లోడర్ జాబ్ ల కోసం ఉన్నత విద్యావంతులు.. గంటల తరబడి క్యూలైన్ లో..
దేశంలో నిరుద్యోగం ఎలా ఉందో ఒక్క చిత్రం ద్వారా చెప్పవచ్చు. ఎయిర్ పోర్ట్ లో లోడర్ ఉద్యోగాల కోసం దాదాపు 15 వేల మంది ఆశావాహాులు రావడంతో ఎయిర్ పోర్ట్ వద్ద...
By : Praveen Chepyala
Update: 2024-07-17 07:35 GMT
ముంబైలోని ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో లోడర్ వేకెన్సీల కోసం వేలాదిమంది నిరుద్యోగులు ఒక్కసారిగా రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగే పరిస్థితి నెలకొంది. ఎయిర్ పోర్ట్ లో 1800 ఖాళీలు ఉండగా రెజ్యూమ్ లు పట్టుకొని దాదాపు 15 వేల మంది అభ్యర్థులు నియామక ప్రాంగణానికి వచ్చారు. అప్లికేషన్ లు సమర్పించడానికి అభ్యర్థులు గంటల తరబడి క్యూలైన్ లో వేచి చూశారు.
పోస్ట్‌లకు కనీస అర్హత SSC / 10 వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించారు. అలాగే కనీస వయస్సు 23. జీతం రూ. 20,000 నుంచి 30,000 మధ్య ఉంటుంది. ఇది ఒకరు సంపాదించిన ఓవర్‌టైమ్ అలవెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. మూడు సంవత్సరాల పాటు స్థిర-కాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగం ఉంటుంది.
నిరుద్యోగాన్ని ప్రతిబింబిస్తోంది
దేశంలోని నెలకొని ఉన్న అధిక నిరుద్యోగానికి ఈ చిత్రం ప్రతిబింబిస్తోంది. అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరుకావడమే కాకుండా, కొంతమంది ఉన్నత విద్యావంతులు కూడా జాబ్ చేయడానికి సుముఖంగా ఉన్నారు. ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం, రెండవ సంవత్సరం BBA చేస్తున్న ఒక అభ్యర్థి 400 కి.మీ ప్రయాణించి ఇక్కడకు వచ్చారు. మరొకరు BA డిగ్రీ హోల్డర్, రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన మరో వ్యక్తి MCom పూర్తి చేశారు. అయినప్పటికీ ఎయిర్ పోర్ట్ లో లోడర్ గా చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
చాలా సేపు వేచి చూసిన అభ్యర్థులు..
ఈ ఉద్యోగం కోసం నిర్వాహకులు చాలా తక్కువ మొత్తం ఏర్పాట్లు చేశారు. కానీ ఆశావాహులు చాలా ఎక్కువ సంఖ్యలో రావడంతో వారంతా తలలు పట్టుకున్నారు. అభ్యర్థులు తమ రెజ్యూమ్ లు ఇవ్వడానికి గంటల తరబడి నీళ్లు, ఆహారం లేక నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో ఎయిర్ ఇండియా సిబ్బంది అభ్యర్థులు తమ రెజ్యూమ్ లు సమర్పించి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారికి సూచించారు.
ఏవియేషన్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ గిల్డ్ జనరల్ సెక్రటరీ, జార్జ్ అబ్రమ్ మాట్లాడుతూ.. దాదాపు 50 వేలమంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలు ఇంటర్వ్యూలను హజరయ్యారని, రిక్రూట్ మెంట్ ప్రక్రియ తప్పుగా చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి డ్రైవ్‌లు నిర్వహించవద్దని తాము కంపెనీని హెచ్చరించామని ఆయన చెప్పారు. దీంతో పోలీసులను పిలిపించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో ఉన్న నిరుద్యోగితను ఇది తెలియజేస్తోందన్నారు.
అంకలేశ్వర్ ఘటన
గుజరాత్‌లోని అంకలేశ్వర్‌లో ఒక ప్రైవేట్ సంస్థలో కేవలం 10 పోస్ట్‌ల కోసం సుమారు 2,000 మంది అభ్యర్థులు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టిన కొన్ని రోజులకే ఈ సంఘటన చోటు చేసుకుని మీడియా దృష్టిలో పడింది. అంక్లేశ్వర్ వీడియోపై కాంగ్రెస్ స్పందిస్తూ, “బిజెపి గుజరాత్ మోడల్‌ను బహిర్గతం చేసిందని” దేశవ్యాప్తంగా నిరుద్యోగం శాంపిల్ ను తెలియజేసిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
బీజేపీపై కాంగ్రెస్ ఆరోపణలు..
ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ వీడియో వైరల్ అయిన తర్వాత, ముంబై నార్త్ సెంట్రల్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ మాట్లాడుతూ, గత 10 ఏళ్లలో నిరుద్యోగ పరిస్థితి చాలా దారుణంగా మారిందని, యువకులు రష్యా- ఇజ్రాయెల్ లో యుద్ధాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు.
" ఉద్యోగాల గురించి విన్నప్పుడల్లా, వేలాది మంది ఆశావాహులు వస్తున్నారు. పరిస్థితి ఎలా ఉంటుందంటే... కొన్ని సార్లు తొక్కిసలాట జరుగుతుందనే భయం వేస్తోంది" అని గైక్వాడ్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు.