పవన్ కల్యాణ్ పై పోటీ చేస్తానంటున్న ఈ మహిళ ఎవరు, ఏమా కథ?

చాలాకాలం పాటు జనసేన అనుచరురాలిగా ఉన్న ఆమె ఉన్నట్టుండి ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కి బద్ధ శత్రువుగామారారు. పవన్ అంటేనే కస్సు మంటున్నారు, ఎందుకు?

By :  Admin
Update: 2024-04-11 04:55 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పోటీ చేసి ఓడిస్తానంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఓ యువతి. చాలాకాలం పాటు జనసేన అనుచరురాలిగా ఉన్న ఆమె ఉన్నట్టుండి ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కి బద్ధ శత్రువుగామారారు. పవన్ కల్యాణ్ అంటేనే కస్సు మంటున్నారు, ఆయన సంగతి తేలుస్తానంటూ సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ఇంతకీ ఆమెకి ఎందుకింత కోపం? పవన్ పై ఆమెకి ఎందుకంత కోపం? ఇంతకీ ఆమె ఎవరు? ఆమె కథాకమామిషు ఏమిటో...


ఆమె పేరు ఆకుల జయకల్యాణి. జనసేన పార్టీ కార్యాలయ వర్గాల కధనం ప్రకారం ఆమెది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. వివాహిత. ఆమె భర్త పేరున్న ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తారు. ఇప్పుడా కంపెనీ యజమాని కూడా వైసీపీ తరఫున పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. ఈ జయకల్యాణీ గతంలో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసేవారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే పిచ్చి అభిమానం. లోకకల్యాణం ఆయనతో సాధ్యమనే భావనతో జనసేనలో చేరారు. ఆ తర్వాత జనసేన మీద ప్రేమతో ఆ పార్టీ కార్యాలయ వ్యవహారాలు కూడా చూశారు.


ఈమె డైరెక్టర్ గా ఓ సంస్థను కూడా జనసేన ఏర్పాటు చేసినట్టు ఆమె చెబుతుంటారు. కొంతకాలం అలా సాగిన తర్వాత టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన భావించినపుడు జనసేన పార్టీ నాయకత్వం పాత స్టాఫ్ మొత్తాన్ని తొలగించింది. సుమారు 60 మందిని తీసివేశారు. అందులో తను కూడా ఒకరని జయకల్యాణి చెబుతుంటారు. తన ఉద్యోగం ఊడినప్పటి నుంచి ఆమె పవన్ కల్యాణ్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.


ఉద్యోగం పోయినందుకు తనకేమీ బాధ లేదని చెప్పే జయకల్యాణి.. పవన్ కల్యాణ్ చేసే ప్రతి ప్రకటననూ తప్పుబడుతుంటారు. ఉదాహరణకు.. “ఓట్లు కొనని రాజకీయం చేద్దాం అని చెప్పిన మాట నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొనాలా లేదా అనే నిర్ణయం మీరే తీసుకోండి అని నాయకులకు చెప్పే స్థితికి దిగజారిపోయారా మాస్టారు (పవన్)?” అని ప్రశ్నిస్తారు. “రబ్బరు చెప్పులు వేసుకునే వారిని అసెంబ్లీకి తీసుకెళ్తా అని గొప్ప గొప్ప మాటలు చెప్పి వారిని మోసం చేయడం ఏమిటి పవన్ గారు? మీకు పని చేసే వారు అక్కర్లేదు అని తేట తల్లెం చేశారు మరోసారి !! దీనికి మీరు ఏమి సమాధానం చెప్తారు?? ఇంకెంత కాలం జనాలను మీ మాటలతో మాయ చేస్తారు?” అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నాస్త్రాలను సంధిస్తారు. “హలో మిస్టర్ పవన్ కల్యాణ్ గారు, గతంలో తమరు పోటీచేసిన భీమవరంలో ఏమి జరిగిందో తమరికి తెలియదు. ఎవరి ఇల్లు కూల్చారో, జనసైనికులు విరాళాలు సేకరించి ఎవరి ఇల్లు కట్టారో కూడా తెలియకుండా మాట్లాడేస్తున్నారు తమరు! కూల్చింది కట్టింది సర్పంచ్ ఇల్లు కాదు మహాశయా, వార్డ్ మెంబర్ కి సంబంధించిన ఇల్లు.. అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేయడంలో తమరి తరువాతే ఎవరైనా .. వారాహి అమ్మ పేరు వాహనాలకు పెట్టుకుని తప్పుడు పనులు, తప్పుడు ప్రచారాలు చేసే ప్రతీ ఒక్కడికీ అమ్మ గట్టిగా గుణపాఠం చెప్తుంది” అని ఈ మధ్య గట్టిగా కౌంటర్ ఇచ్చారు. “చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసం పిఠాపురం సీటును కూడా త్యాగం చేసేంత మనిషి మన పవన్ కల్యాణ్” అని ఈమధ్య ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది.


ఉన్నట్టుండి ఆమె ఇటీవల.. పిఠాపురంలో పోటీ చేస్తానంటున్న పవన్ కల్యాణ్ కాపు కులానికి ఏమీ చేయరని, తన కార్యాలయంలో పని చేస్తున్న 60 మంది కాపుల్ని ఉద్యోగం నుంచి తీసివేయడమే ఇందుకు నిదర్శనం అని, చివరికి హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో రికార్డులు తగలబెట్టి అగ్ని ప్రమాదంగా క్రియేట్ చేశారన్నది జయలక్ష్మి ఆరోపణ. పవన్ కల్యాణ్ నే కాకుండా యావత్తు చిరంజీవి కుటుంబాన్ని కూడా ఆమె టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. “40 ఏళ్లుగా మెగా కుటుంబాన్ని మోస్తూ కాపులు తమను తాము మోసం చేసుకుంటున్నారు” అని ఆరోపించినపుడు కొద్ది మంది తూర్పు గోదావరి జిల్లా కాపులు ఆమెపై ఘాటుగానే విమర్శలు చేశారు.


జయకల్యాణి కేవలం వ్యక్తిగత కక్షతో ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. అయినా ఆమె వెనక్కి తగ్గడం లేదు. పైగా పవన్ కల్యాణ్ పై భారత చైతన్య యువజన పార్టీ తరఫున పోటీ చేసి ఓడిస్తానంటూ శపధం చేశారు. గతంలో 133 సీట్లలో పోటీ చేసిన జనసేన ఈసారి 21 సీట్లతో సరిపెట్టుకున్నపుడే పవన్ కల్యాణ్ సత్తా ఏమిటో తెల్సిపోయిందనే ఆకుల జయ కల్యాణి తన ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసిన ఫోటోలను బట్టి చూస్తుంటే పవన్ కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టే కనిపిస్తుంది. ఆమె నిజంగా జనసేన కార్యాలయంలో పని చేశారా లేదా అని ఫెడరల్ ప్రతినిధి ఆరా తీసినపుడు జయలక్ష్మి కొంతకాలం హైదరాబాద్ జనసేన కార్యాలయంలో పని చేసిన మాట నిజమేనని తేలింది. ఆమె ఇన్ని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నా పార్టీ వర్గాలు మాత్రం ఇప్పటి వరకు ఏమాత్రం స్పందించలేదు. స్పందించి ఆమెకు లేనిపోని గౌరవం దక్కేలా చూడకూడదన్నదే ఉద్దేశంగా ఉన్నట్టు జనసేన వర్గాలు తెలిపాయి.


ఇప్పుడామె పవన్ కల్యాణ్ పై పోటీ చేసేందుకు కావాల్సిన నేపథ్యాన్ని తయారు చేసుకునే పనిలో భాగంగా పలువురు కాపు సామాజిక పెద్దల్ని కలుస్తున్నారు. ఈమె చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు ఎంతో, ఆమె పోటీ చేస్తే వచ్చే ఓట్లెన్నో మున్ముందు తేలాల్సిందే. పైగా ఈమె తన ఆరోపణలకు పార్టీలోని పెద్ద పెద్ద నాయకుల పేర్లను జోడించడం గమనార్హం.

Tags:    

Similar News