బంగాళదుంప రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన బెంగాల్ సీఎం మమత
మమతా బెనర్జీ క్యాబినెట్ నిర్ణయాలు - బంగాళదుంప రైతులకు కనీస మద్దతు ధర, అక్షయ తృతీయ రోజున జగన్నాథ ఆలయ ప్రారంభం;
పశ్చిమ బెంగాల్(West Bengal) బంగాళదుంప (Potato) రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇందుకు కారణం తృణమూల్ కాంగ్రెస్ (TMC) సర్కారు తీసుకున్న నిర్ణయమే. కనీస మద్దతు ధర (MSP)ను రూ. 900గా నిర్ణయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ‘‘బంగాళాదుంప రైతులకు అండగా ఉంటాం. కనీస మద్దతు ధర రూ. 900 గా నిర్ణయించాం. ఇకనుంచి కష్టపడి పండించిన పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు’’ అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.
‘‘తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా డామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (DVC) నీటిని విడుదల చేయడం వల్ల పంట పొలాలకు నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న బంగాళాదుంపలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. పంటల బీమా కోసం రూ. 321 కోట్ల కేటాయించాం,’’ అని మమతా(Mamata Banerjee) రైతులకు భరోసా ఇచ్చారు.
క్యాబినెట్ మరో నిర్ణయం కూడా తీసుకుంది. తూర్పు మేదినీపూర్ జిల్లా దిగ్ఘాలో నిర్మాణం పూర్తి చేసుకున్న జగన్నాథ ఆలయాన్ని ఏప్రిల్ 30 (అక్షయ తృతీయ)న ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఆలయ నిర్మాణాన్ని ఆమె గతంలో స్వయంగా సమీక్షించిన సంగతి తెలిసిందే.