పార్శీ సంప్రదాయానికి భిన్నంగా రతన్ టాటా అంత్యక్రియలు ఎందుకంటే..

వందల ఏళ్ల కిందట పర్షియా (ఇరాన్) నుంచి వచ్చి ఇండియాలో స్థిరపడిన పార్శీల ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. హైదరాబాద్ లోని పార్శీగుట్ట వాళ్ల అంతిమ సంస్కార స్థలం

Update: 2024-10-10 23:53 GMT

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ నావల్ టాటా అంత్యక్రియలు గురువారం సాయంత్రం (అక్టోబర్ 10) ముంబై వర్లీలోని ఎలక్ట్రికల్ స్మశానవాటికలో పూర్తయ్యాయి. ఆయన పార్శీ అయినప్పటికీ ఎలక్ట్రికల్ విధానంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో రతన్ టాటాకు తుది వీడ్కోలు పలికారు.

రతన్ టాటా భారతీయ_పార్శీకుడు. వాళ్లది జొరాస్ట్రియనిజం మతం. వందల ఏళ్ల కిందటే పర్షియా (నేటి ఇరాన్) నుంచి పార్శీలు ఇండియాకు తరలివచ్చి స్థిరపడ్డారు. ప్రకృతికి చాలా దగ్గర ఉండే సమాజాల్లో పార్శీలొకరు. పార్శీల అంత్యక్రియల సంప్రదాయంలో మృతదేహాన్ని కాల్చడం లేదా పాతిపెట్టడం ఉండదు. మానవ శరీరాన్ని ప్రకృతి బహుమతిగా భావిస్తారు. అంత్యక్రియలకు ముందు పార్శీ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం పార్థివదేహాన్ని అంత్యక్రియల కోసం నిర్దేశించిన ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్తారు. వీరి సంప్రదాయ స్మశానవాటిక అయిన 'టవర్ ఆఫ్ సైలెన్స్' లేదా 'దఖ్మా' అని పిలుచుకునే ఎత్తైన బహిరంగ ప్రదేశంలో మృతదేహాన్ని ఉంచి రాబందులు తినడానికి వదిలివేస్తారు. హిందూ సంప్రదాయంలో పిండ ప్రదానం చేసిన తరువాత కాకులు తినడం లాగానే పార్శీల మృతదేహాలను రాబందులు తినడం కూడా పార్శీ సమాజ ఆచారం.

జొరాస్ట్రియనిజం మతస్థులు భూమి, అగ్ని, గాలి, నీరును ఎంతో పవిత్రంగా చూస్తారు. వాటిని కలుషితం చేయడానికి ఇష్టపడరు. ప్రకృతిని పవిత్రంగా చూస్తారు. జొరాస్ట్రియనిజం మతంలో చావు, పుట్టుకలను చీకటి వెలుగుగా పరిగణిస్తారు. జీవితాన్ని వెలుగు, చీకటి మధ్య పోరాటంగా చూస్తారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు చీకటిలోకి వెళ్తాడని నమ్ముతారు. అందుకే దహన సంస్కారాలను అగ్ని, నీరు, భూమి వంటి పవిత్రంగా భావించే వాటితో చేయరు. అలా చేస్తే ప్రకృతిలోని పవిత్రమైన పదార్థాలు కలుషితం అవుతాయని విశ్వసిస్తారు. అందువల్లే పార్శీలు- మృతదేహాన్ని పాతిపెట్టడం, దహనం చేయడం, నదుల్లో పడేయడం వంటివి చేయరు.
ప్రపంచంలో పార్శీల జనాభా 2 లక్షల కంటే తక్కువగానే ఉంది. ఇండియాలో వందల్లో ఉన్నారని అంచనా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పార్శీ సమాజం ప్రత్యేకమైన అంత్యక్రియల సంప్రదాయం కారణంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటుంది. డేగలు, రాబందులు వంటి పక్షుల సంఖ్య రానూరానూ తగ్గుతుండడంతో కొన్నేళ్లుగా పార్శీల అంత్యక్రియల సంప్రదాయం కష్టతరమైంది. కరోనా కాలంలో వీరి మరణాలపై సుప్రీం కోర్టులో పెద్ద చర్చే జరిగింది. తమ సంప్రదాయాల మేరకు మృతదేహాన్ని బహిరంగ ప్రదేశాల్లో వదిలివేస్తే గాలిలో వైరస్ వ్యాప్తి చెందుతుందని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో పార్శీలు తమకు నచ్చిన మత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. పార్శీ శ్మశానవాటికలు చాలా వరకు నేడు నగరాల మధ్యలో ఉండడంతో కూడా స్థానికుల నుంచీ ఇబ్బందులు వస్తున్నాయి. ఉదాహరణకు ఒకప్పుడు హైదరాబాద్ లోని పార్శీగుట్ట ఊరి చివర ఉండేది. ఇప్పుడది నగరం మధ్యలోకి వచ్చింది. ఓపక్క రాంనగర్, మరోపక్క సికింద్రాబాద్ పద్మారావునగర్.
మారుతున్న పర్యావరణ పరిస్థితులు, రాబందుల సంఖ్య తగ్గిపోవడం వంటి సమస్యల కారణంగా దఖ్మా పద్ధతిలో అంత్యక్రియలు కష్టంగా మారింది. దీంతో సోలార్‌ లేదా విద్యుత్‌ విధానంలో దహన వాటికల్లోనే పార్సీలు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అందువల్లే రతన్ టాటా అంత్యక్రియలను ఎలక్ట్రికల్ పద్ధతిన నిర్వహించారు.
Tags:    

Similar News