ఇండియా కూటమిపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు..
ఇండియా కూటమి(INDIA alliance) విధానాలు, పొత్తులు, సరైన కార్యాచరణ లేకపోవడంపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు.;
ఇండియా కూటమిలో ఆప్ (AAP) భాగస్వామి పార్టీ. పార్లమెంట్ ఎన్నికలలో కూటమి భాగస్వామ్య పార్టీలు కలిసికట్టుగా పోటీచేసి విజయం సాధించాయి. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఆప్, కాంగ్రెస్ (Congress) విడివిడిగా పోటీచేస్తున్నాయి. ఈ తీరుపై జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir) ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి ఉద్దేశ్యాలపై స్పష్టత లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ కూటమి కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకు మాత్రమేనా? లేక శాసనసభ ఎన్నికలకూ ఉపయోగపడుతుందా? అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.
సమావేశం ఏర్పాటు చేయాలి
‘‘ఈ కూటమి పూర్తిగా పార్లమెంట్ ఎన్నికలకే పరిమితమైతే, అందులో కొనసాగాల్సిన అవసరం లేదు. కానీ శాసనసభ ఎన్నికలలోనూ కలిసి పనిచేయాలనుకుంటే మాత్రం సభ్యులంతా కలసి పని చేయాల్సి ఉంటుంది," అని ఒమర్ అన్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల తర్వాత కూటమి సభ్యులందరితో సమావేశం ఏర్పాటుచేయాలని ఒమర్ సూచించారు.
ఢిల్లీ(Delhi) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్‌కు పెరుగుతున్న మద్దతు గురించి ప్రశ్నించగా.. "మాకు ఢిల్లీ ఎన్నికలతో ఎటువంటి సంబంధం లేదు. ఆప్, కాంగ్రెస్, ఇతర పార్టీలు క్షేత్ర స్థాయిలో బీజేపీ(BJP)కి గట్టి పోటీ ఇస్తాయి," అని చెప్పారు. గతంలో రెండుసార్లు ఆప్ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ..ఢిల్లీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాలన్నారు.