్ కట్టర్ హిందూత్వవాదిలా మారుతున్నారా అని రాజకీయ పరిశీలకులు రంగావజ్ఝల భరద్వాజను ‘ఫెడరల్ తెలంగాణ’ అడిగినప్పుడు, దీనిలో సందేహమేముంది, అతను పూర్తి హిందూత్వవాదిగా మారిపోయాడుకదా అని ఆయన అన్నారు. ముస్లిమ్, క్రైస్తవ మతస్థులకు ఏదైనా ఇబ్బంది వస్తే ప్రపంచమంతా నాశనమైనట్లు ఏడుస్తారు, ఇప్పుడు హిందూ మతం ప్రమాదంలో ఉంటే ఒక్కడు మాట్లాడటంలేదని పవన్ మాట్లాడటం దేనికి సంకేతం అని భరద్వాజ అడిగారు. హిందువుల తరపున తాను మాట్లాడతాను, హిందువులను ఎవరైనా ఏమైనా అంటే వారి అంతు చూస్తానన్నట్లుగా పవన్ మాట్లాడుతున్నాడని చెప్పారు. ఇది ప్రమాదకరమైన జబ్బు అని, పవన్‌కు ఈ జబ్బు బాగా ముదిరిందని అన్నారు. అయితే ఇది చంద్రబాబుకు ముప్పుగా మారిందని, ఆయన ఈ వివాదాన్ని ఒకందుకు మొదలుపెడితే, అది పవన్‌కు అనుకూలంగా మారిందని భరద్వాజ చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వ ప్రమాణస్వీకార కార్యక్రమం ముగింపులో నరేంద్ర మోది పవన్‌ను, చిరంజీవిని పక్కపక్కన పెట్టుకుని చేతులు పైకెత్తటం వెనక ఉద్దేశ్యం… మీకు ప్రత్యామ్నాయంగా ఒక శక్తి ఉంది అని చంద్రబాబుకు చెప్పటమేనని భరద్వాజ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’తో మాట్లాడుతూ, ప్రాయశ్చిత్త దీక్ష, శుద్ధి వంటి కార్యక్రమాలకంటే ముఖ్యమైన, గంభీరమైన సమస్యలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయని, పంచాయతీరాజ్, అడవులు, పర్యావరణం వంటి అనేక శాఖలు నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి ఆ శాఖలలో పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించటంపై దృష్టిపెట్టాలని అన్నారు. పైగా ఇలా హిందూత్వవాదం, సనాతన ధర్మాల పరిరక్షకుడి అవతారం ఎత్తటంవలన అతను అందరివాడు కాలేడని, కొందరివాడే అవుతాడని చెప్పారు.

సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఈ వెంకటేశం మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించారు. అతను కేవలం ఆ రోజు ఆక్షణాన ఫోకస్‌లో ఉన్న అంశంపై ఆవేశంగా మాట్లాడటం తప్పితే, తర్వాత కార్యాచరణ ఏమీ ఉండదని అన్నారు. ఆగస్ట్ 15నాడు గ్రామసభలపై ఒకరోజు హడావుడి చేసి రికార్డ్ సృష్టించినట్లు సర్టిఫికెట్ తీసుకోవటం తప్ప తర్వాత ఏమైనా చేశారా అని అడిగారు. నిజంగా ఆ గ్రామసభలను గ్రామస్తులు పెట్టారా, ఆ సభలలో నిజానికి ఎంతమంది గ్రామస్తులు ఉన్నారని ప్రశ్నించారు. ఒక పనిని చేపడితే దానిని లాజికల్ కంక్లూజన్‌కు తీసుకురావటం పవన్‌లో లేదని చెప్పారు.

సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడు ఈ విషయంపై స్పందిస్తూ, పవన్ కళ్యాణ్‌పై సినిమారంగ ప్రభావం బాగా ఉంటుందని, సినిమాలలో హీరో తక్షణం సమస్యలను పరిష్కరించినట్లు చేయాలని పవన్ చూస్తారని, తర్వాత మర్చిపోతారని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ కూడా అలాగే ఉండేవారని చెప్పారు. వీరి వ్యవహారశైలి ఆచరణాత్మకంగా, ప్రాగ్మాటిక్‌గా ఉండదని, సహాయకులు ఇచ్చే సమాచారం ఆధారంగా ఒక కంక్లూజన్‌కు వచ్చేస్తారని, క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు.

ఈ వివాదంపై మాట్లాడుతున్నాడు కాబట్టి హిందూ ఛాందసవాది ముద్ర వేయాలనుకోవటం కరెక్ట్ కాదని సీనియర్ జర్నలిస్ట్ చలసాని నరేంద్ర వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వివాదం నడుస్తోంది కాబట్టి అతను ఆ విషయంపై మాట్లాడటంలో తప్పు లేదని అన్నారు. ఇతర మతాలను దూషిస్తే మత ఛాందసవాదిగా పిలవవచ్చని, ఇతను ఇతర మతాలను ఎక్కడా దూషించలేదని చెప్పారు. ముస్లిమ్‌లకు అన్ని ప్రభుత్వాలూ రకరకాల తాయిలాలు ప్రకటిస్తుంటాయని, దానిని బట్టి ఆ ప్రభుత్వాధినేతలను ఛాందసవాదులు అని అనలేమని నరేంద్ర అన్నారు. ఒక హిందువుగా అతను ఆ కార్యక్రమాలు చేయవచ్చుగానీ, బుడమేరు వరదబాధితలను పరామర్శించటం విషయంలో ఈ ఉత్సాహం ఏమయిందని ప్రశ్నించారు. తెలుగుదేశంతో జనసేనకు ప్రస్తుతం ఉన్న సత్సంబంధాలు కొనసాగుతాయా అన్న ప్రశ్నకు బదులిస్తూ, కూటమినుంచి జనసేన బయటకు వెళ్ళినా తెలుగుదేశానికి పోయేదేమీ లేదని, వారికి సొంతంగానే మెజారిటీ ఉందని చెప్పారు. ఏవైనా అంశాలపై పవన్ ముఖ్యమంత్రిని నిలదీస్తే సమస్య వస్తుందేమోగానీ, ప్రస్తుతానికి అలాంటి పరిస్థితులు లేవని అన్నారు.

మరో సీనియర్ జర్నలిస్ట్ సుబ్రమణ్యం మాట్లాడుతూ, పవన్ ఒక సగటు హిందువుగా మాట్లాడాడని, దానికి మతోన్మాదిగా ముద్రవేయటం సమంజసం కాదని చెప్పారు. ఒకవేళ ముస్లిమ్‌ల మనోభావాలు నొచ్చుకునే ఏదైనా ఘటన జరిగినప్పుడు, దానిపై ముస్లిమ్‌ రాజకీయనేతలు స్పందిస్తే, వారిని మతోన్మాదులని పిలుస్తామా అన్నారు.

Tags:    

Similar News