మహారాష్ట్రలో ఏకంగా 10 ఏనుగుల మృతి, వీడని మిస్టరీ
మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ (Bandhavgarh tiger Reserve) ప్రాంతంలో ఏనుగుల మృత్యుఘోష కొనసాగుతోంది.
By : The Federal
Update: 2024-11-01 09:14 GMT
మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ (Bandhavgarh tiger Reserve) ప్రాంతంలో ఏనుగుల మృత్యుఘోష కొనసాగుతోంది. నవంబర్ 1 నాటికి అంటే శుక్రవారం నాటికి పది ఏనుగులు చనిపోయాయి. ఈ ఏనుగుల మరణం వెనుక ఎటువంటి కుట్ర, కుతంత్రం లేదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నా బాంధవ్ గఢ్ ప్రాంతంలో మాత్రం ఏనుగుల మృత్యుఘోష ఆగడం లేదు. తాజాగా మరో మూడు ఏనుగులు చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో 72 గంటల వ్యవధిలో చనిపోయిన ఏనుగుల సంఖ్య 10కి చేరింది. విషపూరిత పదార్థాలు తీసుకోవడం వల్లే అవి చనిపోతున్నాయని అధికారులు చెబుతుంటే ఆ విషపూరిత ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు. అటవీశాఖ అధికారుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మందలో మొత్తం 13 ఏనుగులు ఉంటే వాటిలో పది చనిపోయాయి. ఇంకా మూడే మిగిలి ఉన్నాయి.
‘‘ఏనుగుల మరణాలకు సంబంధించి ఎటువంటి అనుమానస్పద చర్యలు కనిపించడం లేదు. సమీప ప్రాంతాలను సందర్శించాను. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలో అసలు విషయాలు వెల్లడవుతాయి’’ అని మధ్యప్రదేశ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వీకేఎన్ అంబాదే చెప్పారు.
ఏనుగుల మరణాలకు సంబంధించి దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ నుంచి వన్యప్రాణి సంరక్షణ ప్రత్యేక బృందాలు వచ్చాయి. పరిస్థితులను పరిశీలిస్తున్నాయని అటవీ అధికారులు పేర్కొన్నారు. జాగిలాలతో పాటు రాష్ట్ర స్థాయి అటవీశాఖ బృందాలు దర్యాప్తులో పాల్గొన్నాయి.
దేశంలో మూడు రోజుల్లో 10 ఏనుగులు చనిపోవడం ఇదే తొలిసారి. మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌లో జరిగిన విధ్వంసకర సంఘటనలో కేవలం మూడు రోజుల వ్యవధిలో పది ఏనుగులు అనుమానాస్పద స్థితిలో చనిపోయాయి. ఏనుగుల మరణాల వెనుక మిస్టరీని ఛేదించేందుకు దర్యాప్తు బృందాలు తరలివస్తున్నాయి.
మంగళవారం మొదలైన ఏనుగుల మరణ మృదంగం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మంగళవారంనాడు బీట్ గార్డు గస్తీ తిరుగుతున్న సమయంలో తమ శిబిరానికి రెండు కిలోమీటర్ల దూరంలో కొన్ని ఏనుగులు కిందపడి ఉండడాన్ని గమనించడంతో అసలు విషయం బయటకువచ్చింది. అటవీశాఖ అధికారులు, వెటర్నరీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే నాలుగు ఏనుగులు మృతి చెందాయి. బతికి ఉన్న వాటికి తక్షణం వైద్యం అందించామని అటవీశాఖ అధికారులు చెబుతున్నా బుధవారం రాత్రికి మరో నాలుగు చనిపోయాయి. గురు, శుక్రవారాలలో మరో రెండు మరణించాయి. దీంతో మొత్తం ఏనుగుల మరణాల సంఖ్య పదికి చేరుకుంది. మరికొన్ని కూడా జబ్బున పడి ఉన్నట్టు గుర్తించారు. అయితే అవి ఎన్నీ, ఏమిటీ అనేది చెప్పడానికి అధికారులు నిరాకరిస్తున్నారు.
డిప్యూటీ డైరెక్టర్ పి.కె. వర్మ చెబుతున్న దానిప్రకారం ఈ ఏనుగులు ఈ సీజన్లో వచ్చే కోడో అనే మొక్కల్ని తినడం వల్ల చనిపోయి ఉండవచ్చునన్న అనుమానాల్ని వ్యక్తం చేశారు. "మేము అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. కొన్ని పరిస్థితులలో ఏనుగులు విషపూరిత కోడూ మొక్కల్ని తినే అవకాశం ఉంది. ఇంకా నిర్ధారణ జరగలేదు" అని వర్మ పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యగా, అధికారులు సమీపంలోని కోడు పంటలను ధ్వంసం చేశారు. ఏనుగుల్ని వేటాడే వాళ్ల జాడను పసిగట్టే మెరుపు దళాల అధికారులు వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ తో వివిధ ప్రాంతాలను గాలిస్తున్నారు. ఏనుగులు చనిపోతున్న ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలోని నీటి వనరులు, కదలికల తీరు, స్థానిక పంటలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చాలా మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంకా ఖచ్చితమైన కారణం తెలియలేదు. ఏనుగుల పోస్ట్‌మార్టం నివేదికలు రావాల్సి ఉంది. అవి వస్తేనే ఏమైనా చెప్పగలమని అధికారులు అంటున్నారు.
ఏనుగుల ఆవాసానికి మారుపేరుగా నిలిచిన బాంధవ్ నగర్ ఇప్పుడు వాటి పాలిట మరణశయ్యగా మారడం విషాదకరం. 2017 నుంచి ఈ రిజర్వ్‌కు పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా క్రమంగా ఏనుగులు వలస వస్తున్నాయి. ఏనుగులు ఉండడానికి ఇదో అనువైన ప్రాంతంగా మారుతున్న తరుణంలో ఇంతపెద్దసంఖ్యలో ఏనుగులు చనిపోవడం రిజర్వ్ పేరుప్రతిష్టలు, ఖ్యాతిపై చీకటినీడ పడినట్టయింది. అసలు ఈ ప్రాంతం వన్యప్రాణుల సంరక్షణకు అనువైందేనా అనే అనుమానం వరకు ఇప్పుడు మొదలైంది.
అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వన్యప్రాణి) ఎల్ కృష్ణమూర్తి పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధి ఫోన్‌లో సంప్రదించినప్పుడు, "పశువైద్యులు శవపరీక్షలు నిర్వహించారు. వాటి కడుపులో విషపూరిత ఆహార పదార్థాలు ఉన్నట్టు గమనించారు. వాటి కడుపులో కోడో మిల్లెట్స్ ఉన్నట్టు గుర్తించారు" అని చెప్పారు. ఏనుగుల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీకి కృష్ణమూర్తి నాయకత్వం వహిస్తున్నారు. ఇంకో వారం పదిరోజుల్లో ఆయన నివేదిక ఇస్తారని సమాచారం.