ఎంపీలకు కేరళ సీఎం దిశానిర్దేశం ఏమిటి?

కేరళ సీఎం పినరయి విజయన్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. విపత్తు సాయం అందించడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

Update: 2024-11-21 13:23 GMT

కేరళ సీఎం పినరయి విజయన్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. విపత్తు సాయం అందించడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇక పార్లమెంటులో అందరి దృష్టికి తీసుకెళ్లాలని తన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

ఇటీవల వయనాడ్ జిల్లాలోని కొండచెరియలు విరిగిపడి వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. చాలా మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ కూడా దుర్ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు కూడా. జరిగిన నష్టానికి సంబంధించి కేంద్రానికి నివేదిక పంపినా.. పూర్తిస్థాయిలో ఆదుకోకపోవడంతో ఒక నిర్ణయానికి వచ్చారు విజయన్. కేరళకు చెందిన ఎంపీలు, తన క్యాబినెట్ సహచరులతో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రానికి నిధుల విడుదలలో ఆలస్యంపై కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. పదేపదే అడుగుతున్నా.. కేంద్రం స్పందించకపోవడంపై ప్రశ్నించాలని కోరారు. విపత్తు సంభవించిన 100 రోజుల్లోనే కేరళ ప్రభుత్వం తన డిమాండ్‌ను అవసరమైన ఫార్మాట్‌లో కేంద్రానికి సమర్పించిన విషయాన్ని కూడా ప్రస్తావించాలని సూచించారు.

మోదీ వచ్చిపోయినా లాభం లేదు..

"విపత్తు నష్టానికి సంబంధించి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిబంధనల ప్రకారం ఆగస్టు 17న కేంద్ర ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించి 100 రోజులు గడిచింది. మెమోరాండం సమర్పించి మూడు నెలలై పోయింది. కేంద్ర బృందం పర్యటనకు వచ్చినా ఇప్పటికీ ఎలాంటి సాయం అందలేదు. అనేక రాష్ట్రాలు కోరకుండానే కేంద్రం ఆర్థిక సాయం చేసింది. కేరళకు ప్రత్యేక ఆర్థిక సాయంగా ఒక్క పైసా కూడా అందలేదు.’’ అని పినరయి విజయన్ అన్నారు.

కేరళ విపత్తును 'తీవ్ర ప్రకృతి విపత్తు'గా ప్రకటించినందున ప్రతి ఒక్కరూ తమ ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షలు కేటాయించవచ్చని సూచించారు. సమావేశం అనంతరం యూడీఎఫ్ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ మీడియాతో కేంద్ర ప్రభుత్వం సాంకేతిక అంశాలతో బాధితులకు సాయం చేయడంలో జాప్యం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్‌లోనూ, బయట కూడా డిమాండ్‌లు లేవనెత్తుతామని ప్రేమచంద్రన్‌ కోరారు. కేసుల స్థితిగతులను ఎంపీలకు ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారని, విపత్తు జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా ఆర్థిక సాయం అందించకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని ఎంపీలు అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర డిమాండ్లను పార్లమెంట్‌లో బలంగా లేవనెత్తాలని కొల్లం ఎంపీ కోరారు. సమావేశంలో వివిధ అభివృద్ధి అంశాలు, ఎంపీలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.  

Tags:    

Similar News