‘TVK విజయ్ ఒక వన్ మ్యాన్ షో లాంటివాడు’
తమిళగ వెట్రి కజగం పార్టీ గురించి, మీడియా ప్రస్తుత పరిస్థితి గురించి చాలా విషయాలు చెప్పిన సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్..
దేశంలో ప్రజాస్వామ్య పరిస్థితి, తమిళనాడులో కొత్త రాజకీయ శక్తుల ఆవిర్భావం గురించి ది హిందూ మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్, సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీడియా తీరుపై కూడా ఆయన మాట్లాడారు.
తొలుత ప్రస్తుత మీడియా తీరు గురించి చెబుతూ..
‘‘మీడియాలోని ఒక పెద్ద విభాగం. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఇండిపెండెన్సీని కోల్పోయింది. మీడియాను కేవలం ప్రచారం కోసమే ఉపయోగించరాదు. మొత్తం మీడియా అమ్ముడుపోయిందని నేను అనను. విలువలకు కట్టుబడి పనిచేసే జర్నలిస్టులు కూడా ఉన్నారు. అధ్యక్షురాలు సీమా ముస్తఫా నేతృత్వంలో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఆ పని చేస్తుంది. అయితే మీడియా పూర్తి స్వత్రంత్రంగా వ్యవహరించే రోజులు తిరిగి వస్తాయని నేను ఆశిస్తున్నా.
ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుందా? దానిపై మీ అభిప్రాయమేమిటి?
ఎన్నికల కమిషన్(Election commission) జవాబుదారీతనం లేకుండా పక్షపాత ధోరణి అవలంభిస్తోంది. ప్రస్తుత కమిషన్‌లో పారదర్శకత లోపించింది. రాజకీయ నాయకులు అడిగే ప్రశ్నలకు, వారి ఆరోపణలపై స్పందించే తీరు సరిగా లేదు. ఎన్నికల కమిషన్‌కు మెషిన్-రీడబుల్ రోల్స్‌ను రూపొందించాలని, ఆధార్‌ను చెల్లుబాటు అయ్యేలా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించడం సానుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు.
మీరు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్‌లో పనిచేశారు. వార్తలను విస్తృతంగా కవర్ చేశారు. అప్పటికి, ఇప్పటికి పొలిటికల్ అట్మాస్పియర్‌లో తేడాలేంటి?
ప్రస్తుత రాజకీయాలు మతతత్వం, హిందూత్వ భావజాలం చుట్టూ జరుగుతున్నాయి. 1970లో అలా కాదు. అప్పటి అత్యవసర పరిస్థితి ఒక భయంకర అనుభూతి. ప్రజాస్వామ్య సంస్థలు, హక్కులను అణిచేశారు. జర్నలిస్టులను నిర్బంధించారు. అత్యవసర పరిస్థితి ఉన్నా..ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగినందుకు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆ ఘనత దక్కాలి. ఇందిరా గాంధీ పాలన పూర్తిగా ఓడిపోయింది. ప్రజాస్వామ్యం తన బలాన్ని చూపించింది.
తమిళనాడులో కొత్త రాజకీయ పార్టీ (TVK) ఆవిర్భావాన్ని మీరెలా చూస్తారు?
పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. TVK పార్టీ చీఫ్ విజయ్(Actor Vijay) వ్యాఖ్యలు, ప్రసంగాలను చూస్తే..అవి కొంత అబద్ధమనిపిస్తుంది. ఆయనకు కొంత పొలిటికల్ ఎడ్యుకేషన్ అవసరమని అనుకుంటున్నా. రాజకీయ పరిణతి కావాలి. ఆయన ఎక్కడికి వెళ్లినా జనం బాగానే వస్తున్నారు. గతంలో చో రామస్వామి వంటి సినీ తారలు పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షించారు. ఎన్నికల వేళ వారి అంచనాలు తారుమారయ్యాయి. ఎన్‌టి రామారావు, అంతకు ముందు ఎంజి రామచంద్రన్ వంటి నటులు రాజకీయ శిక్షణ తీసుకున్నారు. ఎంజీఆర్ చాలాకాలం డీఎంకేలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా అనేక అంశాలపై ఎన్టీఆర్‌కు మంచి అవగాహన ఉంది. కానీ ఇక్కడ ఆ పునాది లేదు. నాయకుడిగా ఎదగాలనుకునే వ్యక్తిని ఎంతమంది ఆదరిస్తారో నాకు తెలియదు. వన్ మ్యాన్ షో విజయ్‌కు నా శుభాకాంక్షలు. రాజకీయాల్లోకి రావడానికి ఆయనకు పూర్తి హక్కు ఉంది. కానీ ప్రారంభం అంత గొప్పగా లేదు.