ఐక్యతే జార్ఖండీల ఆయుధం: హేమంత్ సోరెన్

రాష్ట్ర ప్రజల ఐక్యతే తమ ఆయుధమని, తమను విభజించలేరు, మౌనంగా ఉంచలేరు అని వ్యాఖ్యానించారు జార్ఖండ్ కాబోయే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.

Update: 2024-11-28 09:48 GMT

జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కొన్ని గంటల ముందు ఆయన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఐక్యతే తమ ఆయుధమని, తమను విభజించలేరు, మౌనంగా ఉంచలేరు అని వ్యాఖ్యానించారు. 49 ఏళ్ల JMM నాయకుడు రాంచీలోని మొరాబాది గ్రౌండ్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు సోరెన్‌తో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పలువురు రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.

'జార్ఖండీలు తలవంచరు'

"జార్ఖండీలు తలవంచరు. అందులో సందేహం లేదు. మన ఐక్యతే మన ఆయుధం. మనల్ని విభజించలేరు. మౌనంగా ఉంచలేరు. వారు మనల్ని వెనక్కి నెట్టినప్పుడల్లా..బలంగా ముందుకు వెళ్తాం. మనల్ని నిశ్శబ్దం చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా..మన స్వరం పెరుగుతుంది. మా పోరాటం దృఢమైనది. చివరి శ్వాస వరకు పోరాడుతూనే ఉంటాం." అని సోరెన్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.

ఈ రోజును చారిత్రాత్మకంగా పేర్కొంటూ.. ఇది "మన సమిష్టి పోరాటం". ప్రేమ, సౌభ్రాతృత్వ స్ఫూర్తిని మరియు న్యాయం పట్ల జార్ఖండీల నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.

'మా పోరాటం సామాజిక న్యాయం కోసం'

"ఈ రోజు రాజకీయ విజయానికి గుర్తింపు కాదు. సామాజిక న్యాయం కోసం మన పోరాటాన్ని పునరుద్ఘాటించే రోజు. సామాజిక ఐక్యతను బలోపేతం చేయడానికి చేసే పోరాటం.’’ అని పేర్కొన్నారు. అబువా ప్రభుత్వం (స్వపరిపాలన) పాలన కోరుకున్న ప్రజలకు అభినందనలు అంటూ.. "జార్ఖండ్ నిరసనలు, పోరాటాలకు పుట్టిల్లు. భగవాన్ బిర్సా ముండా, సిడో-కన్హు వంటి వీరుల జన్మించిన గడ్డ. వారి స్ఫూర్తితో JMM ముందుకు సాగుతోంది.’’ అని అన్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సోరెన్ 39,791 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన గామ్లియెల్ హెంబ్రోమ్‌ను ఓడించి బర్హైత్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 81 మంది సభ్యులున్న అసెంబ్లీలో సోరెన్‌కు చెందిన జేఎంఎం నేతృత్వంలోని కూటమి 56 సీట్లు గెలుచుకోగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 స్థానాల్లో విజయం సాధించింది.

Tags:    

Similar News