త్వరలో విమానాలను సైతం ఎగుమతి చేయబోతున్నాం: మోదీ
దేశంలో తయారైన విమానాలను త్వరలో విదేశాలకు ఎగుమతి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తో కలిసి..
By : 491
Update: 2024-10-28 07:26 GMT
సైనిక రవాణాలో విస్తృతంగా ఉపయోగించే సీ-295 విమానాలను భారత దేశంలో అసెంబ్లీ చేయనున్నారు. ఈ యూనిట్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ- స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ కలిసి గుజరాత్ లోని వడోదరలో ప్రారంభించారు. ఈ యూనిట్ లో టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్ లిమిటెడ్- ఎయిర్ బస్ రెండు కలిసి అసెంబ్లీంగ్ చేయబోతున్నాయి. ఇది దేశంలో సైనిక విమానాల కోసం ఏర్పాటు అయిన తొలి ప్రైవేట్ సెక్టార్ అసెంబ్లీ యూనిట్. ప్రారంభోత్సవం అనంతరం మోదీ మాట్లాడుతూ.. వడోదర ఫ్యాక్టరీలో తయారైన విమానాలను భవిష్యత్తులో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు.
రతన్ టాటాను గుర్తు చేసుకున్న మోదీ..
“ఇటీవల, మనం దేశం గొప్ప కుమారుడైన రతన్ టాటా జీని కోల్పోయింది. ఈరోజు ఆయన మన మధ్య ఉండి ఉంటే ఆనందంగా ఉండేవారేమో కానీ ఆయన ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ ఆనందంగా ఉండి ఉంటుంది. ఈ C-295 ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీ న్యూ ఇండియా కొత్త వర్క్ కల్చర్‌ను ప్రతిబింబిస్తుంది... నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు, రైలు కోచ్‌లను నిర్మించడానికి వడోదరలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను, ఇప్పుడు విమానాల కర్మాగారం ప్రారంభిస్తున్నాం” అని మోదీ అన్నారు.
“ఫ్యాక్టరీ కూడా రికార్డు సమయంలో ఉత్పత్తికి సిద్ధం అయింది. నేడు ఆ ఫ్యాక్టరీలో తయారైన మెట్రో కోచ్‌లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ ఫ్యాక్టరీలో తయారైన విమానాలను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తారన్న నమ్మకం నాకుంది...’’ అన్నారాయన.
వడోదర ఫెసిలిటీలో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని స్పానిష్ పీఎం శాంచెజ్ తెలిపారు. 2026లో ఈ సదుపాయం నుంచి తొలి విమానం అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.
" భారతీయ కంపెనీలు వృద్ధి చెందాలనుకుంటే, మమ్మల్ని కూడా విశ్వసించండి. 2026లో, భారతదేశంలో తయారు చేయబడిన మొదటి C295 వడోదరలోని ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఈ విమానం స్పానిష్ - యూరోపియన్ ఏరోనాటికల్ పరిశ్రమకు చిహ్నం. అదనంగా భారత రక్షణ సామర్థ్యాలను ఆధునీకరించడానికి తోడ్పడటమే కాకుండా, ఇది సాంకేతిక అభివృద్ధికి, ముఖ్యంగా భారత్ లోని ప్రముఖ తయారీ కేంద్రంగా ఉన్న గుజరాత్ అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడుతుంది’’ అని పెడ్రో విశ్వాసం వ్యక్తం చేశారు.
“వేలాది ప్రత్యక్ష- పరోక్ష ఉద్యోగాలు ఇక్కడ సృష్టించబడతాయి. కొత్త తరం అర్హత కలిగిన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు శిక్షణ పొందుతారు... 99 శాతం కంపెనీలు స్థూల చిన్న, మధ్య తరహా సంస్థలు ఉన్న దేశం నుంచి నేను వచ్చాను. సామాజిక, ప్రాదేశిక ఐక్యతను ప్రోత్సహించడంలో ఇలాంటి సంస్థలు చాలా విలువైన పాత్ర పోషిస్తాయి.” అని శాంచెజ్ చెప్పారు.
40 విమానాలను నిర్మాణం..
ఒప్పందంలో భాగంగా వడోదర ప్లాంట్ లో 40 విమానాలను నిర్మించనుండగా, ఏవియేషన్ బెహెమోత్ ఎయిర్‌బస్ నేరుగా 16 విమానాలను డెలివరీ చేస్తుంది. భారతదేశంలో ఈ 40 విమానాలను తయారు చేయడానికి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ బాధ్యత వహిస్తుంది.
ఇది పూర్తి పర్యావరణ అనుకూలంగా ఉంటుంది. తయారీ నుంచి అసెంబ్లీ, పరీక్ష, అర్హత, విమానం పూర్తి జీవిత చక్రం డెలివరీ, నిర్వహణ వరకు అన్ని ఈ ప్లాంట్ నుంచే జరుగుతాయి. టాటాలతో పాటు, భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్ వంటి ప్రముఖ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, అలాగే ప్రైవేట్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ఈ కార్యక్రమానికి సహకరిస్తాయి. వడోదరలో చివరి అసెంబ్లీంగ్ లైన్‌కు 2022 అక్టోబర్‌లో మోదీ శంకుస్థాపన చేశారు.