బిజీ రాజకీయాల నుంచి ఆధ్యాత్మికత వైపుకు ?

కవిత అడిగిన జపమాల, మెడిటేషన్ కు అనుమతివ్వమని, చదువుకోవటానికి ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవ్వమని తీహార్ జైలు అధికారులను రౌస్ ఎవిన్యు కోర్టు ఆదేశించింది.

By :  Admin
Update: 2024-04-11 04:27 GMT

   కల్వకుంట్ల కవిత దైనందిన జీవితంలో ఒక్కసారిగా మార్పొచ్చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటున్న కవిత తనకు జపమాల, చదువుకోవటానికి ఆధ్యాత్మిక పుస్తకాలు, మెడిటేషన్ చేసుకునేందుకు అనుమతి కోరారు. అలాగే చదువుకోవటానికి ఇతరత్రా పుస్తకాలను కూడా అడిగారు. అందుకు కోర్టు కూడా సానుకూలంగా స్పందించింది. కవిత అడిగిన జపమాల, మెడిటేషన్ కు అనుమతివ్వమని, చదువుకోవటానికి ఆధ్యాత్మిక పుస్తకాలు ఇవ్వమని తీహార్ జైలు అధికారులను రౌస్ ఎవిన్యు కోర్టు ఆదేశించింది.


   ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మామూలుగా బిజీగా ఉండే పొలిటీషీయన్లకు రోజుకు 24 గంటలు సరిపోవన్నట్లుగా ఉంటుంది షెడ్యూల్. ఉదయం లేచినదగ్గర నుండి అర్ధరాత్రి పడుకునేంతవరకు జనాలే జనాలు. ఇంట్లో ఉన్నా జనాలే బయటకు అడుగుపెట్టినా జనాలే ఉంటారు చూట్టూర. కల్వకుంట్ల కవిత కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రజాప్రతినిధే కాకుండా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కూడా. అందుకనే పదేళ్ళు ఊపిరి తీసుకోలేనంత బిజీగా గడిపేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కేసీయార్ మాజీ అయ్యేంతవరకు కవిత దైనందిన జీవితం ఆమె చేతిలో కూడా లేనంత బిజీగా ఉండేది.


   కేసీయార్ అలా మాజీ అయ్యారో లేదో లిక్కర్ స్కామ్ లో కవిత ఇలా అరెస్టయ్యారు. ఎలాగూ పార్టీ మీటింగులు, నియోజకవర్గంలో పర్యటనలు, నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఉండవు కదా. అందుకనే జైలులో తనకు దొరికిన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నట్లున్నారు. జపంచేసుకుంటు, మెడిటేషన్ చేసుకుంటు శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని డిసైడ్ అయినట్లున్నారు. మనిషికి రెండురకాలుగా విశ్రాంతి అవసరం. మొదటిది శారీరకంగా రెండోది మానసికంగా. శారీరక విశ్రాంతి అంటే నిద్రపోతే సరిపోతుంది. మరి మానసిక విశ్రాంతి ఎలా దొరుకుతుంది ? అందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలంతా మెడిటేషన్, జపం ఒకటే మార్గమని చెబుతుంటారు. అందుకనే కవిత కూడా జైలులో ఉన్నంతకాలం అదేదారిలో నడవాలని నిర్ణయించుకున్నారు.


   ఇంట్లో ఉన్నపుడు జపం, మెడిటేషన్ చేస్తారో లేదో, చేసేంత సమయం ఉంటుందో లేదో తెలీదు. తీహార్ జైలులో మాత్రం మెడిటేషన్ మొదలుపెట్టేశారు. జపమాల అందగానే జపం కూడా మొదలుపెడతారు. ఖైదీల్లో రకరకాలుంటారు. శిక్షపడిన ఖైదీలు, విచారణ ఖైదీలు, రాజకీయ ఖైదీలు, వీవీఐపీ ఖైదీలు. కవితకు చివరి మూడు వర్తిస్తాయి. అందుకనే జైలులో కావాల్సినంత సమయం దొరకుతుంది. మెడిటేషన్, జపం అన్నది మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది పైగా శరీరం, మనసుకు ఏకకాలంలో విశ్రాంతి కూడా దొరుకుతుంది. అందుకనే మెడిటేషన్ చేయటం, జపం చేసుకోవటం, ఆధ్యాత్మికపుస్తకాలు చదవటంతో గడపాలని నిర్ణయించుకున్నారు.

Tags:    

Similar News