జుబీన్ గార్గ్ అంతిమయాత్ర..లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి
మైఖేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్, క్వీన్ ఎలిజబెత్ II తర్వాత అంతటి స్థాయిలో అంతిమయాత్రకు తరలివచ్చిన "కింగ్ ఆఫ్ హమ్మింగ్" అభిమానులు..
అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) (52) శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ కోసం సింగపూర్(Singapore)కు వెళ్లిన జుబీన్ విహారనౌకలో సముద్రయానానికి వెళ్లారు. లైఫ్ జాకెట్ ధరించకుండా ఈతకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. వెంటనే ఆయనను సింగపూర్ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు. ఆయన భౌతికకాయం శనివారం ఢిల్లీ నుంచి గౌహతి(Guwahati)కి చేరుకుంది. భౌతికకాయాన్ని విమానాశ్రయం నుంచి కహిలిపారాలోని ఆయన నివాసానికి అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా జుబీన్ అభిమానులు లక్షలాదిగా రోడ్లమీదకు భారీగా తరలివచ్చారు. దీంతో జుబీన్ అంతిమయాత్ర లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు్ల్లోకి ఎక్కింది. ఇంతటి జనసందోహం మైఖేల్ జాక్సన్, పోప్ ఫ్రాన్సిస్ క్వీన్ ఎలిజబెత్ II తర్వాత జుబీన్‌కు రావడం విశేషం.
40 భాషల్లో 38వేల పాటలు..
అస్సామీలు "కింగ్ ఆఫ్ హమ్మింగ్"(King of Humming) అని ప్రేమగా పిలుచుకునే జుబీన్.. 40 భాషల్లో సుమారు 38వేలకు పైగా పాటలు పాడారు. మూడు దశాబ్దాలకు పైగా తన అభిమానులను తన గానంతో ఊర్రూతలూగించారు.
కేవలం నేపథ్య గాయకుడు మాత్రమే కాదు. అస్సామీ సంగీతానికి సాంస్కృతిక వారధి. 2006లో విడుదలైన చిత్రం " గ్యాంగ్‌స్టర్"లో యా అలీ పాట ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. గదర్, దిల్ సే, డోలీ సజాకే రఖనా, ఫిజా, కాంటే, జిందగీ తదితర సినిమాలకూ తన గళాన్ని అందించారు. అనేక సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. దర్శకుడిగా కొన్ని సినిమాలు కూడా తీశారు. కొన్నింటిలో నటించారు. జుబిన్ మృతిపై అస్సాం(Assam) సీఎం హిమంతా ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
చివరి చూపు కోసం జుబీన్ భౌతిక కాయాన్ని గౌహతిలోని సారుసజైలోని అర్జున్ భోగేశ్వర్ బారువా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సోమవారం (సెప్టెంబర్ 22) ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉంచనున్నారు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.