AAP | I.N.D.I.A నుంచి కాంగ్రెస్‌ను బహిష్కరించాలని కోరతాం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తమను ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీతో చేతులు కలిపిందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసేందుకు బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కైందని ఆరోపించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్. గురువారం వారు విలేఖరులతో మాట్లాడుతూ..“హర్యానా ఎన్నికల సమయంలో మేం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని ఓడించడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ బీజేపీతో చేతులు కలిపినట్లుంది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా చూస్తుంటే అది బీజేపీ కార్యాలయంలో తయారైనట్లు అనిపిస్తుంది’’ అని సింగ్ అన్నారు.
సింగ్ ఇంకా ఏమన్నారంటే..
కాంగ్రెస్ నేతలు అజయ్ మాకెన్, సందీప్ దీక్షిత్ బీజేపీపై దృష్టి సారించకుండా ఆప్‌ని టార్గెట్ చేశారని సింగ్ ఆరోపించారు. “అరవింద్ కేజ్రీవాల్‌ను దేశవిరోధి అని పేర్కొనడం ద్వారా అజయ్ మాకెన్ ఆయన హద్దు దాటారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు ఎఫ్‌ఐఆర్ ఎదుర్కొంటుండగా..కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క బీజేపీ నాయకుడిపై ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదు’’ అని సింగ్ పేర్కొన్నారు.
'ఆప్ నిర్వీర్యానికి కుట్ర’
AAPను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని అతిశీ ఆరోపించారు. “కాంగ్రెస్ అభ్యర్థులు సందీప్ దీక్షిత్, ఫర్హాద్ సూరిలకు బీజేపీ నుంచి ఫుల్ సపోర్టు ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఇండియా కూటమిలో కాంగ్రెస్ నిబద్ధతను ప్రశ్నిస్తోంది.” అని అన్నారు.
AAP అల్టిమేటం..
మాకెన్, ఇతర కాంగ్రెస్ నాయకులపై 24 గంటల్లో క్రమశిక్షణ చర్య తీసుకోవాలని AAP డిమాండ్ చేసింది. వారిపై చర్య తీసుకోకపోతే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బహిష్కరించేలా ఒత్తిడి తెస్తామని పేర్కొంది. కాంగ్రెస్‌ను తొలగించాలని కూటమిలోని ఇతర పార్టీలను కోరతామని సింగ్ చెప్పారు.