వివాహ బంధాలలో కొత్త ట్రెండ్: గ్రే డివోర్స్!
సుదీర్ఘకాలం వివాహబంధంలో ఉన్న తర్వాత, దంపతులు విడిపోతే దానిని గ్రే డివోర్స్ అంటారు. జుట్టు తెల్లబడిన తర్వాత తీసుకునే విడాకులు కాబట్టి గ్రే డివోర్స్ అంటున్నారు.
ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు ఇటీవల తరచూ మీడియాలో వస్తున్న సంగతి తెలిసిందే. అంబానీల ఇంట వివాహానికి వారు ఇద్దరూ విడివిడిగా హాజరవటం, మరోవైపు నిమ్రత్ కౌర్ అనే నటిని పెళ్ళి చేసుకోబోతున్నాడనే పుకార్లు రావటంతో కూడా ఐశ్వర్య విడాకుల వార్తకు బలం చేకూరింది. దానికితోడు, విడాకుల తర్వాత ఎదురయ్యే సవాళ్ళపై చర్చిస్తున్న ఒక సోషల్ మీడియా పోస్టుకు అభిషేక్ బచ్చన్ లైక్ కొట్టటంతో అతని విడాకులు ఖాయమని అనుకుంటున్నారు. ఇదే సమయంలో, ఐశ్వర్య, అభిషేక్‌ల విడాకుల వార్తల నేపథ్యంలో ‘గ్రే డివోర్స్’ అనేమాట ట్రెండ్ అవుతోంది. అసలు ఈ గ్రే డివోర్స్ అంటే ఏమిటో పరిశీలిద్దాం.
సుదీర్ఘకాలం వివాహబంధంలో ఉన్న తర్వాత, దంపతులు విడిపోతే దానిని గ్రే డివోర్స్ అంటారు. దీనికి గ్రే డివోర్స్ అని పేరు ఎందుకు వచ్చిందంటే, జుట్టు తెల్లబడిన తర్వాత తీసుకునే విడాకులు కాబట్టి…. అంతే. పాశ్చాత్య దేశాలలో తెల్ల జుట్టును గ్రే అంటారు కాబట్టి గ్రే డివోర్స్ అని పేరు వచ్చింది. మనం ‘వైట్ డివోర్స్’ లేదా తెల్ల విడాకులు అని పిలుచుకోవచ్చు.
మనదేశంలో ఇప్పటికే గ్రే డివోర్స్ తీసుకున్న జంటలు సినీ పరిశ్రమలో ఎక్కువగా కనబడుతున్నాయి. ఆమిర్ ఖాన్-కిరణ్ రావు, హృతిక్ రోషన్-సుశాన్, సైఫ్ అలీఖాన్-అమృతా సింగ్, కమల్ హాసన్-సారిక, మలైకా అరోరా-అర్బాజ్ ఖాన్, సొహైల్ ఖాన్-సీమ, సానియా మిర్జా-షోయబ్ మాలిక్ మొదలైనవారు ఈ గ్రే డివోర్స్ తీసుకున్నవారిలో ఉన్నారు. హాలీవుడ్‌లో వీరి సంఖ్య అధికం. మెరిల్ స్ట్రీప్-డాన్ గమ్మర్ జంట 45 సం.లు కలిసి కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకున్నారు. హ్యూ జాక్‌మన్-డెబోరా జంట 28 సం.ల తర్వాత గ్రే డివోర్స్‌కు వెళ్ళారు. ఇక ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్, ఆయన భార్య మిలిండా గేట్స్ 27 ఏళ్ళు కలిసి కాపురం చేసిన తర్వాత 2021లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
పాశ్చాత్యదేశాలలో ఈ గ్రే డివోర్స్ ట్రెండ్ ఎక్కువగా ఉంది. అమెరికాలో 100 జంటలు విడాకులు తీసుకుంటే, 40 విడాకులు గ్రే డివోర్స్ అవుతున్నాయి. ఈ పోకడ ఇప్పుడు మనదేశంలోకి కూడా ప్రవేశించింది. ఇక్కడ సెలబ్రిటీలు, హై ప్రొఫైల్ కుటుంబాలలోనే ఇవి ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
గతంలో ఒక పురుషుడికి, స్త్రీకి మధ్య వివాహం జరిగితే అది జీవితకాలం కొనసాగేది. ఇప్పుడు వివాహితులు కొత్తగా పుట్టుకొచ్చిన అవసరాలను తీర్చుకోవటానికి వెనకాడటంలేదని మానసిక నిపుణులు అంటున్నారు. ఆర్థిక స్వేచ్ఛ పెరగటం, పిల్లలు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కొత్త కోరికలను తీర్చుకోవాలని అనుకోవటం వంటి కారణాల రీత్యా సమాజం ఏమనుకుంటుంది అనేదానికి భయపడకుండా విడాకులకు వెళుతున్నారు. పొంతన లేని వివాహబంధాలలో కొనసాగటం అనవసరమని వయోజనులు భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రధాన కారణాలను పరిశీలిద్దాం.
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్: ఇది మొదటి, ప్రధానమైన కారణం. ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అంటే గూడు ఖాళీ అయిపోవటం. రెక్కలు రాగానే పిల్లలు బయటకు వెళ్ళిపోతారు. ఇంట్లో పిల్లలు లేనప్పుడు దంపతులకు ఇద్దరికీ ఉమ్మడి ఆసక్తులు, ఉమ్మడి లక్ష్యాలు లేనప్పుడు వారి మధ్య అంతరం పెరుగుతుంది.
రిటైర్‌మెంట్: పదవీ విరమణ తర్వాత ఇద్దరూ కలిసి గడిపే కాలం పెరుగుతుంది. పదవీ విరమణ అనంతర జీవితం గడపటంపై ఇద్దరి మధ్య విభేదాలకు, గొడవలకు అవకాశం ఎక్కువ ఉంటుంది.
సగటు జీవితకాలం పెరగటం: పెరిగిన వైద్య సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆరోగ్యంపై అవగాహనల కారణంగా సగటు జీవితకాలం గతంలోకంటే బాగా పెరిగింది. అందుచేత జనం తమకు నచ్చినట్లు మిగిలిన జీవితాన్నయినా గడపాలని కోరుకుంటున్నారు.
ఆర్థిక స్వేచ్ఛ: ఆడవారికి ఇప్పుడు ఉద్యోగ, వ్యాపార అవకాశాలు బాగా పెరిగాయి. గతంలో కంటే బాగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నారు, ఆర్థిక వనరులను సమకూర్చుకుంటున్నారు. దీనితో వారు తమకు ఇష్టంలేని వివాహబంధంలో కొనసాగాలని అనుకోవటంలేదు.
విడాకులపట్ల సమాజంలో మారుతున్న వైఖరి: విడాకులపట్ల సమాజం వైఖరి గతంలో పోలిస్తే చాలా మారుతోంది. విడాకులు తీసుకున్నవారిని చులకనగా చూడటంలేదు. దీనితో విడాకులు తీసుకోవాలనుకునేవారికి బెరుకు కలగటంలేదు.
ఈ గ్రే డివోర్స్‌కు మరో కారణాన్ని కూడా సైకాలజిస్టులు ఉటంకిస్తున్నారు. 1970 ప్రాంతాలలో పెళ్ళిళ్ళు మగవారికి 23-25 మధ్య జరిగేవి. అందుకే అప్పట్లో విడాకులు కనుక సంభవిస్తే 38-40 మధ్య ఉండేవి. ఇప్పుడు 2024లో మగవారికి పెళ్ళిళ్ళు 30-34 మధ్య జరుగుతున్నాయి. అందుకే విడాకులు కూడా 45-50 మధ్య జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.