‘నీట్’ను మేమే నిర్వహించుకుంటాం. అనుమతివ్వండి: వెస్ట్ బెంగాల్ సీఎం మమత

నీట్‌ను రద్దు చేసి రాష్ట్రాలు సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు అనుమతించాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల కేంద్రాన్ని కోరారు.

Update: 2024-07-25 07:06 GMT

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌ను రద్దు చేసి దాని స్థానంలో మెడికల్ అభ్యర్థులకు కొత్తగా ఎంట్రెన్స్ పరీక్ష పెట్టాలని శాసనసభ్యులు తీర్మానించింది.

రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సోవాందేబ్ ఛటోపాధ్యాయ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. నీట్‌కు వ్యతిరేకంగా ఇటీవల కర్ణాటక కేబినెట్ కూడా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

24 లక్షల మంది పిల్లల భవిష్యత్తు నాశనం..

తీర్మానాన్ని బలపరుస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యాబసు మాట్లాడారు. ‘ప్రశ్నపత్రాలు రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షలకు అమ్మేశారని మీడియా ద్వారా తెలిసింది. దేశంలోని 24 లక్షల మంది పిల్లల భవిష్యత్తు నాశనమవుతోంది. కొంతమంది విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు కలపడం, ఈ ఏడాది 67 మంది నీట్‌ పరీక్షలో 720కి 720 మార్కులు సాధించడం అనుమానంగా ఉంది. గతేడాది ఇద్దరు, ముగ్గురికి మాత్రమే అలాంటి మార్కులు వచ్చాయి. ఎవరికి ఎన్ని గ్రేస్‌ మార్కులు ఇచ్చారో స్పష్టత లేదు. పరీక్ష నిర్వహణ బాధ్యతను మాకు అప్పగించండి. మేం పారదర్శకంగా నిర్వహిస్తాం.’’ అని పేర్కొన్నారు.

నీట్ రద్దుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం..

కర్ణాటక అసెంబ్లీ కూడా ఇదే తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది. నీట్‌కు వ్యతిరేకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రివర్గం కూడా సోమవారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నీట్‌ను రద్దు చేసి రాష్ట్రాలు సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేందుకు అనుమతించాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల కేంద్రాన్ని కోరారు.

మోదీకి మమతా లేఖ..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ నీట్‌ను రద్దు చేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించుకునే మునుపటి విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ జూన్ 24 న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

నీట్ అక్రమాలకు వ్యతిరేకంగా నిరసనలు..

నీట్ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రశ్నాపత్రం లీక్ చేసిన వారిని, దాంతో లబ్ది పొందిన వారిపై కేసులు నమోదు చేశారు. పేపర్ లీక్ కేసులో సీబీఐ కూడా ఆరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.

ప్రతిపక్ష నేతల వాకౌట్..

తీర్మానానికి ముందు అసెంబ్లీలో అధికార టిఎంసి, ప్రతిపక్ష బిజెపి ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని, వాటిపై చర్చకు డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. స్పీకర్ బిమన్ బందోపాధ్యాయ ప్రతిపక్షాల ప్రతిపాదనను చదవడానికి అనుమతించి, చర్చకు మాత్రం అంగీకరించలేదు. దాంతో బీజేపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసి నిరసన తెలిపారు.

Tags:    

Similar News