స్టాలిన్ బీహార్ పర్యటనపై కాషాయ పార్టీ నేతల చిందులు..
S.I.Rకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ బీహార్‌లో చేపట్టిన ‘‘ఓట్ అధికార్ యాత్ర’’లో పాల్గొనేందుకు వెళ్తున్న తమిళనాడు సీఎం..;
తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) బీహార్(Bihar) పర్యటనపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్ర విమర్శలు చేసింది. పార్టీ అధినేతను లక్ష్యంగా చేసుకుని బిహారీల పట్ల చేసిన గతంలో డీఎంకే(DMK) నాయకులు చేసిన వ్యాఖ్యలను బయటపెట్టింది. I.N.D.I.A కూటమికి మద్దతుగా కాంగ్రెస్(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బీహార్‌లో చేపట్టిన ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’లో పాల్గొనేందుకు స్టాలిన్ వెళ్తున్నారు.
తన పార్టీ నాయకుడు దయానిధి మారన్, తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై అన్న మాటలను మళ్లీ అనగలరా? అన్ని బీజేపీ నాయకులు స్టాలిన్‌ను ప్రశ్నించారు.
‘ఇది నా సవాల్..’
"బీహార్‌లో పర్యటించనున్న తమిళనాడు ముఖ్యమంత్రికి నేను సవాల్ విసురుతున్నా.. మీకు ధైర్యం ఉంటే.. మీ కుమారుడు ఉదయనిధి 'సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి' అని గతంలో అన్న మాటలను, మీ బంధువు, డీఎంకే ఎంపీ దయానిధి మారన్ 'తమిళనాడులో బీహారీలు టాయిలెట్లను శుభ్రం చేస్తారు' అన్న మాటలను మళ్లీ అనగలరా?" అని స్టాలిన్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి.
‘‘బీహార్‌వాసులను అవమానించిన తర్వాత తిరిగి ఓట్లు ఎలా అడుగుతారు. స్టాలిన్ బీహార్ పర్యటన నవ్వు తెప్పిస్తోంది. ముందుగా వారికి ఆయన క్షమాపణ చెప్పాలి’’ అని నారాయణన్ డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీజేపీ తమిళనాడు మాజీ చీఫ్ కె అన్నామలై కూడా గతంలో బిహారీలకు వ్యతిరేకంగా డీఎంకే నాయకుల వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
స్టాలిన్‌పై జేడీ(యూ) విమర్శలు..
జనతాదళ్ (యునైటెడ్) కూడా స్టాలిన్ బీహార్ పర్యటనను తప్పుబట్టింది. "హిందూ పురాణాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన స్టాలిన్‌ను రాహుల్ జీ బీహార్‌కు ఆహ్వానించారు. బిహరీల DNAపై ప్రశ్నలు లేవనెత్తిన రేవంత్ రెడ్డిని కూడా పిలిచారు. ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు బీహార్‌లో ప్రచారం చేస్తే ప్రజలు మద్దతు ఇస్తారని తేజస్వి యాదవ్ ఎలా అనుకుంటున్నారు?" అని జేడీ(యూ) నాయకుడు అభిషేక్ ఝా ప్రశ్నించారు.
డీఎంకే నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలేంటి?
చెన్నై సెంట్రల్ నియోజకవర్గ నుంచి గెలిచిన డీఎంకే ఎంపీ మారన్ పాత వీడియోపై వివాదం చెలరేగింది. అందులో హిందీ మాట్లాడే బిహారీలు తమిళనాడులో "ఇళ్ళు నిర్మిస్తారు", "మరుగుదొడ్లు శుభ్రం చేస్తారు" అని అన్నట్లు కనిపించింది.
అదే సంవత్సరం ఉదయనిధి "సనాత ధర్మాన్ని నిర్మూలించండి" అనడంతో మరో వివాదం రాజుకుంది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, క్రీడా శాఖ మంత్రి అయిన ఉదయనిధి ..సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు.