పశ్చిమబెంగాల్‌: మరో మెడికో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం..

బర్దమాన్ జిల్లాలో ఘటన..ముగ్గురి అరెస్ట్..నిందితులపై త్వరగా చర్యలు తీసుకోవాలని సీఎం మమతను కోరిన ఒడిశా సీఎం మాఝి..

Update: 2025-10-12 07:53 GMT
ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించేందుకు వచ్చిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చన మజుందార్
Click the Play button to listen to article

పశ్చిమ బెంగాల్‌(West Bengal) రాష్ట్రంలో మరో ఘోరం జరిగింది. తన స్నేహితుడితో కలిసి రాత్రి బయటకు వెళ్లిన ఎంబీబీఎస్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం(Gang rape) జరిగింది. బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.


త్వరలో నిందితుల వివరాలు..

‘‘రేప్ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నాం. కేసు సున్నితమైనది కావడంతో నిందితుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. ఒక నిందితుడు బాధితురాలి ఫోన్ తీసుకుని స్పాట్‌కు రావాలని మరో నిందితుడికి ఫోన్ చేశాడు. అలా ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించాం. బాధితురాలు చెప్పిన వివరాల ఆధారంగా నిందితుల కోసం మెడికల్ కాలేజీ సమీప ప్రాంతాల్లో గాలించాం. ఘటన స్థలికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలను కూడా సేకరించి తీసుకెళ్లారు. బాధితురాలికి నిందితులకు ఎక్కడయినా సంబంధం ఉందా? బాధితురాలి స్నేహితుడితో నిందితులకు ఏమైనా లింకు ఉందా? అనే కోణంలో విచారిస్తుస్తాం. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన వాంగ్మూలాన్ని రికార్డు చేశాం’’ అని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.


అసలేం జరిగింది?

బర్ధమాన్ జిల్లా దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సెకండీయర్ చదువుతున్న అమ్మాయి తన స్నేహితుడితో కలిసి అక్టోబర్ 10వ తేదీ రాత్రి బయటకు వెళ్లిన సమయంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. బాధితురాలిని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం.


పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు..

‘‘తన స్నేహితుడు మా అమ్మాయిని వదిలేసి వెళ్లిపోయాడు. నిందితులు మా కూతుర్ని పొదల్లోకి లాక్కెళ్లారు. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. తన మొబైల్ ఫోన్‌ను కూడా లాక్కున్నారు. ఇతరుల సాయం కోసం వెళ్లిన మా అమ్మాయి స్నేహితుడు.. తిరిగి వచ్చేలోపు ఘోరం జరిగిపోయింది. నిందితులు పారారయ్యారు.’’ అని బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.


‘నిందితులపై త్వరగా చర్య తీసుకోవాలి’

గ్యాంగ్ రేప్ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బాధితురాలిది ఒడిశా రాష్ట్రం కావడంతో దుర్ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝి ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని నిందితులపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు.


కళాశాలను సందర్శించనున్న కమిషన్ ప్రతినిధులు..

పశ్చిమ బెంగాల్ మహిళా కమిషన్ ప్రతినిధులు కళాశాలను సందర్శించాక, ఈ రోజు బాధితురాలు, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ డాక్టర్స్ ఫోరం (WBDF), అభయ మంచ్ ప్రతినిధులు ఆదివారం సాయంత్రం కళాశాలను సందర్శిస్తారని ఫోరం అధ్యక్షుడు డాక్టర్ కౌశిక్ చాకి తెలిపారు. విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.


దేశాన్ని కుదిపేసిన ఆర్‌జీ కర్ ఘటన కూడా బెంగాల్‌లోనే..

2023 ఆగస్టులో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జూన్‌లో లా కాలేజీలో మరో అత్యాచారం జరిగింది. జూలైలో ఒక మహిళపై ప్రతిష్టాత్మక ఐఐఎం-కలకత్తా విద్యార్థి ఒకరు అత్యాచారం చేశాడు. 

Tags:    

Similar News